ఇప్పటికే భారీ వర్షాలు-వరదలతో అతలాకతలం అయిన రాష్ట్రానికి మరో తుఫాన్ దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.
దీని ప్రభావంతో 14 వతేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటిడిప్పుడే తీవ్ర వర్షాలు సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజలకు మరోసారి తుఫాన్ అనే హెచ్చరిక తో భయపడుతున్నారు
అల్పపీడనం ఈనెల 14న వాయుగుండంగా మారి, 15న తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ఈనెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, ఏపీ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.
కాలువలు, చెరువుల గట్లపై అధికారుల దృష్టి
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో భారీవర్ష సూచన నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం, అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది. మరోవైపు బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లపై అధికారులు దృష్టిపెట్టారు. వాటిని పటిష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే వాగులు, వంకలూ పొంగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని నిర్ణయించారు. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…