గతేడాదిలో రాజకీయంగా దూకుడు పెంచి ఘనంగా ముగించుకున్న పార్టీలు కొత్త ఏడాదిలో సరికొత్త అస్త్రాలతో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఏపీలో ఈ ఏడాదిలోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలతో ప్రధాన పార్టీల్లో హీట్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇక నుంచి రాజకీయం మరో లెవల్ ఉండబోతుందని తెలుస్తోంది. మూడేళ్లపాటు ఏకపక్షంగా సాగిన అధికారపార్టీ రాజకీయానికి మున్ముందు పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. 2022లో బాగానే గ్రాఫ్ పెంచుకున్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ కు గట్టి పోటీదారులుగా మారుతున్నారు. దీంతో జగన్ కూడా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం తెరపైకి వస్తుండడంతో 2023లో రాజకీయం రసవత్తరంగా మారనుంది.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కొత్త ఏడాది తమకు కచ్చితంగా టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నట్లు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామంటున్న జగన్ సైన్యం విపక్షాలపై ఈ ఏడాది పైచేయి సాధించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. వై నాట్ 175 కొట్టి తీరుతామంటునన్నారు. విపక్షాల ఐక్యత కోసం పవన్, పొత్తులున్నా లేకపోయినా సత్తా చాటుకోవాలనే ప్రయత్నాల్లో చంద్రబాబు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో వీరు సాగించే రాజకీయాలు ఎన్నికల అజెండాను సైతం నిర్దేశించబోతున్నాయి. వన్ మోర్ ఛాన్స్ అంటూ జగన్, ఒక్క ఛాన్స్ అంటూ పవన్ కల్యాణ్, లాస్ట్ ఛాన్స్ అంటూ గతేడాది రాజకీయాన్ని వేడెక్కించారు ప్రధాన పార్టీల అధినేతలు. ఈ ఏడాది అధికారమే పరమావధిగా ప్రజాభిమానం చూరగొనేందుకు మరిన్ని ఎత్తుగడలు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
2023లో భారీగా బలపడేందుకు వైఎస్ జగన్ కొత్త వ్యూహాలకు తెరదీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్ చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటివరకూ భారీ ఎత్తున సంక్షేమం అమలు చేసిన జగన్ దాని ఫలితాలు పూర్తిస్ధాయిలో అందుకోలేకపోయామన్న ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని పథకాలు తెరపైకి రావొచ్చంటున్నారు. అలాగే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ముందస్తుకు వెళితే ఏం జరగబోతోందన్నది జగన్ కు కీలకమనే చెప్పాలి. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా మూడున్నరేళ్లుగా పోరాడుతున్న చంద్రబాబు గత ఆరునెలల్లో తన గ్రాఫ్ ను కాస్త పెంచుకోగలిగారు. జనసేన అధినేత పవన కూడా కొంత మెరుగుపడ్డారు. సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ఏడాది విపక్షాల ఐక్యత, పొత్తుల అంశం తేలిపోనుంది. టీడీపీ, బీజేపీ, జనసే పార్టీల రాజకీయ భవిష్యత్తు పొత్తులతోనే ముడిపడి ఉండడంతో మళ్లీ ముగ్గురు కలిసే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబు అవసరం పెరుగుతోంది. అదే సమయంలో పొత్తులతో ముందుకెళితేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ జనసేనతో కలవనున్నామనే సంకేతాలు పంపుతున్నారు. అయితే తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏపీలో చంద్రబాబు అవకాశాలు మరింత మెరుగుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జనసేనతో పొత్తు కుదిరితే చాలా అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్ధుల అవకాశాలు మెరుగుపడతాయనే అంచనా ఉంది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కంటే కూడా మూడో స్ధానంలో జనసేనాని కీలకంగా మారిపోయారు. అందుకే పవన్ కోసం బీజేపీ, టీడీపీలు పొత్తుకోసం తహతహలాడుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని పదే పదే చెబుతున్న పవన్ అందులో సక్సెస్ అయితే మాత్రం రాష్ట్రంలో రాజకీయాలకు ఇదో టర్నింగ్ పాయింట్ గా మారడం ఖాయం. జగన్ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు. మొత్తంగా 2023 ఎవరికి కలిసిరానుంది. ఈఏడాదిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి.