ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తోంది. అక్కడ ఇప్పుడు తెలుగుదేశం ఒక తిరుగులేని శక్తిగానే చెప్పుకోవాలి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో సైతం పార్టీకి పునరుజ్జీవం పొందేందుకు ఇదే తగిన సమయమని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం కేడర్ బలాన్ని పెంచుకునే సంకల్పంలో ఉంది. ఏపీలోనూ, తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదులు ఉండాలని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీని పూర్తి యాక్టివ్ గా ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పాతవారు మళ్లి రావాలని, కొత్త వారు వచ్చి చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
గత పదేళ్లుగా తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీకి కొంతబలమున్నప్పటికీ గెలిచి సత్తా చాటలేకపోతోంది. కేడర్ బలమున్నప్పటికీ, పార్టీకి సానుభూతిపరులున్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు తెలంగాణలో కరువయ్యారు. చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అందుకే హైదరాబాద్ మాజీ మేయర్ తీగెల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తీగెల కృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి కుటుంబం టీడీపీలో చేరుతుందని వార్తలు వచ్చినప్పుటికీ ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదు. కాకపోతే మల్లారెడ్డి విషయంలో గుర్రం ఎగరావచ్చు అన్న సామెత చెప్పుకుంటున్నారు…
టీడీపీలోనూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్లోనూ మంత్రిగా పనిచేసిన నటుడు, దళితనేత బాబు మోహన్…ఇప్పుడు చంద్రబాబు పార్టీ వైపుకు వచ్చారు. ఇటీవలే హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి ఆయన పార్టీలో అధికారికంగా చేరకముందే సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన ఆందోల్ నియోజకవర్గంలోనే ఆయన టీడీపీ సభ్యుడయ్యారు. చంద్రబాబును కలిసినప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనైన బాబు మోహన్ ఇకపై టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. చేరికకు ముహుర్తం ఖరారు చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన గుట్టుచప్పుడు కాకుండా సభ్యత్వం తీసేసుకున్నారు…
1998లో తొలిసారిగా ఆందోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బాబు మోహన్ పోటీ చేశారు . ఆ ఎన్నికల్లో గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో మాత్రం కెసిఆర్ బాబు మోహన్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో సైతం మరోసారి బరిలో దిగినా.. ఓటమి ఎదురైంది. ఆ మధ్యన కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో రూటు మార్చారు బాబు మోహన్. తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. బాబు మోహన్ టీడీపీ సభ్యత్వం తీసుకున్న నేపథ్యంలోనే ఆయనకు ఎలాంటి బాధ్యత అప్పగిస్తారన్న చర్చ మొదలైంది. కాసాని జ్ఞానేశ్వర్ వెళ్లిపోయిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడి పదవిని భర్తీ చేయలేదు. ఇప్పుడా పదవిని తీగెల కృష్ణారెడ్డి లేదా బాబు మోహన్ కు ఇస్తారన్న చర్చ మొదలైంది. బాబు మోహన్ కు పదవి ఇస్తే సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. పైగా ఆయనకు సినీ గ్లామర్ కూడా ఉంది.అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని భావిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…