మరోసారి జగన్ క్యాబినెట్ ప్రక్షాళన..వారిపై వేటు

By KTV Telugu On 18 February, 2023
image

ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుందా. ఎమ్మెల్సీ ఎన్నికల జాతర సాగుతున్న వేళ నలుగురు, ఐదుగురు మంత్రులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తయిందని చెబుతున్నారు. ఈ నెలాఖరులో విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సామాజిక సమీకరణాల ఆధారంగా తొలి సారి అయిదుగురు డిప్యూటీ సీఎంలతో కలిపి 25 మందితో తొలి కేబినెట్ రూపకల్పన చేసారు. వారిని రెండున్నరేళ్లకు మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అదే విధంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూ మరో 14 మందికి కొత్తగా ఛాన్స్ ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సీఎం జగన్ ఊహించని విధంగా మరోసారి కేబినెట్ ప్రక్షాళన చేయనున్నారనే వార్త పార్టీలో కలకలం రేపుతోంది. ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా వ్యూహాత్మకంగా కొత్తవారిని ఎంపిక చేస్తున్నారని సమాచారం.

గుంటూరు జిలా నుంచి జగన్ ఒకరిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. కీలక శాఖ నిర్వహిస్తున్న ఓ మహిళా మంత్రిని తొలగించి ఆమె స్థానంలో సుదీర్ఘ కాలం పార్టీ కోసం పని చేస్తున్న నేతకు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించనున్నారట. గత ఎన్నికల్లో విడుదల రజినీ కారణంగా మర్రి రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వలేకపోయారు జగన్. అయితే అధికారంలోకి వచ్చాక మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా రాయలసీమ నుంచి ఓ మంత్రిని తప్పిస్తారని గోదావరి జిల్లాలోని సీనియర్ మంత్రిని వ్యక్తిగత కారణాలతో తప్పిస్తున్నట్లు సమాచారం. అనుభవం, వయసు తక్కువే అయినా మంత్రిగా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవటంలో వెనుకబడిన మరో మంత్రిని తప్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వారి స్థానాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు.

ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుకు సంబంధించి సర్వేలు తెప్పించుకుంటున్నారు జగన్. తీరు మార్చుకోకపోతే టికెట్ రాదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడా మంత్రుల పని తీరు ఆధారంగానే వారిపై వేటు వేసేందుకు జగన్ సిద్దమవుతున్నారు. దాంతో హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవుల జాతర మొదలైంది. మార్చి 24వ తేదీ వరకు 14 స్థానాలు, మే ఒకటో తేదీకి 7 మొత్తంగా 21 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఇటు గవర్నర్‌ కోటాలో నియమితులైన మరో ఇద్దరి పదవీకాలం జులై 20తో ముగియనుంది. పెద్ద ఎత్తున MLC ఖాళీలు అవుతుండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ కోసం సేవ చేసి పదవులు దక్కని వారికి మాత్రమే జగన్ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు సీఎం జగన్ ఎవరిని తప్పిస్తారు ఎవరిని కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.