ఏపీలో పొలిటికల్ హీట్

By KTV Telugu On 1 January, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం నిప్పులు చెరుక్కుంటున్నాయి. ఒక పక్క పాలక పక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  చాలా నియోజక  వర్గాల్లో ఇన్ ఛార్జులను మారుస్తూ యుద్ధానికి సన్నద్ధం అవుతోంది. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు  సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టిడిపి -జనసేన కూటమే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమికి అసలు 175 నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులే లేరని  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  కౌంటర్ ఇస్తోంది.

2024 ఏప్రిల్ లో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ కు ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో  అఖండ విజయం సాధించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వరుసగా రెండో సారి అధికారంలోకి రావడం ఖాయమని చాలా ధీమాగా ఉంది. ఎన్నికలకు  మూడున్నర నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొత్తం 175 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను  ఖరారు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. సిటింగ్ ఎమ్మెల్యేల్లో ప్రజావ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో  కొత్త అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయిన జగన్ మోహన్ రెడ్డి  50కి పైగా నియోజక వర్గాల్లో ఇన్ ఛార్జులను మారుస్తున్నారు.

కొందరు ఎమ్మెల్యేలను లోక్ సభ నియోజక వర్గాల నుంచి..కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ  నిలబెట్టాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఏ పార్టీతోనూ పొత్తులు లేకపోవడంతో మొత్తం 175 నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు వేగం పెంచారు జగన్ మోహన్ రెడ్డి. టికెట్ రానంత మాత్రాన ఆ నేతలు నా మనుషులు కాకుండా పోరని..వారికి వేరే కీలక పదవులు అప్పగిస్తానని కొద్ది నెలల క్రితమే జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక సాధికార యాత్ర, జగనన్న ఆరోగ్య సురక్ష  వంటి వినూత్న కార్యక్రమాలతో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని నిత్యం జనంతో మమేకం అయ్యి ఉండేలా జగన్ మోహన్ రెడ్డి  వ్యవహారాలు నడుపుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో కూడా ఇంటికి పంపించేస్తే ఇక ఆ పార్టీ మనుగడే ఉండదని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎలాంటి  రాజీలు లేకుండా  రేసుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించేశారు. దానికి అనుగుణంగానే నియోజక వర్గాలకు ఇన్ ఛార్జులను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా జగనన్న విద్యాదీవెన పథకం  నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన  జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు ఏ నాడూ ఏమీ చేయని తెలుగుడేశం పార్టీకి  జనసేన కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. తమ పాలనలోనే పేదలకు న్యాయం జరిగిందని..దాన్ని ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇపుడున్న సంక్షేమ పథకాలు  అపుడు ఎందుకు లేవని? జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇలా దూకుడు పెంచితే అటు చంద్రబాబు నాయుడు కూడా  గేర్ మార్చారు. సొంత నియోజక వర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు నాయుడు  టిడిపి అధికారంలోకి వస్తే పంట పొలాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిస్తామని  వినూత్న హామీ ఇచ్చారు.టిడిపి-జనసేన కూటమి  అధికారంలోకి వస్తే ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై సభలో పాల్గొని రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని సవాల్ విసిరారు.టిడిపి-జనసేనల మధ్య పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో  బిజెపితో పొత్తు ఉంటుందా …ఒక వేళ లేకపోతే కమ్యూనిస్టులను కలుపుకు పోవాలా? అన్న అంశాలపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు

జనవరిలో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 25 బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు  నిర్ణయించారు.వీటిలో కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పాల్గొంటారు. కొన్ని సభల్లో చంద్రబాబు ఒక్కరే పాల్గొంటారు. ఈ సభలన్నీ కూడా జనవరి 29 లోగా  ముగిసేలా షెడ్యూలు రూపొందించుకున్నారు.  2019 ఎన్నికల్లో టిడిపిని దారుణంగా ఓడించిన ప్రజలను తిరిగి మంచి చేసుకోవడమే లక్ష్యంగా ఆయన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ కర్నాటక, తెలంగాణాల్లో విడుదల చేసిన విధంగా ఏపీలో  గ్యారంటీలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. జనవరి నెలలో  నిర్వహించబోయే సభల్లో ఈ గ్యారంటీలను   ఆవిష్కరిస్తారు.మొత్తం మీద ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. టిడిపి జనసేనల మధ్య సమన్వయ సమావేశాలు కూడా రానున్న రోజుల్లో ఉధృతం అవుతాయంటున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి