ఏపీలో రాజధాని అంశం హీటెక్కిస్తోంది. విశాఖ నుంచి పరిపాలనకు సిద్ధమవుతోన్న జగన్ సర్కార్ రాజధాని అంశాన్ని తొందరగా తేల్చుకోవాలని ఆరాటపడుతోంది. సుప్రీంకోర్టులో త్వరగా దీనిపై విచారణ జరిగి అడ్డంకులు తొలగిపోతే ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిపెట్టొచ్చనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే కేసు విచారణ ఆలస్యమవుతుండడంతో కొంత ఆందోళనకు గురవుతోంది. గత సోమవారం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతి కేసులను విచారించాలని కోరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణకు నిర్ణయించింది. అయితే మరోసారి విచారణ సాధ్యమైనంత త్వరగా చేయాలని ప్రభుత్వ తరపున న్యాయవాదులు తాజాగా ధర్మాసనాన్ని కోరగా 28వ తేదీనే విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఇష్యూ కాక రేపుతోంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. మూడు రాజధానులు చేసి తీరుతామని పాలకులు అంటున్నారు. త్రీ క్యాపిటల్స్ అజెండాగా జగన్ సర్కార్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టులో కేసు పరిష్కరించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభిచాలనేది అధికార పార్టీ ఆలోచన. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. అయితే తాజా కోర్టు నిర్ణయంతో మరికొన్ని రోజులు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది నవంబర్‌లో అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
రాజధాని వ్యవహారం సుప్రీంలో పెండింగ్‌లో ఉండగానే మూడు రాజధాలే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై ధర్మాసనం నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకు తగినట్లుగా సీఎం జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామని ప్రకటనలు చేస్తున్నారు. ఉగాది నుంచి విశాఖనే ఏపీకి రాజధాని కాబోతుందని చెబుతున్నారు. విశాఖలో సీఎం ఉండేందుకు నివాస భవనం కూడా సిద్ధమైందని చెబుతున్నారు. సీఎం జగన్ కొద్ది రోజులు అమరావతి మరికొన్ని రోజులు విశాఖలో ఉండి పరిపాలన సాగిస్తారనే కథనాలు వస్తున్నాయి. అయితే ఉగాది తర్వాతే సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై విచారణ జరగనుండడంతో అప్పటివరకు వెయిట్ అండ్ సీ అంటున్నారు. రాజధాని అంశంపై సుప్రీం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.