బాలినేనికి లోకేష్ పచ్చజెండా ! ప్రకాశం వైసీపీ ఖాళీ..!!

By KTV Telugu On 1 August, 2023
image

KTV Telugu ;-

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయం మారుతోంది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. జగన్ ఆపినా ఆయన ఆగే పరిస్థితి కనిపించడం లేదు. స్వయంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ పరిణామం ప్రకాశం జిల్లాలో లోకేశ్ పర్యటన మొత్తానికి హైలైట్ గా చెప్పొచ్చు…

రాజకీయం అంటే అవకాశాన్ని వెదుక్కోవడం. అధికారంలో ఉండటం. అధికారానికి వస్తుందనుకన్న పార్టీలోకి ముందే వెళ్లిపోవడం. ఆ దిశగా పదవులను సుస్థిరం చేసుకోవడం. వాసు కూడా ఇప్పుడు అదే పనిచేయబోతున్నట్లుగా భావించాలి. పైగా వాసు టీడీపీలో చేరడం అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం తెలుగు తమ్ముళ్లకు అనుకూలంగా మారిడమనే అనుకోవాలి. ఇప్పటికే గోడమీద పిల్లుల్లా ఉన్న నేతలు టీడీపీ వైపు దూకేందుకు రెడీ అయినట్లుగా భావించక తప్పదు…

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్రకాశంలోని ఎంటరైన వెంటనే కాక పుట్టించారు. అప్పటికే కనీసం ముగ్గురు నెల్లూరు పెద్దారెడ్లు టీడీపీ వైపుకు వచ్చేసి ఆయా నియోజకవర్గాల్లో లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. ప్రకాశంలోనూ రెస్పాన్స్ అపూర్వంగా ఉంది. ఇసికేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలపై లోకేశ్ ఓ రెంజ్ లో ఫైర్ అవుతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ కు మనీసూధన్ అని పేరు పెట్టారు. మనీసూధన్ ను ఇంటికి పంపే టైమ్ వచ్చిందని లోకేశ్ ప్రకటించారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున్ రెడ్డి సోదరులు, బావమరుదులు దోచుకుంటున్నారన్నారు. సంతనూతలలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు అరాచకాలు పెరిగిపోయాయని ఆయన్న తరిమికొట్టే టైమ్ వచ్చిందని లెక్క చెప్పారు. నిజానికి కందుకూరు నియోజకవర్గం గుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన లోకేశ్.. స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిపై ఎలాంటి విమర్శలు గుప్పించలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారే తప్ప.. మహేందర్ రెడ్డిని ఏమీ అనలేదు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోతే.. అప్పుడు టీడీపీపై మహేందర్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పైగా బాధితులకు సహాయ పడటంలో టీడీపీ చొరవ చూపిందని మహేందర్ రెడ్డి తన అనుచరుల వద్ద అన్నారట. మహేందర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు చొరవ చూపుతున్నారని, అందుకే లోకేశ్ ఆయనపై ఎలాంటి విమర్శలు చేయలేదని చెబుతున్నారు. టికెట్ హామీ ఇస్తే మహేందర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి వాసు విషయంలోనూ లోకేశ్ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఒంగోలులో పర్యటించినప్పుడు జగన్ ను విమర్శంచారే తెప్ప బాలినేనిని ఒక్క మాట అనలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. బాలినేని ఇప్పుడు జగన్ కు దూరం జరగడం ఒక వంతయితే, టీడీపీలోకి చేరేందుకు రెడీ కావడం రెండో వంతు. వాసును పార్టీలోకి ఆహ్వానించేందుకు లోకేశ్ ఇష్టపడుతున్నారు. ప్రకాశం జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. దానికి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా కలిస్తే ప్రకాశాన్ని స్వీప్ చేసే వీలుంటుందని లోకేశ్ లెక్కలేసుకుంటున్నారు. అయితే ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు చెబుతున్నట్లు సమాచారం. ఒంగోలు లోక్ సభా స్థానం లేదా…వేరే ఏదైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని అందుకు అంగీకరిస్తే ఎప్పుడైనా పార్టీలోకి రావచ్చని టీడీపీ వర్తమానం పంపినట్లు చెబుతున్నారు.

బాలినేని జాయిన్ అయితే వైసీపీకి గడ్డుకాలమేనని చెప్పాలి. ఉమ్మడి ప్రకాశంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో కొండపి ఎమ్మెల్యే డాలా బాలవీరాంజనేయస్వామి, పర్చూరు ప్రజాప్రతినిధి ఏలూరు సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టిడీపీకి చెందిన వారు. టీడీపీ తరపున గెలిచిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తర్వాత వైసీపీలో చేరారు. మిగతా వారంతా వైసీపీ నుంచి గెలిచిన వాళ్లే కావడం విశేషం. ప్రకాశం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పట్ల, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల స్థానిక వైసీపీ నేతల రౌడీయిజం పెరిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలినేని టీడీపీలో చేరితే సైకిల్ పార్టీకి ఇవన్నీ అవకాశాలుగా మారతాయని చెబుతున్నారు. నిజానికి వాసు ఒక ఆర్గనైజర్. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వెంట ఎప్పుడూ పది మంది నేతలుంటారు. ప్రకాశం జిల్లాలో నలుగుురైదుగురికి వైసీపీ టికెట్లు ఇప్పించిన ఘనత కూడా ఆయనదే. వారంతా బాలినేని వెంట టీడీపీలోకి నడిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

వాసు టీడీపీలో చేరితే మొదటగా వైసీపీని దెబ్బకొట్టే నియోజకవర్గాల్లో ఒంగోలుతో పాటు చీరాల, పర్చూరు ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సోదురుడైన ఆమంచి స్వాములు జనసేనలో చేరడం అధికార పార్టీకి పెద్ద ఇబ్బందిగానే భావిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు తరపున స్వాములను చీరాలలో నిలబెడతారని వార్తలు వస్తున్నాయి.. అదే జరిగితే బాలినేని ఆశీస్సులు స్వాములుకు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం లేదా… ఆయన కుటుంబంలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ కేడర్ తో పాటు సామాన్య ప్రజలు కూడా కరణం బలరాంపై కోపంగా ఉన్నారు. గెలిచిన తర్వాత పార్టీని వదిలేశారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. దానితో ఆయన్ను ఓడించి తీరుతామని అంటున్నారు. మరో పక్క పర్చురు ఇంచార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్ ఆదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్సుంది. కాకపోతే పర్చూరులో బాలినేనికి సొంత కేడర్ కొంత ఉంది. పైగా ఇటీవలే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా కమలం పార్టీ తరపున పర్చూరులో పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ముక్కోణ పోటీలో పర్చూరు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కందుకూరు ఎమ్మెల్యే మానుగంటి మహిధర్ రెడ్డి.. టీడీపీలోకి రావడం ఖాయమైంది. చంద్రబాబును విమర్శించాలని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా ఆయన అలాంటి పనులేమీ చేయకుండా నేను మీ బ్యాచ్ అంటూ సైకిల్ పార్టీకి సంకేతాలు పంపుతున్నారు. ఇక సంతనూలపాడు సుధాకర్ బాబుకు ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో కబ్జాల పర్వానికి ఆయన తెరతీసి చాలా రోజులైంది.దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఫ్యామిలీ కరెప్షన్ కు పెట్టింది పేరు. వందల ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. అక్కడి వైసీపీలో ఓ వర్గం ఆయన్ను ఎప్పుడు దిoచేద్దామా అని ఎదురుచూస్తోంది. బాలినేని నాయకత్వంలో పనిచేసేందుకు దర్శి వైసీపీ రెబెల్స్ సిద్దంగా ఉన్నారు. వాసు ప్రత్యేకంగా దృష్టి పెట్టబోయే నియోజకవర్గాల్లో ఎరగొండపాలెం ముఖ్యమైనదిగా చెప్పాలి. అక్కడి ప్రతినిధి అయిన మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే బాలినేనికి అసలు గిట్టడం లేదు. తనను మంత్రి పదవి నుంచి తొలగించి, అదే జిల్లాలో సురేష్ ను కొనసాగించడం ఆయనకు కోపంగా ఉంది. పైగా ఇటీవల సీఎం మార్కాపురం పర్యటన సందర్భంగా ఏర్పడిన ప్రోటోకాల్ వివాదంతో బాలినేని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. హెలీప్యాడ్ వరకు మంత్రి కారులో వెళ్లితే తనను నడిపించారని ఆయన గుర్రుగా ఉన్నారు.ఈ విషయంలో సీఎం జగన్ స్వయంగా పిలిపించి మాట్లాడినా బాలినేని సంతృప్తి చెందలేదు. సురేష్ ఎలా గెలుస్తారో చూస్తారన్న రేంజ్ లో బాలినేని మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు.

జగన్ ను తప్పితే ఎవ్వరినీ లెక్కచేయని తత్వం బాలినేనికి ఉంది. ఒంగోలు తన అడ్డా అని ఆయన నిత్యం చెప్పకనే చెబుతుంటారు. పైగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం మితిమీరిపోయిందని వాసు చాలా రోజులుగా మథనపడుతున్నారు. ఆ విషయంలో కక్కలేని మింగలేని పరిస్థితి ఉంది.దానితో పార్టీ మారడమే కరెక్టన్న అభిప్రాయానికి వాసు వచ్చేశారని చెబుతున్నారు. ఇక ముహుర్తం పెట్టడమొక్కటే మిగిలిందని బాలినేని అనుచరులు చెబుతున్నారు. పైగా జిల్లాలోని బీసీ వర్గాల్లో కూడా బాలినేనికి మంచి పట్టుంది. ఆయన మారితే వాళ్లు కూడా మారతారు. బాలినేని చేరితే ప్రకాశం జిల్లాలో టీడీపీకి పూర్తి అడ్వాంటేజ్ రావడం ఖాయం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..