భారీ వర్షానికి నీట మునిగిన అనంతపురం

By KTV Telugu On 23 October, 2024
image

KTV TELUGU :-

అది చెన్నై కాదు, బెంగళూరు కాదు. చివరకు హైదారాబాద్ కూడా కాదు. కరువు సీమ రాయసీమలోని అనంతపురం జిల్లా అది. భారీ వర్షాలతో ఆ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు నీటమునిగాయి. అనంతపురంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, వాగు ఉద్ధృతితో జన జీవనం స్తంభించిపోయింది. కాలనీలు నీట మునిగాయి. నగరానికి అనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరుకుంది. కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవహం పెరగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధిక వరద పోటెత్తడంతో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. దీంతో అనంతపురంలోని పండమేరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఈ క్రమంలోనే అనంతపురం గ్రామీణ పరిధిలోని కళాకారుల కాలనీ, అంబేడ్కర్​ కాలనీ, ఉప్పరపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు నీట మునిగాయి. దీంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 అడుగుల మేర వరద నిలిచిపోవడంతో వారు ఎటు వెళ్లాలేని పరిస్థితి.

నీట మునిగిన కాలనీలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ధర్మవరం టీడీపీ ఇన్​ఛార్జీ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. కాలనీల ప్రజలకు సమీపంలో భోజన సదుపాయం కల్పించారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని పరిటాల శ్రీరామ్​ తెలియజేశారు. కనేకల్ మండలంలో భారీ వర్షం కురవడంతో హనకనహాల్​ వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సొల్లాపురం, బెలుగుప్ప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు ఖరీఫ్​లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, వేరుశనగ, టమాట, మిరప, ఉల్లి, తమలపాకు తోటలు భారీ వర్షానికి కుళ్ళిపోయి తీవ్రమైన నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు.

కళ్యాణదుర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అక్కడ 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. పట్టణంలోని లొతట్టు ప్రాంతంలోకి వరద వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే అనంతపురం వెళ్లే మార్గంలో సాయిబాబా గుడి వద్దకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రధాన రోడ్లలోని గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరి కొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అనంతపురం వాసుల్లో ఒకింత సంతోషం, ఒకింత భయం కనిపించింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి