మూడు రాజధానులపై విపక్షాల రగడ.. రెఫరెండం పెట్టాలంటూ డిమాండ్

By KTV Telugu On 16 February, 2023
image

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మరోసారి రాజకీయ రచ్చ రాజేసింది. మూడు రాజధానుల విషయంలో విపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని పాలక పక్షం అంటోంటే విశాఖ రాజధాని కావాలని ఎవరూ కోరుకోవడం లేదంటోంది జనసేన. ఇక మూడు రాజధానులపై రెఫరెండం కోరుతున్నారు సిపిఐ నేత రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని టిడిపి వాదిస్తోంది. టిడిపికి అనుకూలంగా సిపిఐ జనసేన కాంగ్రెస్ లు మద్దతు పలుకుతున్నాయి. ఏపీ బిజెపి నేతలు అమరావతి పాట పాడుతోన్న బిజెపి కేంద్ర నేతలు మాత్రం రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని తేల్చి పారేశారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోనే హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండే పూర్తిగా పాలన సాగిస్తారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు అభివృద్ది వికేంద్రీకరణే తమ అజెండా అన్నారు. విపక్షాలు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అయోమయం సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా త్వరలోనే తాను విశాఖ కు షిఫ్ట్ అవుతానని అన్నారు. విశాఖ రాజధాని కాబోతోందని అందరం అక్కడ కలుద్దాం అని జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. దీనిపై ఇపుడు విపక్షాల్లోనూ కదలిక వచ్చింది. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజధాని విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. విశాఖే రాజధాని కావాలని ఎవరూ కోరుకోవడం లేదంటూ నాదెండ్ల విచిత్రమైన వ్యాఖ్య చేశారు. దమ్ముంటే మూడు రాజధానుల అంశంపైనే ఎన్నికలకు వెళ్లాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క సిపిఐ రామకృష్ణ సైతం మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు. అయితే ఇదో పెద్ద ఫార్స్ అంటున్నారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతనే ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరిగితే అందులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ధులే గెలిచారని వారు గుర్తు చేస్తున్నారు.

ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే అందులోనూ అమరావతి ప్రాంతంలో కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని వారు అంటున్నారు. చివరగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న పాలక పక్షానికే అధికారం కట్టబెట్టారని ఒకే ఒక్క మున్సిపాలిటీలో టిడిపి గెలిచిందని వారంటున్నారు. ఈ మూడు ఎన్నికలూ కూడా రెఫరెండం కిందే లెక్క అంటున్నారు పాలక పక్ష నేతలు.
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుంటూరు, విజయవాడ నగరాల్లో ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అమరావతి అంశాన్నే తెరపైకి తెచ్చారు. ఈ ఎన్నికల్లో మీరు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను గెలిపిస్తే మూడు రాజధానులకు మీరు ఒప్పుకున్నట్లే అని హెచ్చరించారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటే టిడిపిని గెలిపించాలని పిలుపు నిచ్చారు.

ఈ క్రమంలోనే మీకు సిగ్గూ లజ్జా పౌరుషం లేవయ్యా అంటూ అసహనం ప్రదర్శించారు కూడా చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా మూడు రాజధానులకు ఓకే అన్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 23న దానిపై సుప్రీంలో విచారణ జరగనుంది. ఆ రోజున సుప్రీం ఏం ఆదేశిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజధాని ఎక్కడ ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పాలన చేయచ్చన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అంటున్నారు నిపుణులు. ఆ లెక్కన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను ఇదివరకే ప్రకటించినట్లు విశాఖ నగరంలో క్యాంప్ కార్యాలయాన్ని పెట్టుకుని అక్కడి నుండి పాలించవచ్చునని వారంటున్నారు.

2024 ఎన్నికల వరకు రాజధాని విషయం కోర్టులోనే ఉండిపోతే బాగుండునని చంద్రబాబు కోరుకుంటున్నారు. అప్పుడు అమరావతినే తమ అజెండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్లచ్చన్నది ఆయన వ్యూహం. అదే జరిగితే తమ నెత్తిన పాలు పోసినట్లే అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా టిడిపిని 29 గ్రామాలకు పరిమితం చేసి రాయలసీమ, ఉత్తరాంధ్రలో టిడిపిని చావు దెబ్బ తీయచ్చన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతోనే పవన్ కళ్యాణ్ కాబట్టి. ఆయన కూడా అమరావతికే జై కొడతారు. మూడు రాజధానులను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తారు పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధం అవుతోంది. ఇది ఒక విధంగా టిడిపి, జనసేనలకు ట్రాపే అంటున్నారు రాజకీయ పండితులు.