టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త గేమ్ కు తెరతీశారు. వైఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. తల్లీ, కొడుకు, కూతురు కలిసి నాటకాలాడుతున్నారని విజయమ్మ, జగన్, షర్మిలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ వ్యతిరేక ఓటును చీల్చడమే విజయమ్మ ధ్యేయమని అంటూ విమర్శల విసుర్లకు పదును పెట్టారు. చంద్రబాబు తొలి సారి చేసిన ఈ కామెంట్ పై రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట అని ఉంటారన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లాలో బిజీగా గడిపారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు రోడ్ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. తల్లీ, ఇద్దరు పిల్లలను కలిపి ఒకే సారి మడతపెట్టి ఆయన కొట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకానికి తెర తీశారని ఆయన ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఓ తల్లి చెప్పిందంటూ వైఎస్ విజయమ్మ వ్యవహారాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తల్లి తన ఇద్దరి పిల్లకి న్యాయం చేయలేదని.. అటువంటి రాష్ట్రానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందని వ్యాఖ్యానించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తెల్చుకోవాలని సూచించారు. ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ మాట మాట్లాడినా ఆచి తూచి డైలాగులు వదిలే చంద్రబాబు.. ఏదో అలవోకగా ఈ మాటలు అన్నారని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. అదీ ఇంతకాలం వైసీపీకి బాగా బలమున్న పల్నాడు ప్రాంతంలో ఆయన గురి చూసి విజయమ్మ, జగన్, షర్మిలపై అటాక్ చేశారంటే ఆయన వ్యూహంలో ఏదో చిన్న మార్పు జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంతకాలం హు కిల్డ్ బాబాయ్,ఆ కుటుంబంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగింది లాంటి కొటేషన్లు వదిలిన చంద్రబాబు సడెన్ గా కొత్త రూటు తీసుకున్నారు. షర్మిల చాలా కాలంగా తనను విమర్శిస్తున్నా చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. ఆమె ఒక బచ్చా అన్నట్లుగా ఆయన వదిలేశారు. విశ్వసనీయత లేని ఆరోపణలు చేస్తుంటారనుకుని లైట్ తీసుకున్నారు. ఈ సారి మాత్రం ఆయన వదిలిపెట్ట దలచుకోలేదు…
చంద్రబాబుది ముమ్మాటికి ఎన్నికల వ్యూహమేనని చెప్పాలి. జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నప్పటికీ జననాడిని ఖచితంగా పట్టుకోలేని పరిస్థితి ఎదురవుతోందని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. 150 స్థానాలు గెలుస్తామని టీడీపీ నేతలు చెప్పుకుంటుండగా…అది అంత సులభం కాదని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన, ఆ ప్రచారం నుంచి డైవర్షన్ కోసం చంద్రబాబు ఇప్పుడు కొత్త ప్రచారాలకు దిగారని చెబుతున్నారు. పైగా టీడీపీ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది..
ఎన్డీయే భాగస్వాముల ప్రధాన కార్తవ్యం కాంగ్రెస్ ను తిట్టడం, హస్తం పార్టీని తూర్పారపట్టడం, బజారుకీడ్చి భారీగా విమర్శలు సంధించడం. చంద్రబాబు మాత్రం ఇంతకాలం ఆ పనిచేయలేదు. కేవలం వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేశారు. ఈ లోపు ఆయన సోదరి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. ఆమెకు వైఎస్ సునీతారెడ్డి కూడా తోడయ్యారు. సిస్టర్స్ ఇద్దరూ సెంటిమెంట్ ను పండిస్తూ….వివేకా హత్య గురించి చెబుతూ, ఆయన రక్తపు మడుగులో పడుతున్న దృశ్యాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో షర్మిలకు, తద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందని చంద్రబాబు కాస్త ఆలస్యంగా గ్రహించారు. కాంగ్రెస్ కొంచెం బలపడినా ఏపీలో ముక్కోణ పోటీ ఏర్పడటం ఖాయం. అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల టఫ్ ఫైట్ అయితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. పైగా షర్మిల తొలుత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆమె జగన్ వదిలిన బాణమేనని విశ్లేషణలు వినిపించాయి. ఒక పథకం ప్రకారం ఆమె ఏపీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇస్తారని అప్పట్లోని ఆమెను ప్రోత్సహించిన మీడియా సంస్థలు కథనాలు ప్రచురించగా….ఇప్పుడు అదే నిజమైంది. షర్మిల ఏకంగా ఏపీసీసీ అధ్యక్షురాలయ్యారు. ఏదో నాలుగు రోజులు తిరిగిపోతారులే అనుకుంటే ఆమె చంద్రబాబుపైనే వాగ్దాణాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే షర్మిల మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబుకు అర్థమైంది. మరో పక్క చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు రోజువారీగా కాంగ్రెస్ ను విమర్శించాలి. ఇంతవరకు ఆ పని చేయని చంద్రబాబు, ఇకపై తన అస్త్రాలకు హస్తం పార్టీపై సంధించేందుకు సిద్ధమవుతున్నారు. క్రోసూర్ సభలో విజయమ్మను విమర్శించడం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా తర్వాత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….
షర్మిల ఊరుకోరు. ఆమె కౌంటర్ ఇవ్వడం ఖాయమని చంద్రబాబుకు తెలియనిది కాదు. ఐనా ఆమె పరిస్థితి వీక్ గానే ఉందని తెలుసు. నాయకులు లేని పార్టీని, కేడర్ దెబ్బతిన్న పార్టీని ఆమె నడిపిస్తున్నారని, డైలాగులతో ఎక్కువ కాలం పార్టీని నడపలేరని కూడా చంద్రబాబుకు తెలుసు. కాకపోతే వైఎస్ ఫ్యామిలీ గేమ్ కు ఎక్కడోక్కడ అడ్డుకట్ట వేయకపోతే మాత్రం 2019లో జగన్ అధికారాన్ని లాగేసుకున్న సీన్ రిపీట్ అవుతుందన్న భయం ఆయనకు ఉంది. ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత వ్యూహం ప్రకారం షర్మిల సైలెంట్ అయిపోతే తమకు జరిగే నష్టాన్ని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే ఇప్పుడే బ్యాటింగ్ మొదలు పెట్టేశారు. ఏం జరుగుతుందో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…