పురందేశ్వరిని తప్పిస్తారా?

By KTV Telugu On 13 July, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆ పదవినించి తొలగించి మరో బాధ్యతను అప్పగిస్తారనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చాలని బిజెపి అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా మార్పు వుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఏపీ బిజెపి అధ్యక్షరాలిగా వున్న పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలుపొందడంతో ఆమెను అధ్యక్ష పీఠాన్నించి తప్పిస్తారనే  ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆమె స్థానంలో మరొకరిని నియమించాలనే డిమాండ్‌ పార్టీలో రాను రాను గట్టిగా వినిపిస్తోంది.

ఎన్నికల ముందు టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని బిజెపి శ్రేణులు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని..పార్టీ అధ్యక్ష స్థానంలో పురందేశ్వరి వుంటే ఆ పని సరిగా జరగదని పలువురు బిజెపి సీనియర్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.  ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపికి కొత్త రధసారధి ఉంటేనే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్ధితులు ఉంటాయనేది సీనియర్లు వాదన.

గత ఎన్నికల సమయంలో విశాఖ ఎంపి టిక్కెట్ కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు తీవ్రస్ధాయిలో ప్రయత్నించి విఫలమయ్యారు.. అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ ఎంపి, కదిరి అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు.  పార్టీలో ఎప్పటినుంచో వున్నఈ ఇద్దరు నేతలకు న్యాయం చేయాలని వారిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అందిస్తే సమర్థవంతంగా నడిపి బలోపేతం చేస్తారని బిజెపిలో ఒక వర్గం పట్టపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఎపి బిజెపి అధ్యక్ష రేసులో ఈ ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు నేతలతోపాటు  మరికొందరు సీనియర్ నేతలు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షపీఠంకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధిష్టానం వద్దకి కూడా ఏపీ అధ్యక్ష పదవి పంచాయితీ చేరినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం అధ్యక్ష మార్పుపై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. ఎంపీ  పురందేశ్వరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.  చకాంగ్రెస్ అపజయం పాలైన తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి  2014 లో బిజెపి గూటికి చేరారు.

పార్టీలో మహిళా మోర్చాతో పాటు వివిధ విభాగాలలో పనిచేశారు. అలాగే ఒరిస్సా రాష్ట్ర ఇన్ చార్జిగానూ వ్యవహరించారు.

గత ఏడాది జులై నెలలో ఆమె ఆంధ్రప్రదేశ్‌ బిజెపి అధ్యక్షరాలిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పురందేశ్వరి సారధ్యంలో ఎపిలో పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్ధానాలకి బిజెపి పోటీ చేస్తే మూడు పార్లమెంట్ , ఆరు అసెంబ్లీ స్ధానాలలో విజయం సాధించింది. ఈ విజయంతో ఎపి బిజెపిలో కొత్త జోష్ వచ్చింది.

ఈ నేపధ్యంలో ఎంపిగా ఎన్నికైన పురందేశ్వరి సేవలను విస్తృతస్ధాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఆమెను మరోసారి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ చార్జిగా పంపవచ్చనే ప్రచారం జరగుతోంది. పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని ఏడాది కాలమే అవ్వడంతో అధ్యక్ష మార్పు ఉండకపోవచ్చునని ఆమె వర్గీయులు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది వరకు ఆమెకు అవకాశముంటుందని వారు చెబుతున్నారు.

గతంలో 2014-19 మధ్యలో విశాఖ ఎంపిగా ఉన్న హరిబాబు అదే సమయంలో రాష్ట్ర అద్యక్షుడిగా ఏకకాలంలో పనిచేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.ఎంపీగా  ఎన్నికైనంతన మాత్రాన అధ్యక్ష బాద్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని హరిబాబు వ్యవహరాన్ని ఉదహరిస్తున్నారు.ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం…అదే సామాజిక వర్గానికి చెందిన హరిబాబు బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండటం జరిగిందని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు కూడా మళ్లీ చంద్రబాబు సిఎం అయ్యారు కాబట్టి ఆ కుటుంబానికే చెందిన పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఉండటం వల్ల అటు బిజెపికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉంటుందని పురంధేశ్వరి వర్గీయులు చెబుతున్నారు. ఎన్నికల ఏడాదిలో బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి పార్టీని విజయవంతంగా  నడిపారని….మూడు ఎంపి…ఆరు అసెంబ్లీ స్ధానాలు గెలుపొందడంలో అధ్యక్షురాలిగా ఆమె పాత్ర ఉందనేది ఆమె వర్గీయుల వాదన.

ఆంధ్రప్రదేశ్‌ లో బిజెపిని  బలోపేతం చేయాలంటే పురంధేశ్వరిని తప్పించి సీనియర్లకు ఇవ్వాలనేది మరో వర్గం చెబుతున్న మాట.

ఈ సమయంలో పార్టీని విస్తరించాలంటే సమర్ధవంతంగా పార్టీపైనే ఎక్కువ ఫోకస్ చేసే సీనియర్ నాయకుడు అధ్యక్షుడిగా ఉండాలని వారు అంటున్నారు.  పురందేశ్వరి ఎంపిగా ఉండటంతో పార్టీపై దృష్టి సారించే అవకాశం సరిగ్గా ఉండకపోవచ్చునని వారు విశ్లేషిస్తున్నారు.

మరి అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి