ఉమ్మడి రాజధాని అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తరచూ తెరపైకి తెస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు పోలింగ్ అనంతరం రిలాక్సింగ్ మోడ్‌లో ఉండటంతో ఇష్యూ పెద్దగా బయటకు రాలేదు కానీ.. మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయనాయకుడు అయిన వీవీ లక్ష్మినారాయణ చేసిన కామెంట్స్ తో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. జూన్ రెండో తేదీతో విభజన చట్టంలో పదేళ్ల ఉమ్మడి రాజధాని అనే అంశానికి ముగింపు వస్తుంది. అయితే అసలు ఉమ్మడి రాజధాని వల్ల ఏపీ ఏం సాధించుకుంది ? ఆ క్లాజ్ కు ముగింపు రావడం వల్ల ఏం నష్టపోతుంది అన్నదానిపై ఏపీ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం రాజకీయం కోసం ఈ వివాదాన్ని వాడుకుంటున్నారని అనుకోవచ్చు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ రెండో తేదీన ముగుస్తోంది. ఏపీ నుంచి ప్రధాన పార్టీల నేతలెవరూ పట్టించుకోవడం లేదు కానీ.. జైభారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మినారాయణ మాత్రం.. మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టంలోని సెక్షన్-5ను ప్రస్తావిస్తూ రాష్ట్రపతి భవన్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని అంటున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిని నిర్ణయింారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు నిర్మించుకున్నారు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది. చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులు వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది. కనీసం అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా సిద్దపడటం లేదు. దీంతో గందరగోళంగా మారింది. ఇదంతా ఏపీ గోల. తెలంగాణకు .. హైదరాబాద్‌కుకు సంబంధం లేదు. నిజానికి ఉమ్మడి రాజధాని అన్న పేరే కానీ ఏపీ వ్యవహారాలు ఏమీ హైదరాబాద్ నుంచి జరగడం లేదు. ఆ ప్రివిలేజ్ ఎప్పుడూ ఏపీ వాడుకోలేదు. కొన్ని భవనాలు తప్ప ఏవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఆ భవనాలను వాడుకున్నది కూడా తక్కువే. మరి ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే వచ్చే లాభమేంటో కూడా జేడీ లక్ష్మినారాయణ తన ట్వీట్‌లో చెప్పాల్సింది. అలాంటిదేమీ చెప్పలేదు. ఒక్క జేడీ లక్ష్మినారాయణే కాదు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలంటున్న వారు ఎవరూ చెప్పడంలేదు.
హైదరాబాద్ లో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉన్న అడ్రస్ ఏదైనా ఉందంటే అది లేక్ వ్యూ గెస్ట్ హౌస్. పదేళ్ల పాటు సచివాలయం భవనాల్లో సగం ఏపీకి ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే భవనాలు ఇచ్చేశారు. వాటిని కూలగొట్టేసి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించారు. ఏపీలో కొత్త సచివాలయం పునాదులపై ఒక్క ఇటుక కూడా జగన్ పెట్టలేదు. ఏపీకి ఉన్న ఒకే ఒక్క అడ్రస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకున్నారా అంటే… అదీ లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే సెక్షన్ 8 అనేది ఉనికిలో ఉంటుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు సంబంధించిన అంశాల్లో.. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేశారు కానీ.. కేసీఆర్ వాటిని చాకచక్యంగా ఆపేయగలిగారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 8 అంశం పూర్తిగా గవర్నర్ అధికారాలకు సంబంధించినది. సీమాంధ్రులకు సమస్య వస్తే గవర్నర్.. ఆ సెక్షన్ ను ఉపయోగించుకోవచ్చు. పదేళ్లలో అలాంటి సమస్య రాలేదు.
హైదరాబాద్ ఏపీ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. తెలంగాణ రాజధానిగా ఉన్న ఏపీ ప్రజలకు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో విభజన కు ముందు.. ఆ తర్వాత కూడా ఎవరికీ సమస్యలు రాలేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎప్పట్లానే పొందుతున్నారు. ఎవరూ ఆంక్షలు పెట్టడంలేదు . అందుకే .. రాజకీయాల కోసం ఉమ్మడి రాజధాని పేరుతో హడావుడి చేస్తే ప్రజలకే నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోయిందంటే అది పూర్తిగా అక్కడి రాజకీయ నాయకుల చేతకానితనం… దానికి తెలంగాణ ఎలాంటి బాధ్యత వహించదు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా .. అందరి సిటీగా ఉంచేసి.. రాజకీయాల్లో మిక్స్ చేయకపోతే రాజకీయ నేతలు చేసే మేలు ఉండదు.
విభజన జరిగిన పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో కలిసి ఉండేవా అన్నంత ఎక్కువగా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుని ఎవరికివారు సాగిపోతే మంచిది కానీ.. ఉమ్మడి రాజధాని లాంటి లేనిపోని పంచాయతీలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…