అయ్యన్న టికెట్ కు గంటా ఎసరు పెడుతున్నారా

By KTV Telugu On 4 February, 2023
image

రాజకీయాల్లో చాలా ఓపిక ఉండాలి. మన శత్రువును దెబ్బతీయాలంటే చాలా ఓపిక ఉండాలి. పరిస్థితులు మనకి అనుకూలంగా మారే వరకు ఎదురు చూడాలి. అలవి కానపుడు అధికులమనరాదు కానీ అవకాశం చిక్కితే మాత్రం క్షణం ఆలస్యం చేయకూడదు. ఇపుడు విశాఖలో ఓ నేత ఇదే చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా టిడిపిలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఏళ్ల తరబడి వార్ నడుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేని తరుణంలో ఇపుడు ఒకరి తలని మరొకరు నరికేసుకోడానికి సిద్ధం అవుతున్నారు. టిడిపి హయాంలో మంత్రులుగా వ్యవహరించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఎప్పుడూ మంచి సంబంధాలు లేవు. అయితే ఎవరూ ఎవరికీ తీసిపోరు కాబట్టి ఆధిపత్య పోరులో ఒకరినొకరు చికాకు పెట్టుకుంటూ తిట్టుకుంటూ వస్తున్నారు.

ప్రత్యేకించి అయ్యన్నపాత్రుడే బాహాటంగా గంటాపై వ్యాఖ్యలు చేస్తారు కానీ గంటా మాత్రం మౌనంగా ఉంటూనే చాపకింద నీరులా అయ్యన్నను ఎలా దెబ్బతీయాలా అని పావులు కదుపుతారు. తాజాగా అయ్యన్న పాత్రుడి సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో వచ్చే ఎన్నికల్లో బరిలో నిలబడేదెవరు అన్న అంశంపై పోటీ మొదలైంది. పార్టీ అధిష్ఠానం వద్ద కర్చీఫ్ వేసేసుకోడానికి కొందరు నేతలు సిద్ధమైపోయారు. వారిలో బోలెం ముత్యాల పాపతో పాటు రుత్తుల ఎర్రపాత్రుడు ముమ్మర యత్నాలు మొదలు పెట్టేశారు. చాలా కాలంగా పార్టీకోసం పనిచేస్తోన్న తనకు ఈ సారి టికెట్ ఇవ్వాల్సిందేనని ఎర్ర పాత్రుడు పట్టుబడుతున్నారట. మరో వైపు తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని మాట ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప అంటున్నారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ముత్యాల పాప అయ్యన్న పాత్రుడిపై గెలిచారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడికి టికెట్ ఇస్తే టిడిపి నర్సీపట్నం పై ఆశలు వదులుకోవచ్చునని ఈ ఇద్దరు నేతలు హైకమాండ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఈ వ్యవహారాలను అక్కడెక్కడో విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు నిశితంగా గమనిస్తున్నారు. తన రాజకీయ శత్రువును దెబ్బతీయడానికి మంచి అవకాశం వచ్చిందని సంబర పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్ర పాత్రుణ్ని విశాఖ పిలిపించి తన నివాసంలో ఏకాంతంగా సమావేశమయ్యారట గంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకు నర్సీపట్నం టికెట్ రాకుండా చంద్రబాబు నాయుడికి లోకేష్ కీ చెప్పాల్సింది చెప్తానని గంటా హామీ ఇచ్చారట. అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన తనయుడు విజయ్ ల వ్యవహారాలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయని అయ్యన్న ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.

అంతగా సీనియర్ కాబట్టి అయ్యన్నకు సీటు ఇవ్వాలనుకుంటే అనకాపల్లి ఎంపీ సీటును ఇచ్చి అయ్యన్న తనయుడు విజయ్ కి మాడుగుల టికెట్ ఇస్తే తమకి అభ్యంతరం లేదని ఎర్రపాత్రుడి చేత చెప్పించడానికి గంటా సిద్ధమయ్యారు.
ప్రత్యేకించి పార్టీ భావి నేత లోకేష్ కు చెప్పి పని కానిచ్చేయాలని గంటా పట్టుదలగా ఉన్నారట. అయితే అయ్యన్న పాత్రుడేమీ ఖాళీగా కూర్చోలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో ఏసీ గదిలో కూర్చుని కాలక్షేపం చేసిన నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే లోకేష్ కు చంద్రబాబుకు చెప్పేశారట అయ్యన్న పాత్రుడు.
2019 ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినపుడు కూడా గంటా బయటకు రాలేదు.

చంద్రబాబు ఎవరో తనకి తెలీదన్నట్లు ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గంటా విశ్వ ప్రయత్నాలు చేశారని వైసీపీ నేత విజయసాయిరెడ్డితో డీల్ కుదుర్చుకున్నారని అయ్యన్న చంద్రబాబు చెవిలో ఊదారట. కొద్ది రోజుల క్రితమే గంటా శ్రీనివాసరావు నోరు తెరిచారు. తాను ఇకపై టిడిపిలో యాక్టివ్ గా ఉంటానని తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని గంటా స్పష్టం చేశారు. అయితే వైసీపీలో ఎంట్రీకి దారి లేకనే గంటా టిడిపిలో కొనసాగాలని డిసైడ్ అయ్యారన్నది అయ్యన్న వాదన. చంద్రబాబు అయితే ఇద్దరు చెప్పేదీ సావధానంగా విన్నారట. ఎన్నికల సమయానికి చంద్రబాబు ఏం చేస్తారో ఈ ఇద్దరు నేతలు కూడా చెప్పలేరంటున్నారు రాజకీయ పండితులు.