ఆంధ్ర ప్రదేశ్ లో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్..ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు కొద్ది రోజులుగా ఓట్ల విషయంలో గొడవలు పడుతున్నాయి. ఈ ఓట్ల పంచాయతీ తేల్చుకునేంఉకు ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. సరిగ్గా అదే రోజున వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎంపీల బృందం కూడా ఎన్నికల కమిషన్ ను కలిసి తమ వాణి వినిపించడానికి రెడీ అవుతోంది. తమ ఓట్లు అన్యాయంగా తొలగించేస్తున్నారన్నది టిడిపి వాదన. అయితే టిడిపి హయాంలోని దొంగ ఓట్లను ఏరివేయాలన్నదే తమ లక్ష్యమంటోంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్.
విశాఖ, విజయవాడ, అనంతపురం జిల్లాలోని ఉరవకొండల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను అన్యాయంగా ఏరివేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై ఆందోళనలు కూడా చేస్తోంది. 2024 ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమన్న భయంతోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టిడిపి దుయ్యబడుతోంది. ఈ దుర్మార్గాన్ని కొనసాగనిచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పిన చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బాగోతాలన్నీ బయట పెడతానని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 నుండి 2019 మధ్య కాలంలో కేవలం అయిదేళ్లలో ఏకంగా 60 లక్షల మేరకు దొంగ ఓట్లను జాబితాలో అక్రమంగా చేర్పించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. 2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్ష హోదాలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓట్ల ఏరివేతకోసం ఈసీ చుట్టూ తిరిగింది. దాని ఫలితంగా 30 లక్షల మేరకు దొంగ ఓట్లను తొలగించగలిగామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క దొంగ ఓటునూ చేర్చలేదని అదే సమయంలో ఒక్క నిజాయతీ ఓటునూ తొలగించలేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అంటోంది. చంద్రబాబు నాయుడి హాయంలో చేర్చిన వాటిలో ఇంకా జాబితాలో కొనసాగుతోన్న 30 లక్షల దొంగ ఓట్లను తొలగించాలన్నదే తమ డిమాండ్ అంటున్నారు వైసీపీ నేతలు. దాని కోసం తాము ఈసీ అధికారుల వెంట పడుతోంటే చంద్రబాబు నాయుడు ఆ దొంగ ఓట్లు తొలగిస్తే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని కంగారు పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ఈసీని కలిసి తమపై నిరాధార ఆరోపణలు చేసే అవకాశం ఉందని అంటోన్న వైసీపీ నాయకత్వం చంద్రబాబు ఈసీని కలిసే రోజునే తమ పార్టీ ఎంపీల బృందాన్ని ఈసీ దగ్గరకు పంపాలని నిర్ణయించింది. ఈ బృందానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా అపాయింట్ మెంట్ ఇచ్చింది. ఈసీని కలిసినపుడే చంద్రబాబు హయాంలో చేర్చిన దొంగ ఓట్ల బండారాన్ని ఆధారాలతో సహా ఈసీ ముందు ఉంచుతామని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా తాము టిడిపి అనుకూల ఓట్లను ఏరివేయడం లేదని వారు వివరణ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఒక్క కుప్పం నియోజక వర్గంలోనే 30 వేలకు పైగా దొంగ ఓట్లను చేర్పించారన్నది వైసీపీ ఆరోపణ.
ఏపీ ఓట్ల పంచాయతీని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించనుంది. చంద్రబాబు నాయుడి పార్టీ చేస్తోన్న ఆరోపణలో నిజం ఉందా? లేక వైసీపీ చేస్తోన్న ఆరోపణల్లో డొల్లతనం ఉందా అన్నది కూడా ఈసీ తేలుస్తుంది. నిజంగానే దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించేందుకు అవకాశాలున్నాయి. అదే సమయంలో వైసీపీ ఉద్దేశ పూర్వకరంగా టిడిపి సానుభూతి పరులైన వారి ఓట్లను తొలగించి ఉంటే ఆ ఓట్లను తిరిగి జాబితాలో చేర్చడానికి కూడీ ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలకు ఏడు నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఇంకెన్ని వింత పోకడలు పోతుందో చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…