ఫుల్ క్లారిటీతో జగన్.. విపక్షం డిఫెన్స్
జయహో కాదు భయహో అని పెట్టాల్సిందని టీడీపీ ఎద్దేవా చేసింది. జయహో బీసీ అన్నది తన పేటెంటెడ్ స్లోగన్ అని చెప్పుకుంది. కానీ ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుంది సీఎం జగన్మోహన్‌రెడ్డి దూకుడు. వైనాట్ 175 అని వైసీపీ అన్నప్పుడల్లా టీడీపీకి చిర్రెత్తుకొస్తోంది. అంటే ఏంటీ..చంద్రబాబు కూడా గెలవరనా అని ఉక్రోషపడుతోంది. కానీ జగన్ మాటల్లోని కాన్ఫిడెన్స్ వెనుక పక్కా వ్యూహం ఉంది. అది జయహో బీసీ సభతో అందరికీ తెలిసింది.
విజయవాడ బీసీ మహాసభతో బలహీన, వెనుకబడిన వర్గాలకు గట్టి సందేశమిచ్చింది వైసీపీ. తమది బీసీ పక్షపాత ప్రభుత్వమని సాధికారికంగా చెప్పటంలో వైసీపీ నేతలు సఫలమయ్యారు. వాలంటీర్ వ్యవస్థనుంచి రాజ్యసభ దాకా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గణాంకాలతో చెప్పగలిగారు. తన వయసు 49 ఏళ్లన్న జగన్ చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45ఏళ్లు అయ్యిందంటూ ఆయన వయోభారాన్ని చెప్పకనే చెప్పారు. మరో 30 ఏళ్లు ఉత్సాహంగా పనిచేసే వయసు తనదని, అంత అనుభవం ఉండీ ఒంటరిపోటీకి చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
2024లో గెలిపిస్తే సరేసరి లేకపోతే అవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. అయితే యుద్ధానికి ముందే ఆయన అస్త్ర సన్యాసం చేసినట్లయింది. సెంటిమెంట్‌తో కొడదామనుకున్న ప్రయత్నం బూమరాంగ్ అయింది. మరోవైపు సంక్షేమ పథకాలకు తోడు పక్కా సామాజిక సమీకరణాలతో వైసీపీ అన్నివైపులనుంచీ నరుక్కుంటూ వస్తోంది. బీసీలకు పెద్దపీటంటే ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషిన్లు కాదంటూ టీడీపీ చెప్పుకుంటున్న సంక్షేమంపై సభ సాక్షిగా చాకిరేవు పెట్టేసింది. బీసీలకోసం ప్రకటించిన కార్పొరేషన్లు దిష్టిబొమ్మల్లా మిగిలాయన్నది టీడీపీ ఆరోపణ. బీసీ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న వైసీపీ అలాంటి లోటుపాట్లు సరిచేసుకుని టీడీపీకి వేలుపెట్టే అవకాశం లేకుండా చేయాలనుకుంటోంది. ఇదేం ఖర్మంటూ తిరుగుతున్న చంద్రబాబు ఈ వ్యూహాలని ఎలా తిప్పికొడతారో మరి!