అనుకున్నంత ఈజీ కాదు.. అదో సాహసమే!
గుజరాత్‌లో ఏడోసారి కూడా బీజేపీ ఎలా గెలిచింది. పోనీ మామూలు గెలుపా అది. గుజరాత్ చరిత్రలోనే అంత మెజారిటీ సరికొత్త రికార్డు. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయలేదు. ఆమ్ఆద్మీ మంత్రం పారలేదు. రాహుల్‌పాదయాత్ర కాంగ్రెస్‌ని లేపలేదు. పోనీ గుజరాత్‌లో బ్రహ్మాండం బద్దలయ్యేంత అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు. మరి బీజేపీకి ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైందని ప్రత్యర్థులు జుట్టు పీక్కుంటున్నారు. వెరీ సింపుల్ బతిమాలడాలు, భయపడటాలు లేవు. క్యాండేట్ మీద డౌటొస్తే పక్కన పెట్టేసింది కమలం పార్టీ. ధైర్యంగా నాయకత్వ మార్పుపై నిర్ణయాలు తీసుకుంది.
ఎన్నికలకు ఏడాది ముందు ముఖ్యమంత్రిని మార్చడమంటే రిస్క్ తీసుకోవడమే. అయినా బీజేపీ ఆ పని చేసింది. విజయ్ రూపానీని మార్చి భూపేంద్రపటేల్‌ని గద్దెనెక్కించింది. పోనీ రూపానీ అలగకుండా ఆయన మనుషులనైనా కేబినెట్‌లోకి తీసుకుందా అంటే అదీలేదు. రూపానీ కేబినెట్‌లోని మంత్రులలో చాలా మందికి మళ్లీ పదవులే కాదు ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వలేదు. మాజీ సీఎంతో పాటు 42 మంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్లు దక్కలేదు. 2017లో గెలిచినవారిలో దాదాపు సగంమందికి ఛాన్సివ్వలేదు.
విపక్షాల బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లి పక్కా వ్యూహంతో గుజరాత్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్ అసలు పోటీనే కాదని గాలి తీసేసింది. చివరికి అదే జరిగింది. గుజరాత్‌లో కమలంపార్టీ వ్యూహాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కొన్నిచోట్ల పార్టీలోనే వారికి ప్రత్యర్థులున్నారు. ఇప్పటికే సర్వేల్లో సరైన ఫీడ్‌బ్యాక్ లేకపోతే పక్కనపెట్టేస్తానని జగన్ సంకేతాలిచ్చారు. ప్రజల్లోకి వెళ్లని నేతల్ని గుర్తించి హెచ్చరికలు చేస్తున్నారు. ఇవన్నీ ఓకేగానీ ఎన్నికలు వచ్చేసరికి సగంమందిని పక్కన పెట్టాల్సి వస్తే వైసీపీ అంత ధైర్యం చేయగలదా అన్నది అనుమానమే.
గుజరాత్‌లో ఈసారి బీజేపీ దాదాపు వందసీట్లలో బీసీలకు అవకాశమిచ్చింది. దగ్గరదగ్గర అన్నే సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు వైసీపీ అన్ని సీట్లు ఇవ్వగలదా? సగంమంది బలహీనవర్గాల అభ్యర్థులతో ఎన్నికలకు సిద్ధంకాగలదా? రాయలసీమలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని పక్కనపెట్టే సాహసం చేయగలదా? తిరుగుబాట్లు, వెన్నుపోట్ల గురించి భయపడకుండా గుజరాత్‌లో బీజేపీలో తెగింపు నిర్ణయం తీసుకోడం అంత సులువేం కాదు. జాతీయపార్టీగా బీజేపీ ఎన్ని సాహసాలు చేసినా నడుస్తుంది. కానీ ప్రాంతీయపార్టీ ఆ ప్రయత్నం చేయాలంటే చాలా లెక్కలుంటాయి. అందుకే జయహో అంటూ బీసీ సభ పెట్టినంత సులువేం కాదు సగంమందికి టికెట్లివ్వడం. ఏదయితే అయిందని వైసీపీ అధినేత ఆ ధైర్యం చేస్తే తెలుగురాష్ట్రాల్లోనే అదో పెద్ద సంచలనం అవుతుంది. మరి రాయలసీమ ముద్దుబిడ్డ ఆ సవాలుకు సిద్ధమా?