ఏపీలో అధికార వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ఈ వ్యవస్థను రూపొందించింది. ఈ ఉద్యోగులు అంతా గ్రామాల్లో సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తారు. ఇంతరవకు బాగానే ఉంది. కానీ ప్రజలకు నేరుగా పథకాలను చేరవేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వాలంటీర్ల కారణంగా పార్టీలో క్యాడర్ లీడర్ మధ్య గ్యాప్ పెరిగిపోయినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత వాలంటీర్ల ద్వారా చాలా పనులు ప్రజలకు వేగంగా అందుతున్నాయి.గతంలో ఫించన్ అందుకోవాలంటే పంచాయతీ కార్యాలయాల ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఒకటో తేదీ వేకువజామునే వాలంటీర్లు స్వయంగా ఇంటికెళ్లి ఫించన్ అందిస్తున్నారు. అంతేకాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు పొందడంలో ప్రభుత్వానికి ప్రజలకు వాలంటీర్లు వారధిలా పనిచేస్తున్నారు. ఎన్నికలు సహా ఏ విషయంలోనైనా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి తమకు విలువ లేకుండా చేశారనే ఆక్రోశం ఆగ్రహం నాయకులు కార్యకర్తల్లో కనిపిస్తోంది.
పార్టీకి చెందిన కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారనేది వాస్తవం. అయితే ఉద్యోగులుగా మారిన వాలంటీర్లకు కార్యకర్తల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే విషయాన్ని అధిష్టానం గుర్తించడం లేదు. పార్టీని అధికారంలోకి తేవడానికి శ్రమించిన కార్యకర్తల పాత్ర అధికారలోకి వచ్చిన తర్వాత తగ్గిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. సర్వాధికారాలు వాలంటీర్ల చేతిలో పెట్టడంతో పార్టీ అధికారంలో ఉన్నా ఏ పని చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామని కార్యకర్తలు ఉడికిపోతున్నారు. కార్యకర్తలే కాదు ప్రజాప్రతినిథులు కూడా గుర్రుగా ఉన్నారట. ప్రజలు ఇప్పుడు ఏ పనికావాలన్నా నేరుగా సచివాలయాల వద్దకెళుతున్నారు. వాలంటీర్లు లేదా సచివాలయ ఉద్యోగులకు అర్జీలు అందిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నాయకులు ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మొత్తంగా వార్డు గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పాటు కావడంతో అధికార పార్టీ కార్యకర్త, నేత అనే దానికి విలువ లేకుండా పోయింది. ఈ కారణంగా క్యాడర్లో నిస్తేజం ఆవరించింది. దీన్ని ఇప్పటి వరకూ హైకమాండ్ గుర్తించకపోవడతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు వారదర్నీ మళ్లీ యాక్టివ్ చేయడం వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు తలకు మించిన భారంగా మారుతోందట. ప్రస్తుతం క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని హైకమాండ్ గుర్తించి త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కొందరు సూచిస్తున్నారు. పార్టీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పరాభావం తప్పదని హెచ్చరిస్తున్నారు.