ఏపీలో అప్పుచేసి ప‌ప్పుకూడు.. నిజ‌మేనా?

By KTV Telugu On 26 December, 2022
image

ఏపీ ప‌రిమితుల‌కు మించి అప్పుచేస్తోంది. అప్పుచేసి ప‌ప్పుకూడు తింటోంది. ప్ర‌తిప‌క్షాల నోట త‌ర‌చూ ఇదే మాట వినిపిస్తోంది. కేంద్రం కూడా అప్పుడ‌ప్పుడూ అప్పుల లెక్క‌లు బ‌య‌టికి తీస్తోంది. అప్పుచేస్తే ఎప్ప‌టిక‌ప్పుడు తీర్చాలి. లేక‌పోతే వ‌డ్డీల‌తో క‌లిసి త‌డిసిమోప‌డ‌వుతుంది. వ్య‌క్తుల‌కైనా, వ్య‌వ‌స్థ‌ల‌కైనా ఇందులో ఎలాంటి మిన‌హాయింపూ ఉండ‌దు. రాష్ట్ర‌బ‌డ్జెట్‌, ఆదాయ‌వ్య‌యాలు, అప్పులు అనేవి సామాన్యుడికి ఓ ప‌ట్టాన అర్ధంకావు. అయితే ప‌దేప‌దే ప్ర‌చారంతో నిజ‌మ‌ని న‌మ్మే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే ఈమ‌ధ్య ఏ మీటింగ్‌లోనైనా రాష్ట్ర ఆర్థిక‌ప‌రిస్థితి గురించి అన్యాప‌దేశంగా ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.

అప్పులు ఇవాళ కొత్తేం కాదు. ఏ ప్ర‌భుత్వం ఉన్నా అప్పు అనివార్యం. ఇంత ఆదాయం ఉండి కూడా కేంద్ర‌ప్ర‌భుత్వం చేయ‌డంలేదూ. రాష్ట్రాల‌కు కూడా త‌ప్ప‌దు. అయితే అది ఎంత‌వ‌ర‌కు అన్న‌దే ప్ర‌శ్న‌. త‌మ పాల‌న‌లో ఏనాడూ పైసా అప్పుచేయ‌లేద‌న్న‌ట్లు టీడీపీ మాట్లాడ‌టం త‌ప్పు. అవ‌స‌రాలు, ఆర్థిక‌ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అప్పులు కూడా పెరుగుతుంటాయి. అందుకే టీడీపీ హ‌యాంలో చేసిన అప్పుల‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌చారాన్ని తిప్పికొడుతోంది వైసీపీ. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులకంటే తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేస్తోంద‌ని ఏపీ సీఎం ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

టీడీపీ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని చెప్పేందుకు బీజేపీ నేత‌లు కూడా గొంతు క‌లుపుతున్నారు. కేంద్రంనుంచి రాష్ట్రానికి న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన నిధుల‌ గురించి ప్ర‌య‌త్నాలు చేయ‌రు. కానీ బుర‌ద‌చ‌ల్ల‌టంలో మాత్రం పోటీప‌డుతుంటారు. అందుకే త‌న ప్ర‌సంగాల్లో అప్పుల ప్ర‌స్తావ‌న కావాల‌నే చేస్తున్నారు ఏపీ సీఎం. అయితే కేవ‌లం ఓ ఖండ‌న కింద ఓ మాట‌నేస్తే ఆ వాద‌న నిల‌బ‌డ‌ద‌న్న అభిప్రాయం కూడా ఉంది. నిజంగా త‌క్కువ అప్పులుచేస్తే గ‌ణాంకాల‌తో ప్ర‌జ‌ల ముందు పెడితేనే ఆ వాద‌న నిలుస్తుంది. పైగా ఇది సీఎం ఒక్క‌డి బాధ్య‌తే కాదు. ఆయ‌న్ని కీర్తించ‌డంలో పోటీప‌డే పార్టీ నేతుల కూడా దీనిపై హేతుబ‌ద్ధమైన వాద‌న వినిపిస్తేనే ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు అర్ధ‌మ‌వుతాయి.