అమరావతా విశాఖా ప్రజల ఓటు దేనికి

By KTV Telugu On 23 March, 2023
image

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అందుకే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోయే ఉత్తరాంధ్ర న్యాయరాజధాని ఏర్పాటు కాబోయే రాయలసీమ ప్రాంతాల్లో పాలక పక్షాన్ని ఓటర్లు ఓడించారన్నది టిడిపి వాదన. అయితే దీన్ని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది. ఆ లెక్కన అమరావతి రాజధానిగా ఉండకూడదని కృష్ణా గుంటూరుజిల్లా ప్రజలు స్థానికసంస్థల ఎన్నికల్లోనే తీర్పు ఇచ్చారుకదా ఇక అమరావతి పాట ఆపేస్తారా అని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రక రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయాలు సాధించడంతో చాలా కాలం తర్వాత ఊపిరి పీల్చుకున్న టిడిపి నాయకత్వం దాన్ని మూడు రాజధానులకు ముడి పెడుతోంది. మూడు పట్టభద్రుల స్థానాల్లోనూ వైసీపీని ఓడించడం ద్వారా విద్యావంతులు ప్రభుత్వం పట్ల వ్యతరేకతను స్పష్టంగా చాటి చెప్పారని టిడిపి అంటోంది. ప్రత్యేకించి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తోన్న టిడిపి ఎన్నికల ఫలితాలను మూడు రాజధానులకు వ్యతిరేకంగా వచ్చిన రెఫరెండంగా అభివర్ణిస్తోంది.

టిడిపి హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు దానికి జగన్ కూడా తలూపారు. అయితే అయిదేళ్ల చంద్రబాబు పాలనలో రాజధాని నిర్మాణం సరిగ్గా మొదలే పెట్టలేదు. కొన్ని తాత్కాలిక భవనాలకే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ అజెండా అని దానికి అనుగుణంగానే పరిపాలనా వికేంద్రీకరణకూ జై కొడతామని స్పష్టం చేసింది. అందులో భాగంగానే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రకు న్యాయం చేయడానికి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే విధంగా రాయలసీమకు న్యాయం చేయడానికి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టిడిపి న్యాయస్థానాలను ఆశ్రయించింది. దానిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. దాన్ని పక్కన పెట్టేస్తే ఇపుడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానం కార్యనిర్వాహక రాజధాని ఉన్న ఉత్తరాంధ్రలో ఉంటే మరోటి న్యాయరాజధాని ఉండే  రాయలసీమలో ఉంది. ఈ రెండు చోట్లా కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి చెందారు.

అంచేత న్యాయ రాజధానికి కార్యనిర్వాహక రాజధానికి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకమని తేలిపోయిందనేది టిడిపి వాదన. ఇకనైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు పట్టుబడుతున్నారు. టిడిపి చేస్తోన్న ఈ వాదనను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు తప్పు బడుతున్నారు. టిడిపి నేతలు తలాతోకా లేకుండా వెర్రి మొర్రి వాదనలు చేయడం మానుకోవాలని వారంటున్నారు. పట్టభద్రుల స్థానాల్లో చిన్న పాటి సెగ్మెంట్ ఓటర్లే పాల్గొంటారని వారి అభిప్రాయాలను ఆ ప్రాంతం మొత్తం ప్రజల అభిప్రాయంగా పరిగణించలేమని అంటున్నారు. ఒక వేళ టిడిపి వారు చెబుతోన్న లాజిక్ కే వారు కట్టుబడి ఉంటే అమరావతి విషయంలో కూడా అదే విధంగా ఆలోచించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ప్రకటించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకే కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజలు పట్టం కట్టారు.

ఆ తర్వాత ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. వాటిలోనూ అమరావతి  ఉన్న కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి ఎదురే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే అమరావతిని మనం వదులుకున్నట్లే అని ప్రజలను బెదిరించారు. ఆఎన్నికల్లో ప్రజలు వైసీపీకే ఓటు వేశారు. అంటే ఈ రెండు జిల్లాల ప్రజలూ అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నట్లే అనుకోవాలి కదా అంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ అంతే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడుతూ మీకు పౌరుషం లేదయ్యా అమరావతి కోసం నేను ఒక్కడినీ పోరాడుతూ ఉంటే మీరు మాత్రం ఇళ్లల్లో కూర్చుంటారు. మీకు అమరావతి అంటే ప్రేమేలేదు అంటూ నిష్ఠూరం ఆడారు. ఈఎన్నికల్లో టిడిపిని గెలిపించకపోతే అమరావతి నాశనం అయిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. అంతా విన్న జనం ఎన్నికల్లో  టిడిపిని తిరస్కరించి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నీ కూడా  పాలక పక్షానికే దక్కాయి. టిడిపి వాదన ప్రకారం అమరావతి రాజధానిగా ఉండకూదనడానికి ఈ ఎన్నికలే రెఫరెండంగా భావించాలి కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎవరి వైపు నైనా ఒక వేలు చూపిస్తే మన వైపు నాలుగు వేళ్లు చూస్తూ ఉంటాయన్న సింపుల్ లాజిక్ ను టిడిపి నాయకత్వం ఎలా మిస్ అయ్యిందో అని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు.

అసలు  అమరావతి ప్రాంతం ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు అమరావతే రాజధానిగా ఉండాలని అనుకుంటే దాన్ని ప్రపంచం అసూయపడేలా నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టిడిపికే బ్రహ్మరథం పట్టి ఉండాలి. కానీ ఈ రెండు జిల్లాల్లోనూ టిడిపి తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఆ ఎన్నికల్లోనే అమరావతికి ఆ ప్రాంత ప్రజలు నో చెప్పేసినట్లే కదా అంటున్నారు పాలక పక్ష నేతలు. విషయం ఏంటంటే ఏ విషయంలోనైనా సరే చంద్రబాబు నాయుడు అండ్ కో లాజిక్కులు ఇలానే ఉంటాయి. కింద పడ్డా తమదే పైచేయి అనేస్తారు టిడిపి నేతలు. నిజానికి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి 14 స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మూడు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్ధులు గెలిచారు. అది కూడా జనసేన పీడీఎఫ్ ల మద్దతుతో మాత్రమే గెలవగలిగారు. అది కూడా రెండో ప్రాధాన్యత ఓటుతోనే విజయం సొంతం చేసుకోగలిగారు. మరి మిగతా 11 చోట్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించింది. అక్కడ ఎక్కడా కూడా టిడిపి అడ్రస్ కూడా లేకుండా గల్లంతయ్యింది.

14 స్థానాల్లో 11 చోట్ల గెలవడం అంటే వైసీపీ 78 శాతానికి పైగా స్థానాలు దక్కించుకుందనే. అంటే టిడిపికి కేవలం 21 శాతం పైచిలుకు స్థానాలు మాత్రమే కదా దక్కింది. మరి ఆ పాటి స్థానాలతోనే వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేస్తుందని యావత్ రాష్ట్రం వైసీపీ పాలన పట్ల వ్యతిరేకతతో ఉందని టిడిపి ఎలా ప్రచారం చేసుకుంటుంది అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే నాలుగేళ్లుగా టిడిపి శ్రేణులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా నేతలు దూరంగా ఉంటున్నారు. ఎవ్వరిలోనూ ఉత్సాహం లేదు. పార్టీ బలహీనపడిపోయి ఉంది. దశ దిశ లేకపోవడంతో అంతా నిద్రాణమై ఉండిపోయిన పరిస్థితి. ఇంతటి దయనీయ స్థితి నుండి పార్టీకి ఊపు తెచ్చేందుకే పట్టభద్రుల స్థానాల్లో గెలుపుకోసం టిడిపి అటు జనసేన ఇటు పిడిఎఫ్ లతో ఆగమేఘాల మీద ఒప్పందాలు కుదుర్చుకుందని పాలక పక్ష నేతలు అంటున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్నదే నాయకత్వం ఆలోచనగా వారు చెబుతున్నారు. దాన్ని కూడా మూడు రాజధానులకు ముడి పెట్టడంలో అర్ధం లేదని వారంటున్నారు.