ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన విపక్ష కూటమి కూర్పు కుదిరిపోయింది. అనేక ప్రయత్నాల అనంతరం టిడిపి-జనసేనలతో పొత్తుకు బిజెపి నాయకత్వం సై అంది. ఆ వెంటనే మూడు పార్టీలు ఎన్నెన్ని సీట్లలో పోటీ చేయబోతున్నాయో ప్రకటించారు. బిజెపి-జనసేనలకు కలిపి 31 అసెంబ్లీ స్థానాలు 8 లోక్ సభ స్థానాలు కేటాయించారు. టిడిపి 144 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయబోతోంది. అదే విధంగా 17 పార్లమెంట్ స్థానాల్లో టిడిపి అభ్యర్ధులు బరిలో దిగనున్నారు.
చంద్రబాబు నాయుడు తాను అనుకున్నది సాధించారు. బిజెపితో పొత్తు పెట్టుకుని తీరాలనుకున్న చంద్రబాబు ఏడాదిగా చాలా తెలివిగా పావులు కదుపుతూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ ను బిజెపి నేతలతో మాట్లాడిస్తూ సానుకూల వాతావరణం కొనసాగేలా చేసుకున్నారు. చివరకు తన ఆకాంక్ష మేరకే టిడిపి-బిజెపి-జనసేన ల మధ్య పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఇందులో జనసేనాని పవన్ కల్యాణ్ కూడ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన తానే టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిరేలా చేయగలిగానని పవన్ అందుకే అంటున్నారు.
పొత్తు ఖాయం కాగానే బిజెపి నాయకత్వం ఇద్దరు జాతీయ నేతలను చంద్రబాబు నివాసానికి పంపింది. వారితో పాటు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు నాయుడు మూడు పార్టీలకు ఎన్నెన్ని సీట్లు కేటాయించారో వివరించారు. బిజెపికి 8 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే కనీసం రెండంకెల సీట్లయినా లేకపోతే క్యాడర్ అసంతృప్తికి లోనయ్యే అవకాశాలున్నాయని కమలనాథులు చెప్పడంతో బిజెపికి 10 స్థానాలు కేటాయించారు. జనసేనకు మొన్న ఇచ్చిన 24 స్థానాల్లో మూడింటికి కోత పెట్టి 21 సీట్లు ఇచ్చారు. మూడు లోక్ సభ స్థానాల్లో ఒకటి తగ్గించి బిజెపికి ఇచ్చారు. టిడిపి 144 అసెంబ్లీ స్థానాలు 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది.
బిజెపికి అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, అరకు, రాజమండ్రి , నరసాపురం లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదే సీటుపై జివిఎల్ నరసింహారావు కూడా కన్నేశారు. అనకాపల్లి నుండి సిఎం రమేష్ పోటీ చేయచ్చంటున్నారు.గత ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం నుంచి గెలిచిన రఘురామ కృష్ణం రాజు ఈ సారి బిజెపిలో చేరి అదే సీటు నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. రెండు రోజుల్లో అభ్యర్ధుల పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడంతో పాటు మరో అసెంబ్లీ నియోజక వర్గం నుండి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నుంచి పోటీ చేయవచ్చునని కొందరు అంటున్నారు. మరి కొందరయితే మరోసారి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. కానీ భీమవరం నియోజక వర్గానికి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు తాజాగా జనసేనలో చేరారు. మరి భీమవరం సీటు ఆయనకు కేటాయిస్తారా లేక పవనే పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
పొత్తులు, మిత్ర పక్షాలకిచ్చే సీట్లు తేలిపోవడంతో చంద్రబాబు నాయుడి పని తేలిక అయిపోయింది. మొదటి జాబితాలో 94 నియోజక వర్గాలకు చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక 50 అసెంబ్లీ స్థానాలకు 17 లోక్ సభ స్థానాలకు చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తారని అంటున్నారు. ఎన్నికల నగారా మోగడంతో ప్రచార బరిలో విస్తృతంగా పాల్గొనాలని కూటమి నేతలు భావిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…