ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ నేపథ్యంలో విభజన అంశాలపై చర్చించి కేంద్రం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెబుతారని అంతా ఆశించారు. కాని రాష్ట్ర సమస్యల ఊసే లేదు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామన్న భరోసాయే ఇవ్వలేదు. ఇంతకీ ఏపీ బీజేపీ సమావేశంలో ఏం జరిగింది?
ఎపి ఎన్నికలలో కూటమికి భారీ మెజార్టీ దక్కింది. బిజెపి నుంచి ముగ్గురు ఎంపిలు, ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులో ఒకరు కేంద్రమంత్రిగా..మరొకరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఎన్నికల తర్వాత జరిగిన ఏపీ బీజేపీ తొలి కార్యవర్గ సమావేశంలో విభజన సమస్యలపై చర్చించి ప్రజలకి బాసటగా నిలుస్తారని అందరూ భావించారు. పదేళ్లగా నానుతున్న విభజన సమస్యల పరిష్కారంకోసం రాష్ట్ర కార్యవర్గంలో చర్చ జరుగుతుందని ఆశించారు. కానీ రాజమహేంద్రవరం వేదికగా జరిగిన తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అసలు విభజన సమస్యల పరిష్కారంపై చర్చే జరగలేదు.
వాస్తవానికి ఎజెండాలో ఈ అంశాలేమీ లేకపోయినా ఏ నాయకుడూ కూడా విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామనే భరోసా ఇవ్వలేకపోయారు. 2014లో చంద్రబాబుతో కలిసి బిజెపి ప్రభుత్వం ఏర్నాటు చేసినప్పటికీ విభజన సమస్యల పరిష్కారానికి ఎపి బిజెపి నేతలెవరూ ప్రయత్నించలేదు. ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి రాత్రికి రాత్రి విజయవాడ వచ్చినా ఎపి బిజెపి నేతలెవరూ పెదవి విప్పలేదు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపైనా చోద్యం చూసారు తప్పితే ఎక్కడా నిలదీయలేదు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఎ నుంచి టిడిపి బయటకు వచ్చిన సమయంలో మాత్రమే పెదవి విప్పారు. అప్పుడు కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అన్యాయంపై గట్టిగా మాట్లాడలేకపోయారు.
ఆ తర్వాత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. మళ్లీ ఇపుడు అయిదేళ్ల తర్వాత ఎపి బిజెపికి అటు పార్లమెంట్ లో…ఇటు రాష్ట్ర అసెంబ్లీలో గళం విప్పడానికి ఎపి ప్రజలు అవకాశం ఇచ్చారు. విభజన సమస్యలపై మూడు రోజుల క్రితం జరిగిన తెలుగు రాష్ట్రాల సిఎంల సమావేశంలో కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని భావించారు. రెండు గంటల పాటు సమావేశం జరిగినప్పటికీ గతంలో పరిష్కారం వరకు వచ్చిన సమస్యలను కూడా ప్రస్తావించకుండానే ముగించారు.
ఇరు రాష్ట్రాల అధికారులతో ఒక కమిటీ…మంత్రులతో మరొక కమిటీలు వేసి సమస్యలు పరిష్కరిస్తామని…ఈ కమిటీల పరిధిలో పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సిఎంలు మరోసారి భేఠీ అవుతారని ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాల సిఎంల భేటీని ఆహ్వానించిన ఎపి బిజెపి నేతలు..తాము కూడా విభజన సమస్యలు పరిష్కారంలో సహకారం అందిస్తామని ఎక్కడా చెప్పలేకపోయారు.
రెండు రాష్ట్రాల సిఎంలు సమావేశం కావడం…విభజన సమస్యలు మళ్లీ తెరపైకి రావడంతో ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి నేతలు వీటిని ప్రస్తావిస్తారని ప్రజలు ఆశించారు.
ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ వ్యవహారం ముందుకు కదలడం లేదు. దీనిపై గత వైఎస్సార్ సిపి ప్రభుత్వం పార్లమెంట్ లో సైతం గట్టిగానే పోరాడినా అదిగో..ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటూ మభ్యపెట్టారు తప్పితే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని పలుమార్లు ప్రకటించిన ఎపి బిజెపి నేతలు మరోసారి మద్దతు ప్రకటించారు కానీ నిధుల తీసుకొచ్చేందుకు కేంద్రం ద్వారా ప్రయత్నిస్తామని ప్రకటించలేకపోయారు. అమరావతి, పోలవరం నిధుల గురించి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా సమావేశంలో ప్రస్తావించారు గాని, సమావేశంలో వీటిపై చర్చే జరగలేదు.
విభజిత సమస్యలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఎపికి న్యాయం జరిగేలా కార్యచరణ రూపొందించుకోవాలనే ఆలోచనే రాష్ట్ర బీజేపీ నేతల్లో కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి నెలరోజులే కావడంతో బిజెపిలో గెలుపు ఆనందం మాత్రమే కనిపిస్తోంది. అందుకే తొలి సమావేశంలో కేవలం అభినందనలకే పరిమితమయ్యారంటున్నారు. భవిష్యత్ లో విభజన సమస్యలపై ప్రత్యేకంగా రాష్ట్ర కార్యవర్గం చర్చించే అవకాశాలున్నాయని..కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి విభజన సమస్యలు పరిష్కరించే ఆలోచన ఎపి బిజెపికి ఉందని కొందరు నేతలంటున్నారు. మరి ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఎంతకాలం పడుతుందో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…