కడప అంటే ఫ్యాక్షన్ అని పేరు పడిపోయింది. ఫ్యాక్షన్లు పోయి చాలా కాలమైనా జనం మాటల్లో ఇంకా ఆ ట్రెండ్ కొనసాగుతోంది. పైగా కడప అంటే రిగ్గింగ్, బూత్ క్యాప్చురింగ్ అని కూడా ప్రచారమవుతోంది. అక్కడ నిజాయతీగా ఎన్నికలు జరిగినా విశ్వసించేందుకు జనం సిద్ధంగా లేరు. కడప అంటే వైఎస్ కుటుంబ ఇలాకా అన్న ముద్ర కూడా పడిపోయింది. జనం మనస్ఫూర్తిగా ఎన్నికల్లో ఓటేసినా..భయపడి ఓటేసినట్లు ఆరోపణలు వినిపిస్తుంటాయి. మరి ఇప్పుడేం జరుగుతోంది..
కడప లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఇదీ నిజంగా ఈ సారి మిలియన్ డాలర్ల ప్రశ్న. వివేకా హత్య తర్వాత కడప రాజకీయాలు మారిపోయానుకున్నారు. జనంలో మార్పు వచ్చి అధికారపార్టీని ఓడిస్తారనుకున్నారు. అలాంటి వారి ఆశ నిజమో కాదో ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ప్రస్తుత ఎంపీ అవినాశ్ రెడ్డిని దూరం పెడతారనుకుంటే జగన్ ఆయన్ను మళ్లీ పిలిచి టికెటిచ్చారు. ఇదీ ప్రత్యర్థులకు వరంగా మారందో లేదో కూడా చెప్పలేము. మరో పక్క టీడీపీ అభ్యర్థి కోసం వేట మొదలైంది. తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే ఆరుగురు పేర్లు తెరమీదకి తెచ్చింది. అయినా అభ్యర్థి ఖరారు మాత్రం జరగలేదు. ఏడాది క్రితమే కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్లమెంటుపై తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతో ఉందని భావించారు.పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు. అయితే శ్రీనివాసరెడ్డి పార్లమెంటుపై అనాసక్తి వ్యక్తం చేస్తూ రావడం, దృష్టంతా ఆయన సతీమణి మాధవీరెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడప అసెంబ్లీ పైనే పెట్టడంతో పార్లమెంట్ పై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిందనే చెప్పాలి. ఈ పరిస్తితుల్లో పార్టీ అధిష్టానం మరో అభ్యర్థిని ఖరారు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇప్పటివరకు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేర్లు కొంతకాలం వినిపించాయి. ఆ తర్వాత ఇటీవల కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరు శివారెడ్డి పేరు ఆ వరుసలో వినిపించింది.వారం రోజుల క్రితం ఈయనపై సర్వే కూడా చేశారు. దీంతో వీర శివారెడ్డి పేరే ఖరారు అవుతుందని భావించారు. అయితే తాజాగా జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్చార్జిగా ఉండి టిక్కెట్ తనకే అనుకున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి పై పార్లమెంట్ అభ్యర్థిగా సర్వే జరగడం ,ఆయనతో పాటు బద్వేలు మాజీ ఎమ్మెల్యే తనయుడు రితీష్ రెడ్డి పేరు పైనా సర్వే చేయడంతో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు ? ఎప్పటిలోగా స్పష్టత ఇస్తారు అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ గా మారింది
టీడీపీ సంగతి సరే సరి. కాంగ్రెస్ తరపున షర్మిలా రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. దీనితో ఉత్కంఠ పెరుగుతోంది. పైగా జాగ్రత్తగా ఉండకపోతే అర్హత లేని అభ్యర్థికి ఓటెయ్యాల్సి వస్తుందన్న బాధ కడప జనంలో ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి…..
జగన్ ను దెబ్బకొట్టాలంటే కడప లోక్ సభకు షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు మీడియా వార్తలు గుప్పుమన్నారు. షర్మిల కూడా వాటిని ఖండించలేదు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని పీసీసీ అధ్యక్షురాలు ప్రకటించారు. దానితో ఆమె రంగంలోకి దిగితే అవినాశ్ కు గట్టి పోటీ అవుతారన్న చర్చ మొదలైంది. అదే టైమ్ లో ఓడిపోతే పొలిటికల్ లైఫ్ రిస్క్ లో పడిపోయినట్లేనన్న టాక్ కూడా జరుగుతోంది. సమర్థ అభ్యర్థికి ఓటేసే విషయంలో కడప ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించక తప్పదు. టీడీపీ డమ్మీ కేండేట్ ను పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదీ ముమ్మాటికి ఓటర్లను ఏమార్చడమే అవుతుంది . అవినాశ్ రెడ్డికి ఓటెయ్యాలంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఓటర్ల కళ్లలో మెదులుతోంది. అనుమానిత హంతకుడికి ఓటెయ్యడం కరెక్టు కాదన్న ఫీలింగ్ వస్తోంది. ఇక షర్మిల కూడా ఆ తానులో ముక్కేనన్న అభిప్రాయం కడప వాసుల్లో కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాల నుంచి మధ్యలోనే వచ్చేసిన షర్మిల..ఈసారి ఏపీలోనైనా చివరిదాకా ఫైట్ చేస్తారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి…
కడప వాసులు ఆచి తూచి ఓటు వేయాల్సి ఉంటుంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అవినాశ్ రెడ్డి మొసలి కన్నీరు, టీడీపీ గేమ్ ప్లాన్, షర్మిల స్పీచులకు పడిపోకుండా వాళ్లు జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తే మంచిది.. లేకపోతే భవిష్యత్తుకు భరోసా లేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…