వాళ్లు అందుకే బీఆర్ఎస్ లో చేరారా ?

By KTV Telugu On 3 January, 2023
image

ఉద్యమ కాలంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరం తెలియదనేవారు. వాళ్లకు జ్ఞానం లేదనేవారు. వాళ్లు వండేది పేడ బిర్యానీ అని ఎగతాళి చేసే వారు కర్రీ పాయింట్ పెట్టుకుని బతికేవాళ్లకు తెలంగాణలో ఏంపని అని నిలదీసిన సందర్భమూ ఉంది. ఏపీ ప్రజలను కించపరిచేందుకు రోజుల తరబడి తిట్టే వారు కట్ చేసి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నారు. కేసీఆర్ తీరును అటు లోలోపల ఇటు బహిరంగంగా వ్యతిరేకించిన నాయకులే ఇప్పుడు ఆయన పంచన చేరుతున్నారు. అలా ఎందుకు జరుగుతోందన్న విశ్లేషణలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి..

జనసేన కీలక నేతలు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఉత్తరాంధ్రాలోని అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన మాజీ నేత చింతల పార్ధసారధి సహా పలువురు ముక్కోటి ఏకాదశి రోజున తెలంగాణ భవన్ కు వచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. చంద్రశేఖర్ కు తక్షణమే బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. రావెల కిషోర్ బాబు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కోసం పనిచేస్తారని ప్రకటించారు. మిగతా వారికి కూడా త్వరలో కీలక పదవులు దక్కుతాయి.

మహారాష్ట్ర కేడర్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ పదవీ విరమణ తరువాత రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2009లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఆఫర్ తో బీఆర్ఎస్ లో చేరారు. ఆయన 99 టీవీ అనే ఛానెల్ ను నడుపుతున్నారు. అదీ జనసేనను సపోర్టు చేస్తూ ఉండేది. రాత్రికి రాత్రి పార్టీ మార్చి కేసీఆర్ భజన మొదలు పెట్టింది. మరో పక్క రావెల కిషోర్ బాబు రిటైర్డ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలపించుకుని మంత్రిని చేశారు. కిషోర్ బాబు తన ఓవరాక్షన్ తో చంద్రబాబుకు దూరమయ్యారు. మంత్రి పదవిని పోగొట్టుకుని జనసేనలో చేరారు. అక్కడ కూడా నిలబడలేక గతేడాది రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్‌ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావులకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

తోట చంద్రశేఖర్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. పార్టీలు మారారు. ఓటమి తప్ప గెలుపును ఆయన రుచి చూసినదీ లేదు. పైగా జనసేన కోసం ఆయన పాటు పడటం మినహా పార్టీ అయనకు ఇచ్చిందేమీ లేదన్న వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకే చంద్రశేఖర్ పక్క చూపులు చూశారని అందుకు బీఆర్ఎస్ నే తగిన వేదికగా ఎంచుకున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నేతలంతా హైదరాబాద్ లో లింకు ఉన్న వారే. వారి ఆస్తులు బంధువులు తెలంగాణ రాజధానిలో ఉన్నాయి. తోట చంద్రశేఖర్ కు హైదరాబాద్ కూకట్ పల్లిలో స్థిరాస్తులు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఒకటి రెండు భూ వివాదాలు కూడా చాలా రోజులుగా పరిష్కారానికి నోచుకోలేదట. చంద్రశేఖర్ చాలా కాలంగా కేటీఆర్ తో టచ్ లో ఉంటూ సాయం చేయాలని కోరినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారట.

ఇప్పుడు తన భూ వివాదాలను పరిష్కరించుకునేందుకు చంద్రశేఖర్ కు ఒక అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా అ దిశగా అడుగులు వేసింది. పార్టీలో చేరితే వివాదాలు పరిష్కరిస్తామని కేసీఆర్, కేటీఆర్ వైపు నుంచి హామీ వచ్చిందని చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు చంద్రశేఖర్ అంగీకరించారు. దానితో ఆయన్ను పెద్ద నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు హైదరాబాద్ లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. దశాబ్దంపైగా ఏపీ రాజకీయాల్లో తిరుగుతున్నప్పటికీ తనకు ఇంతటి గౌరవం లభించలేదని చంద్రశేఖర్ మురిసిపోతున్నారు. రావెల్ కిషోర్ బాబు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు పార్టీలు మారారు. ఎక్కడా సంతృప్తినివ్వలేదు. టీడీపీ నుంచి వైదొలిగి తప్పు చేశానని కిషోర్ బాబు పలు పర్యాయాలు తన సన్నిహితుల వద్ద వాపోయారు. మళ్లీ టీడీపీలో చేరేందుకు గత ఐదేళ్లుగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారు. మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కావాలన్న కోరిక ఆయనలో ఉంది. బీఆర్ఎస్ రూపంలో అది కార్యరూపం దాల్చుతోంది.

జనసేనలో చాలా మంది నేతలు ఉక్కపోతకు గురవుతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై వస్తున్న విమర్శలు తట్టుకోలేకపోతున్నారు. జనసేనానికి చెప్పలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అధికార వైసీపీ చేసే ఆరోపణలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీడీపీతో పొత్తుపైనా క్లారిటీ రావడం లేదు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థం కావడం లేదు. దానితో బీఆర్ఎస్ వేసిన గాలంలో వారు పడిపోయారు. పైగా జనసేనలో నాదెండ్ల మనోహర్ పెత్తనం పెరిగిపోవడం తమ కార్యకలాపాలకు పార్టీ ఫండ్ రాకపోవడంతో వారు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఖర్చులన్నీ తాము చూసుకుంటామని బీఆర్ఎస్ పెద్దలు హామీ ఇవ్వడం చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి లాంటి నేతలకు ఊరటనిచ్చింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. ఎటొచ్చి కేసీఅర్ గతంలో మాట్లాడిన మాటలకు ఏపీ జనం వివరణ కోరినప్పుడు వారు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.