ఏపీ రాజకీయాలు ఇప్పుడు మెగాబ్రదర్స్ చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయాలకు దూరమై చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నా ఆయన్ను మాత్రం రాజకీయం వదలడం లేదు. రాజకీయాలకు నేను దూరమయ్యాను కానీ రాజకీయం తనకు దూరం కాలేదంటూ మెగాస్టార్ గాడ్ ఫాదర్లో చెప్పిన డైలాగ్ వాస్తవంలోనూ జరుగుతోంది. తనకు పాలిటిక్స్‌తో సంబంధం లేదని సినిమా తప్ప తనకు మరో ఆలోచన లేదని చిరంజీవి చెబుతున్నా నిను వీడని నీడను నీను అన్నట్టుగా రాజకీయం ఆయనను వెంటాడుతూనే ఉంది. ఏపీ రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని అక్కడ తనకు అసలు ఓటు హక్కు కూడా లేదని ఇటీవల చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయనతో రాజకీయ అనుబంధం ఇంకా కొనసాగుతుందని కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ చెబుతున్నారు.
రానున్న ఎన్నికలకు ముందు చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ మెగా క్యాంప్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. పవన్‌కళ్యాణ్ పార్టీతో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం మెగా అభిమానులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల అన్‌స్టాపబుల్ షో వ్యాఖ్యాత బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ల భేటీ రాజకీయంగా హీటెక్కించింది. ఆ తర్వాత చంద్రబాబు, జనసేనానిల సమావేశం మరింతగా వేడెక్కించింది. మున్ముందు అంతకుమించి ఉంటుందని ప్రత్యర్థులకు చెప్పకనే చెప్పారు తమ్ముళ్లు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ సందర్భంగా లోకేష్ సైతం చిరంజీవి, బాలకృష్ణకు స్పెషల్ విషెస్ చెప్పారు. సినిమా హిట్ కావాలని కోరుకున్న ఆయన వైసీపీ ట్రాప్‌లో పడొద్దంటూ ఇద్దరు స్టార్స్‌కు సూచన చేశారు. జగన్ సర్కార్‌తో చిరంజీవికి గ్యాప్ పెరుగుతోన్న క్రమంలో టీడీపీ ఆ ఫ్యామిలీకి దగ్గరవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు చిరంజీవితో తమ రాజకీయ అనుబంధం కొనసాగుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ కాంగ్రెస్‌లోనే ఉన్నారని రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసిన చిరంజీవి తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదట. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించాలని ఢిల్లీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. కానీ చిరంజీవి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు రుద్రరాజు చిరంజీవి తమతోనే ఉన్నారని చెప్పడం ఆసక్తిని రేపుతోంది.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిరంజీవితో సత్సంబంధాలు కొనసాగాయి. ఆ సమయంలోనూ మెగాస్టార్‌కు వైసీపీ నుంచి రాజ్యసభ ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే సినీ పరిశ్రమ అంశాలే మినహా తమ మధ్య రాజకీయ బంధం లేదని తేల్చి చెప్పారు . తాను ఏ పదవులు కోరుకోవటం లేదని క్లారిటీ ఇచ్చారు చిరు. అయితే తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌కు మాత్రం తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇలాంటి సమయంలో చిరంజీవి మావాడేనంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడం విశేషం. సినిమాల కారణంగానే పార్టీకి దూరంగా ఉన్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ ప్రస్థావన వచ్చిన ప్రతీసారి చిరంజీవి నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అంటున్నారు. కానీ లీడర్లు మాత్రం చిరంజీవికి ఇంకా రాజకీయం దూరం కాలేదని సినిమాలో ఆయన చెప్పిన డైలాగునే ప్రస్తావిస్తున్నారు.