ఎన్నికలు ముగిసే వరకు ఏపీలో వాలంటీర్ల చేత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను అందించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వాలంటీర్ల చేత ప్రభుత్వ పథకాలు అమలు చేయించకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు పాలక పక్షానికి అనుకూలంగా ప్రచారం చేస్తారని.. పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తారని నిమ్మగడ్డ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ చేత ఈ ఫిర్యాదు చేయించిందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందన్నది టిడిపి వాదన. వాలంటీర్ల చేత ఇంటింటికీ ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపణ. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని వాలంటీర్లు బెదిరిస్తున్నారని దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని చంద్రబాబు అంటూ వచ్చారు. దానికి అనుగుణంగానే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చేత చంద్రబాబే వాలంటీర్లను ఎన్నికలు అయ్యే వరకు వినియోగించరాదని ఫిర్యాదు చేయించి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచీ టిడిపి ,జనసేనలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ఇంట్లో మగవాళ్లు లేనపుడు వాలంటీర్లు వెళ్లి ఒంటరి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు పదే పదే ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏపీలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని..అందులో 18 వేల మంది మహిళల ఆచూకీ ఇప్పటికీ తెలీదని కేంద్ర నిఘా బృందాలు తనకు చెప్పాయని అన్నారు. వాలంటీర్లు ఇళ్లల్లో ఒంటరి మహిళల వివరాలను సంఘ వ్యతిరేక శక్తులకు అందించడం వల్లనే వారిని కిడ్నాప్ చేశారని తీవ్రమైన ఆరోపణ చేశారు పవన్.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి,జనసేనల విమర్శలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికీ సంక్షేమం అందుతోందని.. అర్హులైన పేదలకు వాలంటీర్లే పథకాలను అమలు చేయిస్తున్నారని మెజారిటీ మహిళలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఎక్కువ మంది వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటూ ఉండడంతో చంద్రబాబు, పవన్ లు డిఫెన్స్ లో పడ్డారు. అంత వరకు తాము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామన్న చంద్రబాబు..ఆ తర్వాత మాట మార్చి తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తీసేది లేదన్నారు.
ఏపీలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రతీ నెల ఒకటో తేదీనే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందిస్తోన్న వాలంటీర్లపై ఈ వర్గాల్లో చాలా మంచి పేరు ఉంది. అంతే కాదు ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలకు అర్హతలు ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో వాలంటీర్లే చెప్పి దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ వ్యవస్థకు మంచి పేరు రావడంతో వీళ్ల ప్రచారం పాలక పక్షానికి లబ్ధి చేకూరుస్తుందని విపక్షాలు కంగారు పడుతున్నాయి. అందుకే వారిని ఎన్నికలయ్యే వరకు దూరం పెట్టేలా ఆలోచన చేశారని అంటున్నారు.టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాలో జన్మభూమి కమిటీలే నిర్ణయించేవి. జన్మభూమి కమిటీల సిఫారసు లేనిదే పథకాలు అందేవి కావు.
అయితే ప్రభుత్వ పథకాల అమలు కోసం జన్మభూమి కమిటీలు ముడుపులు తీసుకోవడం వల్లనే వారిపట్ల వ్యతిరేకత వచ్చిందని అదే 2019 ఎన్నికల్లో టిడిపిని ఓడించిందని పరిశీలకులు అంచనా వేశారు. ఇపుడు వాలంటీర్లు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టిడిపి అంటోంది. అయితే జన్మభూమి కమిటీలపై వచ్చే లంచాల ఆరోపణలు మాత్రం వాలంటీర్లపై ఇంత వరకు రాకపోవడం విశేషమే.టిడిపి వాలంటీర్లను అడ్డుకోవడం వల్ల రెండు నెలల పాటు పింఛను దార్లకు ఒకటో తేదీనే పింఛన్లు అందకపోవచ్చు. అదే జరిగితే టిడిపియే వాటిని ఆపిందన్న భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. అది టిడిపిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండచ్చంటున్నారు. అయితే అది ఏమేరకు ఉంటుందనేది ఇపుడే చెప్పలేం అంటున్నారు మేథావులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…