ఏపీలోనూ తమిళనాడు పాలిటిక్స్ సాధ్యమా

By KTV Telugu On 7 February, 2023
image

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేదెవ్వరన్న స్పష్టత ఇంకా రాలేదు. అందరూ విడివిడిగా పోటీ చేస్తే జగన్ ప్రయోజనం పొందుతారన్న చర్చ రోజురోజుకు ఊపందుకుంటోంది. అయినా విపక్షాలు ఒక తాటి మీదకు రాలేకపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెబుతూ వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ జనం కోరుకుంటే సీఎం అవుతానని అంటున్నారు. దానితో ఆయనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చినట్లుగా పరిస్థితి తయారైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షాలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సహేతుకం కాని డిమాండ్లకు మాత్రం తలొగ్గే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు 30 స్థానాల లోపే ఇస్తామని అందుకు అంగీకరిస్తే పొత్తు కుదురుతుందని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. జనసేనాని కోరుకుంటే ఆయనకు ఇష్టం వచ్చిన సీట్లలోనే పోటీ చేయోచ్చని ఆఫరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించడం లాంటి డిమాండ్లతో తమ వద్దకు రావద్దని టీడీపీ తేల్చేసింది. ఆ విషయంలో తగ్గేదేలే అంటోంది.

మూడో పార్టీ బీజేపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కమలం పార్టీలో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపు టీడీపీకి దగ్గరవ్వాలనుకుంటుంటే మరో గ్రూపు వైసీపీ వైపు ఉండాలని కోరుకుంటోంది. రెండు గ్రూపులు ఊకదంపుడు ప్రకటనలతో టైమ్ పాస్ చేస్తున్నాయి. టీడీపీతో పొత్తే ఉండదని ఒక వర్గం తెగేసి చెబుతోంది. పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ పై ఇంతవరకు క్లారిటీ ఇవ్వని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇష్టమైతే జనసేన తమతో వచ్చి కలవొచ్చని చెబుతున్నారు.

ఎన్నికలు బాగా దగ్గర పడిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ఏపీలో ఆ పార్టీకి నోటా సే భీ ఛోటా అన్న పేరు ఉంది. గత ఎన్నికల లెక్క ప్రకారం జనసేనకు ఆరు శాతం ఓట్లున్నాయి. టీడీపీకి దాదాపు 40 శాతం ఓట్లున్నట్లు లెక్కించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసినా టీడీపీ మేజర్ పార్టనర్ అవుతుంది. బీజేపీ కలిసి రాకపోతే వామపక్షాలను కలుపుకుపోవడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దానితో ఇప్పుడెన్ని మాట్లాడినా ఎన్నికల నాటికి ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిపోతాయన్న విశ్వాసం కలుగుతోంది. కాకపోతే ఎవరెన్నీ సీట్లలో పోటీ చేస్తారో చూడాలి. బీజేపీకి మాత్రం సింగిల్ డిజిటేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదని గుర్తుచేస్తున్నాయి. అంతకముందు కూడా పొత్తుల కారణంగానే ఆ పార్టీకి ఒకటి రెండు సీట్లు వచ్చాయని మరిచిపోకూడదు.

ఇక వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చ మొదలైంది. జనం ఆలోచనలు మారుతున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓటర్లు నిర్ణయించుకుంటే ఎలాంటి సమీకరణాలు పనిచేయవని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్తితులను బట్టి వైసీపీ గెలిచే అవకాశమే లేదు. గెలుపుకు దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు కూడా లేవు. వైసీపీ నేతలే కసిగా జగన్ ను ఓడించే ఛాన్సు కనిపిస్తోంది. అవినీతి అసమర్థ పాలన అంతర్గత కుమ్ములాటలు వైసీపీని కృంగదీస్తున్నాయి. 1995-1996 ప్రాంతంలో తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఇదే పరిస్థితి కనిపించేది. చివరకు 1996 ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఆమె కూడా ఓడిపోగా 234 మంది ఉండే అసెంబ్లీలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.

1996 నుంచి 2001 వరకు తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే అధికారంలో ఉంది. జయలలిత అవినీతిని బయటకు తీసిన వరుస కేసులు నమోదు చేసిన కరుణానిధి ప్రభుత్వం పలువురు ఏఐఎస్ లను, మాజీ మంత్రులను జైలుకు పంపించింది. జయలలితను కూడా అరెస్టు చేయడంతో ఆమె 27 రోజుల పాటు జైల్లో ఉండి తర్వాత బెయిల్ పొందారు. కట్ చేసి చూస్తే 2001 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయింది. డీఎంకే చేసిన తప్పేమీ లేదు. జనం మార్పును కోరుకున్నారంతే తర్వాత కూడా రెండు సార్లు డీఎంకే అన్నాడీఎంకే మధ్య అధికారం దోబూచులాడింది..

ఏపీలో కూడా ఇప్పుడు తమిళనాడు తరహా పరిస్థితులు వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జనం ఇప్పుడు త్వరత్వరగా అంటే ఐదేళ్లకొకసారి మార్పును కోరుకుంటున్నారని భావించడమే ఇందుకు కారణం కావచ్చు. వచ్చే ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీని జనం భూస్థాపితం చేస్తారని చెప్పలేం. తిరిగి పుంజుకునేందుకు జగన్ కు చాలా అవకాశాలే ఉన్నాయి. జగన్ అసంపూర్ణంగా వదిలేసిన కార్యక్రమాలను టీడీపీ పూర్తి చేయలేకపోతే ఓటర్లు మళ్లీ వైసీపీనే కోరుకునే వీలుంది. జగన్ నియంతలా వ్యవహరించినప్పటికీ అట్టగుడు వర్గాల వారికి ఎంతో కొంత ఇస్తన్నారన్న మాట నిజమే. వాళ్లు జగన్ పట్ల సానుభూతితో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోనీలే ఇంకో సారి అవకాశం ఇద్దామన్న ఆలోచన వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది. అదే జగన్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. తమిళనాడు తరహా పాలిటిక్స్ కు అదే కారణమవుతుంది.