ప్రత్యేకహోదా రాదు, పోలవరం పూర్తికాదు.. కేంద్రమంత్రులు

By KTV Telugu On 15 December, 2022
image

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అటకెక్కింది. ప్రతీసారి రాష్ట్ర ఎంపీలు హోదా ఇవ్వండి అని కోరడం. అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రమంత్రులు చెప్పడం జరుగుతోంది. తాజా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎప్పటిలాగే ఎంపీలు అడిగిన స్పెషల్ స్టేటస్‌ హామీని కేంద్రం పక్కనబెట్టేసింది. ఆ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెబితే కాదు పదేళ్లు ఇవ్వాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు అన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్రమోడీ హోదా ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక హోదా ఉనికి లేదని చెబుతున్నారు.

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ హోదా గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రసుత్తం ఆ అంశం ఉనికిలోనే లేదని వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు లోక్‌సభలో కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, భరత్‌లు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా ప్రతిసారి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. అసలు ఆ వాగ్దానం ఎవరు చేశారని ప్రశ్నించడంతో ఎంపీలు విస్తుపోయారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా స్పందించారు. 2014లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని హోదా పొడిగింపుపై వెంకయ్య మాట్లాడారని గుర్తు చేశారు.

2019ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి జగన్ సర్కార్ అధికారంలోకి రావడానికి ప్రత్యేకహోదా కూడా ఓ కారణం. 2014లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బాబు హోదాను గట్టిగా అడగలేకపోయారు. పైగా హోదాతోనే అంతా అయిపోతుందా హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని సన్నాయి నొక్కులు నొక్కారు. హోదాపై పలుమార్లు నాలుక మడతేశారు. దీన్ని ప్రధాన అజెండా చేర్చుకొని వైసీపీ పోరాటాలకు దిగింది. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యువభేరి సదస్సులు నిర్వహించి యువతలో హోదాపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎంపీలు హోదాను డిమాండ్ చేస్తూ రాజీనామాలకు సిద్ధపడ్డారు. హోదా ఇచ్చే వారికే కేంద్రంలో తమ మద్దతుంటుందని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక హోదాను లైట్ తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతీసారి ఎంపీలు హోదా అడగడం కేంద్రం లేదని చెప్పడం ద్వారా ప్రజలకు ఏవిధమైన సందేశం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమేనని తెలిపింది. రాజ్యసభలో పోలవరంపై ఎంపిలు కనకమేడల రవీంద్ర కుమార్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోసు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ సమాధానం ఇచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని కొన్ని కారణాలతో ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి 2019 నుంచి ఇప్పటి వరకు రూ.6,461.88 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఇంకా చెల్లించాల్సింది రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ సర్కార్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైనట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తప్పనిసరిగా సాయం చేస్తుందని ఆశించింది. కానీ మోడీ సర్కార్ అవేమీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు జగన్ సర్కార్ దీనిపై ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాలి.