ఇప్పటిదాకా ఓ లెక్క…ఇప్పుడో లెక్కన్నట్లుంది ఏపీ రాజకీయం. గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీలో లేరు. వైసీపీలో చేరి సైకిల్‌పార్టీపైనే కాలుదువ్వుతున్నారు. అయినా చంద్రబాబునాయుడు దింపుడుకళ్లెం ఆశలు పెట్టుకున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు ఓ రాయేశారు. తగిలితే తగులుతుంది లేదంటే లేదు. వచ్చే నష్టమేంలేదు. ఏదన్నా అద్భుతం జరిగి తమ ప్రయత్నం ఫలిస్తే వైసీపీని ఆత్మరక్షణలో పడేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే వచ్చేది ఎన్నికల నామ సంవత్సరం. ప్రతీ ఎన్నికా ప్రతిష్టాత్మకం. అందుకే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో కాక రేపుతున్నాయి.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. స్థానికసంస్థలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజకీయ ఆరోపణలతో ఎన్నికలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత పొలిటికల్ హీట్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు చేజారిపోయారని చేతులెత్తేయలేదు టీడీపీ. ఈ ఎన్నికల్లో సమీకరణాలు మార్చేయాలనుకుంటోంది. అందుకే బీసీ నాయకురాలు పంచుమర్తి అనురాధని టీడీపీనుంచి పోటీకి దించింది.
ఎమ్మెల్యేల కోటాలో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 175. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్సీ గెలిచేందుకు 23మంది ఎమ్మెల్యేలు అవసరం. టీడీపీ పోయిన ఎన్నికల్లో గెలుచుకుంది 23 సీట్లే. అందరూ చేతిలో ఉంటే ఆ పార్టీకే ఓ సీటు దక్కాలి. కానీ వారిలో నలుగురు రెండేళ్లక్రితమే వైసీపీలో చేరిపోయారు. అంటే టీడీపీకి ఇప్పుడున్న బలం 19మంది ఎమ్మెల్యేలే. అయినా అవకాశం ఎందుకు వదులుకోవాలని మహిళా అభ్యర్థిని తెరపైకి తెచ్చింది టీడీపీ. కండువా మార్చిన ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారన్నది టీడీపీ ఆలోచన. వాళ్లు కాకపోయినా వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కొందరు సహకరించినా పార్టీ అభ్యర్థి గెలుస్తుందన్న వ్యూహంతో ఉంది విపక్షం.
ఎలాగూ టీడీపీ విప్ జారీచేస్తుంది. పార్టీని వీడిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ కచ్చితంగా దానికి కట్టుబడాల్సి ఉంటుంది. వారు ధిక్కరిస్తే రేపు ఖర్మకాలి అనర్హత వేటు పడిందంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవకాశం ఉండదు. ఓటేస్తే వేసినట్లు లేదంటే ఆ నలుగురిపై న్యాయపోరాటం చేసి ఇరుకున పెట్టొచ్చన్నది చంద్రబాబు వ్యూహం. ఎలాగూ టీడీపీకి సంఖ్యాబలం లేదనే వైసీపీ ఏడుగురిని రంగంలోకి దింపింది. ఆరుగురినే పోటీకి పెట్టి ఉంటే ఎన్నిక వ్యవహారం హుందాగా ముగిసి ఉండేది. ఏడో అభ్యర్థిని పోటీకి పెట్టడాన్ని టీడీపీ కూడా సవాలుగా తీసుకుంది. ఎలాగూ కోటంరెడ్డి ఆనం రూపంలో వైసీపీలో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలున్నారు. మరికొందరు కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని దెబ్బకొట్టడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ లేదనుకుంటోంది టీడీపీ. అందుకే టీడీపీ వ్యూహంతో వైసీపీ అధినేత అప్రమత్తమయ్యారు. తేడావస్తే కేబినెట్‌లో ఉండరని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం ఓ రేంజ్‌లో హీట్ పుట్టిస్తోంది.