ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో ప‌లువురు ముఖ్యమంత్రుల వారసులు

By KTV Telugu On 13 April, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నిక‌ల బ‌రిలో  ప‌లువురు మాజీ  ముఖ్యంత్రుల  త‌న‌యులు..త‌న‌య‌లు  అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మ‌రో మాజీ ముఖ్యమంత్రి మ‌న‌వ‌డు కూడా పోటీ చేస్తున్నారు.ఒక ముఖ్యమంత్రికి త‌న‌యుడే కాకుండా త‌నే ముఖ్యమంత్రిగా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. సో ఈ సారి ఎన్నిక‌ల్లో  విఐపీ నియోజ‌క వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. మాజీ సిఎంల వార‌సుల్లో  ఎవ‌రెవ‌రు స‌త్తా చాటుతార‌న్నది  జూన్ 4న తేలుతుంది.

ఏపీలో  మే 13న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య  యుద్ధమే అంటున్నారు రాజ‌కీయ పండితులు. ఈ ఎన్నిక‌ల్లో  చాలా మంది మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు   పోటీ చేస్తున్నారు. వారిలో కొంద‌రు ముఖ్యమంత్రులు జీవించి లేరు.  ప్రస్తుతం జీవించి ఉన్న  మాజీ  ముఖ్యమంత్రుల్లో ఇద్దరు త‌మంత‌ట తామే పోటీ చేస్తుండ‌గా మ‌రో సిఎం త‌న‌యుడు ఎమ్మెల్యే అవ్వాల‌ని ఆరాట ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుడు గెలిచి త‌మ పార్టీ గెలిస్తే ఆయ‌న్ను సిఎంని చేసుకోవాల‌ని ఓ మాజీ సిఎం ఆశిస్తున్నారు.

దివంగ‌త ముఖ్యమంత్రి టిడిపి వ్యవ‌స్థాప‌కుడు   ఎన్టీయార్  త‌న‌య ఏపీ బిజెపి చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వరి రాజ‌మండ్రి  లోక్ స‌భ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఆమె త‌మ్ముడు నంద‌మూరి బాల‌కృష్ణ  హిందూపురం అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుండి పోటీ చేస్తున్నారు. బాల‌య్య వియ్యంకుడు  నారా చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేష్  మంగ‌ళ‌గిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరిలో ఓడిపోయిన లోకేష్ ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. బాల‌య్య గ‌త ఎన్నిక‌ల్లోనూ హిందూపురం నుంచే పోటీ చేసి విజ‌యం సాధించారు.

దివంగ‌త ముఖ్యమంత్రి  కాంగ్రెస్ నాయ‌కుడు వై.ఎస్.రాజ‌శేఖ‌ర రెడ్డి కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెల్లెలు వై.ఎస్.ఆర్. గారాల ప‌ట్టి ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున క‌డ‌ప లోక్ స‌భ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. మ‌రో మాజీ ముఖ్యమంత్రి నేదురు మ‌ల్లి జ‌నార్ధన రెడ్డి కుమారుడు నేదురు మ‌ల్లి రామ్ కుమార్  రెడ్డి  నెల్లూరు జిల్లా వెంక‌ట గిరి నియోజ‌క వ‌ర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు. త‌న తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని  కొన‌సాగించాల‌ని రామ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.

మ‌రో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర‌రావు కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్  జ‌న‌సేన పార్టీ అభ్యర్ధిగా తెనాలి అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి చివ‌రి స్పీక‌ర్ గా వ్యవ‌హ‌రించిన మ‌నోహ‌ర్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏ స‌భ‌కీ ఎన్నిక కాలేదు. ఈ సారి అయినా గెలిచి ఎమ్మెల్యే అనిపించుకోవాల‌ని ఆయ‌న త‌హ త‌హ లాడుతున్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన దివంగ‌త సిఎం కోట్ల విజ‌య భాస్కర రెడ్డి కుమారుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి  ధోన్ నియోజ‌క వ‌ర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కుప్పం నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి చివ‌రి ముఖ్యమంత్రిగా చ‌రిత్రలో నిలిచిపోయిన  కిర‌ణ్ కుమార్ రెడ్డి  ఈ సారి బిజెపి అభ్యర్ధిగా రాజంపేట ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. డ‌బ్భైల‌లో ముఖ్యమంత్రిగా వ్యవ‌హ‌రించిన కాసు బ్రహ్మానంద రెడ్డి మ‌న‌వ‌డు కాసు మ‌హేష్ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్ఎస్ పార్టీ అభ్యర్ధిగా  గుర‌జాల అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుండి పోటీ చేస్తున్నారు. వేర్వేరు నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేస్తోన్న ఈ వార‌సులంతా విజ‌యాలు సాధిస్తే  ఆయా రాజ‌కీయ కుటుంబాల్లో పండ‌గ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంటుంది. వీరి జాత‌కాల‌న్నీ కూడా జూన్ 4న తేలిపోతాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి