విపక్షాన్నే లేకుండా చేయాలన్న ఆలోచన ప్రజాస్వామ్యంలో మంచిదికాదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎందుకో ఆ టార్గెట్ పెట్టుకుంది. ప్రశ్నించేవాళ్లు లేకపోతే మనం మెచ్చిందే రంభన్నట్లు ఉంటుంది. కానీ వైనాట్ 175 అంటూ పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది వైసీపీ. అంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలనూ గెలుచుకోవాలన్నమాట. అంటే కుప్పంలో చంద్రబాబు సహా అంతా ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. చంద్రబాబు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీని దెబ్బతీశామన్న నమ్మకంతోనేమో ఈసారి విపక్షపార్టీని వాషవుట్ చేసి పారేయాలనుకుంది. అధినేతే అంతలా ఆశపడితే ఆయన వందిమాగధులు అత్యుత్సాహం చూపకుండా ఉంటారా. దమ్ముంటే కుప్పంలో ఈసారి గెలిచి చూపాలని సవాళ్లు. కొడాలినాని లాంటి వాళ్లయితే చేతనైతే వచ్చి గుడివాడలో గెలవాలని తొడగొడతారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని తాయిలాలిచ్చినా ప్రజలు ఎన్నికలవేళ అన్నీ ఆలోచిస్తారు. ఎవరిని ఎక్కడపెట్టాలో ఎంతవరకు పరిమితం చేయాలో వాళ్లకో లెక్కుంటుంది. శాశ్వతంగా అధికారం తమదేనని విర్రవీగిన ఎన్నో పార్టీలకు ఈ దేశంలో భంగపాటు తప్పలేదు. మరో ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకోవాలని వైసీపీ అనుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు మరోలా స్పందించారు.
ఏపీలోని మూడుకు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలవడంతో వైసీపీ నెత్తిన పిడుగుపడింది. వైసీపీ కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని పంతంపడితే వైసీపీకి కంచుకోటలాంటి పులివెందులలో జగన్మోహన్‌రెడ్డికి టీడీపీ షాక్ ఇచ్చింది. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ సీటునుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థిది పులివెందులే. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పోల్ కావటం వైసీపీకి మింగుడుపడటం లేదు. కడప జిల్లానే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక పులివెందుల గురించి చెప్పాల్సిన పన్లేదు. పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ ఏరికోరి పులివెందులనుంచే అభ్యర్థిని దించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిన టీడీపీ అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈసారి అబ్బాయ్‌కి షాక్ ఇచ్చింది. ఏ పదవులూ లేకున్నా ఎప్పట్నించో టీడీపీకి విధేయుడిగా ఉన్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. పులివెందులలోని సింహాద్రిపురం మండలానికి చెందిన భూమిరెడ్డి విద్యావంతుడు మాజీ పాత్రికేయుడు. ఎంతోకాలం తర్వాత చట్టసభకు ఎన్నికయ్యే అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. తనకున్న మంచిపేరుతో పట్టభద్రుల మనసు చూరగొన్నారు. మూడు సీట్లు పోయినా ఇది వేరేనంటోంది వైసీపీ. 49 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారని గ్రాడ్యుయేట్స్ తీర్పు ఏరకంగానూ ప్రజలను ప్రభావితం చేయలేరంటోంది. మబ్బుల్ని చూసి ముంత ఒలకబోసుకుంటే కష్టమేమో ఈ ఓటమిని సీరియస్‌గా తీసుకోకపోతే నష్టం వైసీపీకే.