వీళ్ళు ఈ సారి ఏ పార్టీ నుంచో తెలుసా?

By KTV Telugu On 25 May, 2023
image

కొందరు నాయకుల రాజకీయ భవిష్యత్ ఎటు వైపు అడుగులు వేస్తోందో అర్ధం కాకుండా ఉంది.  వివిధ పార్టీల తరపున గతంలో పోటీ చేసిన ఈ నేతలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున బరిలో దిగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కలిసొచ్చే పార్టీల వైపే ఈ నేతల చూపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొద్ది మంది కొన్ని పార్టీల్లో చేరే అవకాశాలు లేకపోవడం విశేషం. గెలిచే పార్టీలో తమకి ఎంట్రీ లేకపోతే ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచే పార్టీ తరపున అయినా బరిలో దిగాలని నేతలు అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి టిడిపిని 23 స్థానాలకు పరిమితం చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన టిడిపి ఈ సారి జనసేనతో పొత్తు పెట్టుకుని బరిలో దిగాలని చూస్తోంది. టిడిపి జనసేన కలిస్తే తమదే విజయమని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నా ప్రధానంగా ఈ రెండు పార్టీల తరపునే పోటీ చేయాలి. ఈ క్రమంలోనే కొందరు కీలక వ్యక్తులు ఏయే పార్టీలను ఎంచుకుంటారన్న అంశంపై చర్చ జరుగుతోంది. వీరిలో రాజకీయ కురువృద్ధుడు ముద్రగడ పద్మనాభం పేరు తాజాగా రాజకీయ తెరపైకి వచ్చింది.

చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని అంటున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇంత వరకు ప్రకటించలేదు. 2014 -2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని టిడిపి ప్రభుత్వం వేధించింది. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే ఇంటి నుండి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేసింది. ముద్రగడ కుటుంబ సభ్యులను బూతులు తిట్టి అవమానించారని ముద్రగడ అనుచరులే ఆరోపించారు. తునిలో కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేపథ్యంలో  రైలు దగ్ధం కేసును ముద్రగడ అనుచరులపై బనాయించి కేసులు పెట్టించారు చంద్రబాబు. ఆ కేసుల్లో ఆయన నిర్దోషిగా ఈ మధ్యనే న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అభిమానులు కోరారు. టిడిపితో ఉన్న చేదు అనుభవాల నేపథ్యంలో ఆయన టిడిపి తరపున పోటీ చేసే అవకాశాలు కచ్చితంగా ఉండకపోవచ్చు. ఇక మిగిలింది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీయే. ముద్రగడ పద్మనాభం గతంలో కాంగ్రెస్ లోనూ ఉన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తోనూ ముద్రగడకు పరిచయాలు ఉన్నాయి. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ ,పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి నేతలతోనూ ముద్రగడకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరపున బరిలో దిగితే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచీ తటస్థంగానే ఉంటున్నారు. అయితే తరచుగా ఏదో ఒక పరిణామంపై యూట్యూబ్ ఛానెళ్లలో స్పందిస్తున్నారు. తన విశ్లేషణలు వినిపిస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావించబట్టే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కావాలన్న ఆకాంక్ష కూడా ఉంది ఆయనలో. అయితే అది సాకారం కాలేదు. వచ్చే ఎన్నికల్లోనూ లక్ష్మీనారాయణ తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ఏ పార్టీ తరపున బరిలో దిగుతారన్నది చూడాలి. గత ఎన్నికల్లో ముందుగా టిడిపి తరపున ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే  వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్-టిడిపిలు అక్రమంగా కేసులు బనాయించాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన కేసులో దర్యాప్తు అధికారి లక్ష్మీనారాయణే కావడంతో టిడిపి తరపున పోటీ చేస్తే అది క్విడ్ ప్రోకోగా తెలిసిపోతుందన్న భయానికి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదని అంటారు. దానికి బదులుగా జనసేన అధినేత పవన్ కు చెప్పి చంద్రబాబే లక్ష్మీనారాయనకు టికెట్ ఇప్పించారని అంటారు. మరి వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి తరపునే ఆయన పోటీ చేస్తారా అన్నది చూడాలి. కొంతకాలంగా లక్ష్మీనారాయణ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలను మెచ్చుకుంటున్నారు. విధానాలనే కాదు ఎవరైనా పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే జగన్ మోహన్ రెడ్డి జీవితాన్నే పాఠంగా తీసుకోవాలని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి జగన్ మోహన్ రెడ్డి పదేళ్ల పాటు జనంలోనే ఉంటూ జనంతోనే మమేకం అవుతూ రాత్రింబవళ్ళూ కష్ట పడ్డ తీరు అద్భుతమని కొనియాడారు లక్ష్మీనారాయణ. జగన్ ప్రభుత్వంలో నాడు నేడుతో  స్కూళ్లు, ఆసుపత్రులను ఆధునికీకరిస్తోన్న తీరును కూడా మెచ్చుకున్నారు. మరి లక్ష్మీనారాయణ కు వైసీపీ నుంచి ఏమన్నా పిలుపు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు.

ఇక  డైలమాలో ఉన్న మరో నేత రఘురామ కృష్ణం రాజు.  గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధిగా నరసాపురం లోక్ సభ నియోకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు రఘురామ. అయితే ఆ తర్వాత పార్టీ అధినేతతో తేడాలు రావడంతో  పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆ క్రమంలో టిడిపికి దగ్గరయ్యారు. టిడిపి తరపున వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లోక్ సభ స్పీకర్ కు మెమొరాండాన్ని సమర్పించింది కూడా. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనని రఘురామ ఈ మధ్యనే స్పష్టం చేశారు. టిడిపి -జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏదో ఒక పార్టీ తరపున బరిలో దిగుతానన్నారు. ఒక వేళ ఈ రెండు పార్టీలతో బిజెపి కూడా జట్టు కడితే బిజెపి తరపున కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రఘురామ చెప్పుకొచ్చారు. అయితే అసలు రఘురామకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందో లేదా ఆ పార్టీల నేతలు ఇంత వరకు తేల్చి చెప్పలేదు. ఏ పార్టీతరపున టికెట్ కావాలన్నా రఘురామ అక్కడి నుండి గెలుస్తారన్న నమ్మకం పార్టీలకు కుదరాలి. జనం రఘురామ వైపు ఉన్నారని స్పష్టం కావాలి. ఆసర్వేలు చేసుకున్న తర్వతనే ఎవరైనా టికెట్ ఇస్తారు. మరి రఘురామను ఏ పార్టీ వరిస్తుందో చూడాలిక అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఈ జాబితాలో మరో కీలక నేత దగ్గుబాటి పురంధేశ్వరి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగు పెట్టి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిని నిర్వర్తించారు పురంధేశ్వరి. అయితే రాష్ట్ర విభజన తర్వాత బిజెపిలో చేరారు కానీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. 2014లో రాజంపేటలోనూ 2019లో విశాఖపట్నంలోనూ ఆమె పరాజయం పాలయ్యారు. నాలుగేళ్లుగా బిజెపి పార్టీ పదవి అయితే ఉంది కానీ చేయడానికి పెద్దగా కార్యక్రమాలేవీ లేకుండా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. బిజెపి తరపున పోటీ చేస్తే ఏపీలో గెలిచే స్థానం ఒక్కటి కూడా లేదు. మరి తన తండ్రి స్థాపించిన టిడిపిలో చేరతారా అన్నది తేలాలి. గతంలో చంద్రబాబు నాయుణ్ని వ్యక్తిగతంగా దూషించిన పురంధేశ్వరి తిరిగి ఆ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అది కాకపోతే ఆమెకు మిగిలింది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీయే. పురంధేశ్వరి భర్త వెంకటేశ్వరరావు తో పాటు తనయుడు కూడా మొన్నటి వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆమె తలచుకుంటే వైసీపీలో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ వైసీపీలో చేరితే ఆమె విశాఖ లోక్ సభ నియోజక వర్గాన్నే డిమాండ్ చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మరో కీలక నేత కేశినేని నాని. విజయవాడ నుండి టిడిపి ఎంపీగా ఉన్న కేశినేని నానికి పార్టీ అధినేతతోనే పడ్డం లేదు. కేశినేని సోదరుడు కేశినేని చిన్నిని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం నానికి నచ్చలేదు. తన సీటుకు ఎర్త్ పెడుతున్నారన్న కోపం ఉంది నానిలో. అందుకే తన సోదరుడికి టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని హెచ్చరించారు నాని. కొద్ది రోజులుగా కేశినేని నాని తన జిల్లాకే చెందిన వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ కూడా ఆప్త మిత్రుల్లా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కాక రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నాని వైసీపీలో చేరతారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాని లాంటి నేత వస్తానంటే వైసీపీ అధినేత కూడా వద్దనరని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇటువంటి నేతలు మరికొందరు ఉన్నారు వీరంతా కూడా ఏ పార్టీలో చేరితే రాజకీయంగా బాగుంటుందో లెక్కలు వేసుకుంటున్నారు. తమను ఆదరించే పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.