టిడిపి టెంపొరరీ బాస్ బాలయ్య

By KTV Telugu On 14 September, 2023
image

KTV TELUGU :-

తెలుగుదేశం పార్టీ పగ్గాలు తాత్కాలికంగా నందమూరి బాలకృష్ణ చేపట్టినట్లే కనిపిస్తోంది. పార్టీలో మెజారిటీ నేతలు, నందమూరి కుటుంబ అభిమానులు బాలయ్య సారధ్యంలోనే ముందుకు సాగాలని భావిస్తున్నారా? పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఆ తర్వాత జైలుకు తరలించిన నేపథ్యంలో ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం అవుతారని టిడిపి నేతలు భావిస్తోన్నట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. అందుకే చంద్రబాబు నాయుడి వియ్యంకుడు ఎన్టీయార్ తనయుడు అయిన నందమూరి బాలకృష్ణ పార్టీ హెడ్ గా ఉంటేనే అందరూ క్రమశిక్షణతో ఉంటారని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఏపీ సిఐడీ పోలీసులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుణ్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో చంద్రబాబును రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లోని స్నేహ బ్లాక్ లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడి వయసు..ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను హౌస్ రిమాండ్ విధించాలని
చంద్రబాబు నాయుడి తాలూకు న్యాయవాదులు న్యాయస్థానంలో విజ్ఞప్తి చేశారు.

అటు చంద్రబాబు నాయుడు..ఇటు సిఐడీ తరపు న్యాయవాదులు చేసిన వాదనలను విన్న న్యాయమూర్తి చంద్రబాబును జైల్లోనే ఉంచాలని ఆదేశించారు. హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో సహజంగా విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు,నేతల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వారికి ధైర్యం చెప్పడానికి హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడి వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చారు. పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ విస్తృత స్థాయి నేతల సమావేశం ఏర్పాటు చేసిన బాలకృష్ణ ఇలాంటి కేసులు ఎన్ని వేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు.

సినిమాలకే పూర్తి సమయం కేటాయించే బాలయ్య రాజకీయాలకు ఎంత వరకు సమయాన్ని ఇస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటే ఆయన తనయుడు నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి ఒక పక్క వివిధ జిల్లాలు పర్యటిస్తూ పార్టీని కదం తొక్కిస్తోంటే..మరో వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా పార్టీలో జోష్ పెంచుతున్నారు. ఎన్నికలకు ఆరేడు నెలల సమయం ఉన్న తరుణంలో చంద్రబాబు అనూహ్యంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో జైలుకెళ్లిన చంద్రబాబు నాయుడి పై మరి కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడానికి సిఐడీ పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఐటీ స్కాం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి, అసైన్డ్ భూముల కుంభకోణం, పోలవరం అవినీతి, రాజధానిలో భూకుంభకోణాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా పిటీ వారెంట్లతో దర్యాప్తులు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులన్నీ వరుసగా దర్యాప్తు చేస్తే చంద్రబాబు నాయుడు ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి.

చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ములాఖత్ లో భాగంగా తనను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో ఇదే చెప్పినట్లు సమాచారం. నారా లోకేష్ పార్టీకి సంబంధించి బయటి కార్యకలాపాలతో పాటు న్యాయవాదులను కో ఆర్డినేట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉండాల్సి వస్తుంది కాబట్టి బయటి వ్యక్తులు కాకుండా తమ కుటుంబానికే చెందిన నందమూరి బాలయ్యకు తాత్కాలికంగా సారధ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీ నేతలంతా విధేయంగా పనిచేసే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. అందుకే బాలయ్యను రంగంలోకి దింపారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి