వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక నిన్నటి అధికార పార్టీలో ఉండి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చాశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్నటి దాకా ఒక జిల్లానే శాసించిన బాలినేనికి ఇప్పుడు రాజకీయాల్లో చేతులు కట్టుకుని కూర్చోవడం చేతగానిపనిగా తయారైంది. దానితో రూటు మార్చి స్పీడ్ పెంచాలని ఆయన అనుకుంటున్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు…
బాలినేని కదలికలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి ముఖ్యమంత్రి అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన అభినందించలేదు. జనసేనాని పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం హర్షణీయం. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ కేసులు, భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులకు మీరు స్పందించాలి’ ధన్యవాదాలు అంటూ బాలినేని చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేకుండా.. పవన్ కు విజ్ఞప్తి చేయడంతో.. బాలినేని ఏదో ఆశించే ఎక్స్ లో పోస్టు పెట్టారని వైసీపీ వాళ్లు కూడా చర్చించుకుంటున్నారు. నిజానికి కొంతకాలంగా వైసీపీలో బాలినేని ఉక్కపోతను ఎదుర్కొన్న మాట వాస్తవం. చివరకు ఓటమితో దాదాపుగా బాలినేని ఖేల్ ఖతం అయ్యిందనే అనుకోవాలి. ఇప్పుడు మళ్లీ రాజకీయ పునరుజ్జీవనం పొందేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అందుకే జనసేన వైపు చూస్తున్నారని అనుకుంటున్నారు.
బాలినేని మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆ పార్టీలో చేరే అవకాశాలు తక్కువ. జనసేనలో చేరితే రాజకీయాల్లో నిలదొక్కుకునే వీలుంటుందని బాలినేని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే గత రెండున్నరేళ్లుగా ఆయన చేసిన యాగీ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా కాలం గుర్తుండిపోతుంది…
ఆయన ఒకప్పుడు జగన్ కు వీర విధేయుడు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేసిన ఆయన వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని అలిగారు. పైగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనను కొనసాగించకుండా ఆదిమూలపు సురేష్ కు కేబినెట్లో చోటు పదిలం చేయడం కూడా బాలినేనికి నచ్చలేదు. దీనిపై ఆయన చాలా కాలం పోరాడారు. ఒంగోలు ఎంపీగా మా గుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించాలని చివరి వరకు బాలినేని ప్రయత్నించారు. జగన్ అందుకు ఒప్పుకోలేదు. ఎక్కడైనా బావా అను కానీ వంగ తోట కాడ కుదరదన్నట్లుగా జగన్ తేల్చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ బాలినేనిని మనస్థాపానికి గురిచేసాయి. పైగా ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాను చెప్పినదే వేదమైతే.. వైసీపీ పాలన చివరినాళ్లలో తనను పట్టించుకున్న వారే లేరని బాలినేని ఆవేదన చెందారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడంతో బాలినేని పునరాలోచనలో పడ్డారు. ఏదో విధంగా వైసీపీని వదిలించుకుని కొత్త పార్టీలోకి జంప్ చేయాలనుకుంటున్న తరుణంలో బాలినేనికి జనసేన వరప్రసాదంలా కనిపిస్తోంది…..
పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీగా జనసేన రికార్డును సొంతం చేసుకుంది. ఆ పార్టీకి ఇప్పుడిప్పుడే కేడర్ బలం పెరుగుతోంది. క్షేత్రస్థాయి నాయకత్వం క్రియాశీలంగా పనిచేస్తోంది. పవన్ కల్యాణ్ కోసం ప్రాణమిచ్చే నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బాలినేని లాంటి పాత కాపులను చేర్చుకుంటారా అన్నది అనుమానమే. చూడాలి మరి ఏమవుతుందో…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…