తన రాజకీయ జీవితంలోనే అత్యంత కీలక ఎన్నికలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 75ఏళ్ల వయసులోనూ ఆయన చురుగ్గా తిరుగుతున్న తీరు నిజంగా అద్భుతం. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన పవన్ కల్యాణ్ ను మించిన దూకుడుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నిప్పులు చెరిగేఎండలను సైతం లెక్కచేయకుండా ఆయన నవ యువకుడిలా ప్రచారం చేసుకుపోతున్నతీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి..చంద్రబాబు నాయుడికీ చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందితే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇప్పటికే 75 ఏళ్ల వయసుంది. ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే 2029 ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు మీద పడతాయి. ఆ వయసులో క్రియాశీలకంగా ఉండడం అంత తేలిక కాదు. తనయుడు లోకేష్ రాజకీయంగా సెటిల్ కాలేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నంత పట్టుదలగా ఉన్నారు. తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ఎన్నికల యుద్ధంలో భీష్ముడిలా దూసుకుపోతున్నారు.
జనసేన-బిజెపిలతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు రెండు పార్టీల్లోనూ తనకు అనుకూలమైన వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. చాణక్యుడూ ఆయనే చంద్రగుప్తుడూ ఆయనే. వ్యూహాలతో పాటు యుద్ధానికి శ్రేణులను సంసిద్ధం చేయడంలోనూ చంద్రబాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక ప్రజాగళం పేరిట నిర్వహిస్తున్న ప్రచార సభల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజానికి నిప్పులు చెరిగే ఎండల్లో ఆ వయసులో ఇంత యాక్టివ్ గా తిరగడం మాటలు కాదు.
వయసులో తనకంటే చాలా చిన్నవాడు అయిన తన మిత్ర పక్షం నాయకుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఎండల్లో ప్రచారం చేయగానే ఆయనకు జ్వరం వచ్చింది. రెండు మూడు రోజుల పాటు చురుగ్గా ఉండలేకపోయారు. కానీ చంద్రబాబు మాత్రం తనలోని శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుని ఓ లక్ష్యంతో వ్యవహరిస్తున్న తీరు కు రాజకీయ పరిశీలకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి గెలిచినా..ఓడినా.. చంద్రబాబు ప్రచార తీరు మాత్రం చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుందంటున్నారు రాజకీయ పండితులు.
ఒక పక్క ప్రచారం జోరు. మరో పక్క పొత్తుల కారణంగా చాలా నియోజక వర్గాల్లో అసమ్మతి నేతల తలనొప్పులు. అయితే చంద్రబాబు మాత్రం చాలా ఓపిగ్గా అసంతృప్త నేతలను దారికి తెచ్చుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ దశలో సీనియర్లు గంటా , మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారి వల్ల సమస్యలు వస్తాయేమో అనుకున్నారు.కానీ చంద్రబాబు చక్రం తిప్పి గంటాకు భీమిలి ఇప్పించి మండలిని జనసేనలో చేర్పించి అవనిగడ్డ టికెట్ వచ్చేలా చేశారు. సంక్షోభాలను చిటికెలో పరిష్కరించుకుంటూ ముందుకు పోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే అంటారు పరిశీలకులు.
వైసీపీ రెబెల్ రఘురామ కృష్ణం రాజుకు కూడా ఉండి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్ ఖాయం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా పావులు కదిపారని చెప్పచ్చు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ఉద్దేశించి ముసలోడు ముసలోడు అని హేళన చేస్తున్నారు. దానికి తిరుగులేని కౌంటర్ గా చంద్రబాబు నాయుడు మండుటెండల్లో ఉత్సాహంగా గంటల తరబడి ప్రచారం చేస్తూ తన ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గెలుపా ఓటమా అన్నది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు తన మాస్టర్ బ్రెయిన్ తో రాజకీయ పరిశీలకుల మనసులు మాత్రం దోచుకున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…