యువగళం పాదయాత్ర చివరి దశలో ఉంది. మరి కొద్దిరోజుల్లోనే యాత్రను విశాఖ జిల్లా భీమిలిలో ముగించడానికి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గర పడ్డంతో పార్టీ పరంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున లోకేష్ పార్టీకి అందుబాటులో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖ జిల్లాలో అడుగు పెట్టాల్సి ఉన్న యువగళం పాదయాత్రకు తన నియోజక వర్గంలో ఏర్పాట్లు చేయలేనంటూ మాజీ మంత్రి సీనియర్ నేత చేతులు ఎత్తేయడంతో లోకేష్ యాత్ర రూటు మారింది. తన కుమారుడికి టికెట్ ఇవ్వడం లేదన్న ఉక్రోషంతోనే మాజీ మంత్రి లోకేష్ యాత్రకు సహకరించడం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ నాయకుడు. లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా తన కుమారునికి సీటు ఆశిస్తున్నారాయన. గత ఎన్నికల్లోనే తన కుమారుడు విజయ్ కు ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారైనా సీటు వస్తుందని ఆశించారు. కానీ టిడిపి నాయకత్వం మాత్రం అయ్యన్న కుమారుడుని కాదని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకువచ్చింది. అనకాపల్లి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తారనే సంకేతాలు పంపింది. దీంతో అయ్యన్న కోపం తారాస్తాయికి చేరింది.
ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించే సమయంలో పాయకరావుపేట మీద నుంచి నర్సీపట్నం మీదుగా పాదయాత్ర చేయించాలని టిడిపి అధిష్టానం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రూరల్ నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, అనకాపల్లి మీదగా పాదయాత్ర చేపట్టి విశాఖలో ముగించాలని నిర్ణయించింది. కానీ అయ్యన్నపాత్రుడు నారా లోకేష్ కు ఝలక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర వద్దంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. లోకేష్ పాదయాత్రకి తన నియోజకవర్గంలో ఏర్పాట్లు చేయడం కష్టమని మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక లోకేష్ తన పాదయాత్రను పాయకరావుపేట నుంచి ఎలమంచిలి వైపు రూటు మార్చుకున్నారు.
తాము మొదట నుంచి పార్టీకి సేవలందిస్తున్నామని, బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తనకు గుర్తింపు ఉందని, తన కొడుకు విజయ్ ఇప్పటికే ఐ టీడీపీ తరఫున పనిచేస్తున్నాడని..అతనికి ఎంపీ సీటు ఇస్తే వచ్చిన ఇబ్బందేంటని టిడిపి అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు అయ్యన్నపాత్రుడు. పదవుల కోసం తాము పార్టీలు మారలేదని, గంటా శ్రీనివాసరావు లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీకి కష్ట కాలంలో కూడా అండగా నిలబడ్డామంటున్నారు.
తన కుమారునికి సీటు ఇవ్వకపోయినా స్థానికంగా ఉన్న నేతలకే ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం తనలాగే ఎంతోమంది కష్టపడిన వారు ఉన్నారని, వారికి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వలస నేతలతో నిండిపోయిందని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్థానికంగా చాలామంది నాయకులు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అనకాపల్లికి సంబంధం లేని పది జిల్లాల అవతల ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి తమ నెత్తిన రుద్దుతామంటే సహించేది లేదంటున్నారు అయ్యన్న.
అయ్యన్న పాత్రుడు పదే పదే వలస నేతలు అని ఆరోపించడానికి కారణాలు లేకపోలేదు. ఉత్తరాంధ్రతో ఏ మాత్రం సంబంధం లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇలానే విశాఖ జిల్లాలో పలు నియోజక వర్గాల్లో టికెట్ ఇవ్వడం అయ్యన్న పాత్రుడికి ఏ మాత్రం నచ్చలేదు. గంటాపై కోపంతోనే వలస నేతలపై ఆయన మండి పడుతున్నారని అంటున్నారు.ఇంకా ఎంతకాలం వలస నేతలను భరించాలంటూ అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్థానిక నాయకుల అభిప్రాయాలను గౌరవించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…