1985 నుంచి హిందూపురంలో టీడీపీ హవా కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మూడు సార్లు హిందూపురం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ మూడోసారి గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు.. కాని రెండుసార్లు గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని బాలయ్యకు హిందూపురం ఓటర్లు ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పారనే టాక్ నడుస్తోంది. పోటెత్తిన ఓటర్ల మనోభావాలు గమనిస్తే ఈసారి ఫ్యాన్ గిర్రున తిరిగిందని వైసీపీ నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఆరు నూరు అయినా నూరు ఆరయినా హిందూపురంలో బాలయ్యకు తిరుగులేదంటున్నారు టిడిపి నేతలు.
హిందూపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈ సారి టెన్షన్ లో ఉన్నారు. ఆయన ఓడిపోక పోవచ్చు కానీ.. విజయం మాత్రం గతంలో మాదిరిగా నల్లేరుపై బండి నడక అయితే కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు బాలయ్య. గతంలో బాలయ్య తండ్రి నందమూరి తారకరామారావు తో పాటు సోదరుడు హరికృష్ణను గెలిపించి అసెంబ్లీకి పంపారు హిందూపురం ప్రజలు. నందమూరి కుటుంబానికి వీరాభిమానులు ఎక్కువ ఇక్కడ. అదే వారికి కొండంత అండగా ఉందంటున్నారు రాజకీయ పండితులు.
2019లో రెండోసారి గెలిచిన తర్వాత గడచిన ఐదు సంవత్సరాలలో కేవలం 57 రోజులు మాత్రమే హిందూపురంలో గడిపారు. చుట్టపు చూపుగా పెళ్లిళ్లకు, పేరంటాలకు వచ్చి వెళ్లే బాలకృష్ణ అప్పుడప్పుడు తన అభిమానులపై చేయి చేసుకోవడం తప్ప హిందూపురం అభివృద్ధిపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గళం విప్పలేకపోయారని ఆయన ప్రత్యర్ధులు వెటకారాలాడుతున్నారు. గెలిచిన అనంతరం పిఏలకు పెత్తనం అప్పగించడం పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నది వాస్తవం. గెలిపించిన నియోజక వర్గం కన్నా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నియోజక వర్గ మేథావుల్లో ఒక ఫిర్యాదు ఉంది.
అందుకే ఈ ఎన్నికలు బాలయ్యకు కఠిన పరీక్షే అంటున్నారు వారు.
హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గం అభివృద్ధి మీద గట్టిగా దృష్టి ,తన తాబేదార్లకు పెత్తనం ఇవ్వడంతో ప్రజల్లోనే కాదు పార్టీ శ్రేణుల్లోనూ అసహనం ఉందని ప్రచారం జరుగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పార్టీలతో నిమిత్తం లేకుండా అందించారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేర్చాం కాబట్టి ప్రజలు తమ వైపే ఉంటారని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. ఈసారి బాలకృష్ణ మీద కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక అనే మహిళను బరిలో దించారు. స్థానికురాలైన దీపిక నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్ళారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని భరోసా ఇచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుతో అక్కడి పార్టీ కేడర్ కూడా విసిగిపోయింది. ఆరు నెలలకోసారి వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయే వ్యక్తి అవసరమా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గంతో సంబంధం లేని బాలకృష్ణను గెలిపించడం వల్ల స్థానిక నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని స్థానిక బీసీ నేతల్లో అసంతృప్తి ఉందంటున్నారు. పైగా తమకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారనే ఉక్రోషం కూడా వారిలో పెరిగిందట. అయినా బాలయ్య క్యాడర్ ను పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలు అయితే మరోసారి తమ నాయకుని గెలిపించుకోవాలన్న పట్టుదలతోనే ఉన్నారు.
వరుసగా రెండు ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురం అంటేనే నందమూరి వారి సొంత నియోజక వర్గం అన్న పేరు ముద్రపడిపోయింది. అక్కడ నందమూరి వంశంలో ఎవరిని నిలబెట్టినా విజయం ఖాయమన్న భావన రాజకీయ వర్గాల్లోనూ ఉంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం కోసం బాలయ్య ఎదురు చూస్తున్నారు. ఈ సారి కూడా గెలిచి తమ కంచుకోటలో తమకి తిరుగులేదని చాటాలని ఆయన పంతంగా ఉన్నారు. అయితే ఈ సారి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదిపింది. అయితే అవి వర్కవుట్ అవుతాయా? లేక బాలయ్య పంతమే గెలుస్తుందా అన్నది జూన్ 4న తేలుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…