ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేడర్, సానుభూతిపరులు ఉబ్బితబ్బిబవుతుంటారు. అంతా తమ రాజ్యమేనన్న సంతోషంలో ఉంటారు. ఐదేళ్లపాటు పడిన కష్టాలను మరిచిపోయి ఎంతో హాయిగా బతుకుతుంటారు. పనులు చేయించుకుని నాలుగు రాళ్లు వెనుకేసుకునే రోజులు వచ్చాయని వడివడిగా అడుగులు వేసుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి లేదనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కేడర్ తో పాటు.. పార్టీ కోసం పరోక్షంగా పనిచేసిన సానుభూతిపరులకు ఇంతవరకు ఎలాంటి సంతృప్తి కలగలేదు. పైగా వాళ్లు నిరాశపడే పరిస్థితులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దానితో ఏం చేయాలో అర్థం కాక వాళ్లిప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు…
జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆయన్ను ఎదిరించి నిలబడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వైసీపీ శ్రేణులు ఎగబడి కొడుతున్నా తట్టుకుని నిలబడ్డారు. కేసులను, జైలు ఊచలను లెక్కపెట్టుకున్నారు. కొందరు డైరెక్టుగా రంగంలోకి దిగితే మరికొందరు పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా తమ వాదనను వినిపించారు. వారంతా కూడా జగన్ ఓటమికి, కూటమి విజయానికి పనిచేశారు. అందులో పాత్రికేయులు, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఉన్నారు. కట్ చేసి చూస్తే ఎన్నికలు ముగిసి కూటమి గెలిచిన తర్వాత వారిని పట్టించుకునే పెద్దమనిషే కరువయ్యారు. పైగా జగన్ చేసిన తప్పులు, వృథా ఖర్చులు వద్దని అప్పట్లో కోడై కూసిన వాళ్లకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. అప్పటి పొరబాట్లే మళ్లీ పునరావృతం అవుతున్నాయన్న ఫీలింగ్ తో వాళ్లు తెగ ఊగిపోతున్నారు. ఐనా చంద్రన్న మాత్రం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు…
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల నామినేటెడ్ పదవులను ప్రకటించింది. అందులో ప్రముఖులకు తప్పితే.. టీవీల్లో కనిపించే, సామాజిక మాధ్యమాల్లో వినిపించే సోషల్ మీడియా వారియర్స్ కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అనేక కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగిన వారికి ఇప్పుడు మొండి చెయ్యే కనిపిస్తోంది. టీడీపీ కోసం పనిచేసిన ఒక్క జర్నలిస్టుకు కూడా నామినేటెడ్ పదవులు దక్కలేదు. సొంత వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టుకుని సోషల్ మీడియాలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికి ఇప్పుడు ఎలాంటి ప్రోత్సాహకం లేదు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని ఎదురుచూసిన వాళ్లు ఇప్పుడు నీరుగారిపోతున్నారు. అమరావతికి వచ్చే పరిశ్రమలు ఏమిటో వారికి అర్థం కావడం లేదు. రాష్ట్రమంత్రి అయిన సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇటీవల అమెరికా వెళ్లి పారిశ్రామికవెత్తలతో చర్చలు జరిపితే టన్నుల కొద్ది డాలర్ల పెట్టుబడి వచ్చేస్తుందని ఎదురు చూశారు. అందుకు భిన్నంగా దావోస్ లో జరిగే ఒప్పందాల తర్వాతే పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో టీడీపీ సానుభూతిపరులే ముక్కున వేలేసుకుంటున్నారు…
అసలు చంద్రబాబు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందీ అన్నది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో తెలియకుండా ప్రచారానికి, టైమ్ పాస్ కు ప్రాధాన్యమిస్తున్నారని ఒక సోషల్ వారియర్ తన ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు నిర్వహించిన బెడవాడ టు శ్రీశైలం సీ ప్లేన్ ప్రయాణాన్ని టీడీపీ సానుభూతిపరులే పులిహోర ప్రాజెక్టు అని పిలుస్తున్నారు. వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని నిలదీస్తున్నారు. అసలు సీ ప్లేన్ మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందా.. దానికి జనాదరణ లభిస్తుందా అని వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
చంద్రబాబుకు ప్రజాదరణ పెరగాలన్నా, ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న సీ ప్లేన్ లాంటి పులిహోర ప్రాజెక్టులు పనిచేయవని, 2014 నుంచి 2019 మధ్య ఇలాంటి చర్యల వల్లే ఓడిపోయామని కొందరు సోషల్ వారియర్స్ గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు నాలుగైదు అంశాలపై దృష్టి పెట్టాలని వాళ్లు సూచిస్తున్నారు. సిన్సియర్ గా పనిచేయడం అందులో ప్రధానమైనదని విశ్లేషిస్తున్నారు. తెలివిగా రాజకీయం చేయాలని ఉద్భోదిస్తున్నారు. సొంతమనుషులకు విలువ ఇవ్వాలని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత తక్కువ అవినీతి చేయాలని చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు సిన్సియర్ గా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పని సమర్థంగా జరగడం లేదన్నది కొందరి వాదన. అయితే మిగతా విషయాల్లో మాత్రం ఆయన వెనుకబడిపోయారని చెప్పుకుంటున్నారు. మరి సానుభూతిపరుల బాధలను చంద్రబాబు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారో లేక సొంత మనుషులను కూడా దూరం చేసుకుంటారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…