బ్యూరోక్రాట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్ లు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారు. నేతలకు సొంతపనులు చేసి పెట్టే బృందాలుగా విడిపోయారు. తమను ఆదరించిన అధికార పార్టీ పెద్దలు ఏ పని చేబితే అది చేస్తూ.. కర్తవ్యాన్ని, నిబద్ధతను కోల్పోయారు. శాంతి భద్రతల కంటే యస్ బాస్ అనే పనులకే ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ తీరు ఎక్కువగా ఉందనేదుకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా నిలుస్తాయి. అడ్డంగా బుక్కయిన సీనియర్ ఐపీఎస్ లు ఇప్పుడు కక్కలేక మింగలేక బక్కచిక్కి చచ్చిపోతున్నారు. ఎటు నుంచి ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు….
జగన్ పాలనలో పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఐపీఎస్ లు డొమెస్టిక్ సర్వెంట్లుగా మారారని కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే నాయకుల ఇంటి పనులు చేసి పెట్టే సేవకులుగా ఉన్నారని కొందరు వ్యాఖ్యానించారు. కట్ చేసి చూస్తే ఆ వ్యాఖ్యలు నిజమని ఒక్కొక్క సంఘటన నిరూపిస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వేరు, అతిగా పూసుకుని వ్యవహరించడం వేరు. గత ఐదేళ్లలో కొందరు ఐపీఎస్ లు అతిగా పూసుకుని వైసీపీకి జీ హుజూర్ అన్నారు.అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవించే రోజులు వచ్చేశాయి. అధికార దుర్వినియోగానికి మూల్యం చెల్లించుకునే టైమ్ వచ్చింది. ఇప్పటికే కొందరు అధికారులను చంద్రబాబు జీఏడీకి పరిమితం చేసింది. అక్కడకు కూడా వెళ్లకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకుండా వాళ్లు రౌడీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. రోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిన కొందరు ఐపీఎస్ లు అటు వైపే వెళ్లడం లేదు. పోస్టింగ్ దక్కని 16 మంది అధికారుల్లో చాలా మంది అసలు డీజీపీ ఆఫీసు మొహం చూడటం లేదు. ఈ లోపు ముంబై హీరోయిన్ కథ బయటకు వచ్చింది. ఎవరో రాజకీయ పెద్దలు చెప్పారని కొందరు కాదంబరీ జెత్వానీని ముంబై నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు కాదంబరీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినప్పుడు ఆమె ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ లు కాంతి రాణా టాటా, విశాల్ గున్సీ స్వయంగా జోక్యం చేసుకుని ముంబై వరకు నడిపిన మంత్రాంగం ససాక్ష్యంగా బట్టబయలు కావడం ప్రస్తుత ఐపీఎస్ ల తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. పైగా మొత్తం వ్యవహారాన్ని మరో ఐపీఎస్ అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు నడిపించారని కూడా చెబుతున్నారు. వారిపై చర్యలకు తొలి అడుగు పడిందనే అనుకోవాలి. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నా కూడా పూర్తి సాక్ష్యాలుండారు.పోలీసు శాఖ ఇప్పుడు అదే పనిలో ఉంది.
తప్పు చేసేందుకు, అడ్డదిడ్డంగా వ్యవహరించేందుకు పోలీసులు భయపడాలి. ఆశ్రిత పక్షపాతం కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అందుకే దారితప్పిన అధికారులపై కఠిన చర్యలుండాలి. విధి నిర్వహణ వేరు.. యస్ బాస్ అనడం వేరు అని ప్రతీ ఒక్క అధికారికి అర్థమయ్యేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే గత తప్పిదాలు పునరావృతం కాకుండా ఉంటాయి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…