బాలినేని అలక.. సారీ నవ్వు మొహం పెట్టుకోలేను

By KTV Telugu On 3 May, 2023
image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ అవుతున్నారు. మంత్రి పదవి పోయినప్పటి నుంచి తరచూ అలుగుతూ ఆయన వార్తల్లో నేతగు ఉంటున్నారు. అదీ నేరుగా సీఎం జగన్ పై అలగడంతో వైసీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారు. ఆ పదవిలో కొనసాగేందుకు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని మూడ్రోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే సీఎం జగన్ నుంచి నేరుగా పిలుపు రావడంతో ఆయన మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయన పార్టీ వ్యతిరేకులతో తిరుగుతున్నారని బాలినేనిపై ఫిర్యాదులు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు బాలినేని గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. దానిపై చర్చించేందుకే తాడేపల్లి పిలిచారని భావించినా లోపల తంతు మాత్రం వేరుగా ఉంది.

తాజాగా సీఎం జగన్ బాలినేని భేటీ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ తో బాలినేని సమావేశం అయ్యారు మీడియా కంటపడకుండా క్యాంపు కార్యాలయానికి రెండో వైపు నుంచి వెళ్ళారు. జగన్ తో భేటీ తర్వాత బాలినేని నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. స్థానికంగా తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారని తెలుస్తోంది. నియోజకవర్గానికే పరిమితం అవుతానని చెప్పారట. బాలినేని ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో ప్రోటోకాల్ సమస్య వస్తుందని చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పెత్తనం పెరిగిపోతోందని బాలినేని వాపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తనను మంత్రిగా తీసేసినా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను కొనసాగించడంపై బాలినేని చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు తనను కనీసం మాజీ మంత్రిగా కూడా గుర్తించడం లేదని ఆయన వాపోయారు. సురేష్ కారులో వెళ్తుంటే తాను నడిచి వెళ్లాల్సి వస్తోందని చెప్పుకున్నారు. దానితో ప్రోటోకాల్ సమస్య రాకుండా చూస్తానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిపాలనా అంశాల్లో సుబ్బారెడ్డి జోక్యాన్ని బాలినేని ప్రస్తావించారు. ఒంగోలు డీఎస్పీ నియామకాన్ని కూడా ఆయన జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తాను సూచించిన హరినాథ్ రెడ్డిని కాదని సుబ్బారెడ్డి సూచించిన అశోక్ వర్థన్ ను డీఎస్పీగా నియమించడం పట్ల ఆయన అభ్యంతరం చెప్పారు. అయితే అందులో సుబ్బారెడ్డి ప్రమేయం లేదని సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పైగా గతంలో విజిలెన్స్ పోస్టింగ్ కోసం అశోక్ వర్థన్ పేరును బాలినేని సిఫార్సు చేసినందునే ఆయనకు అభ్యంతరం ఉండదని భావించి నియమించారని ధనుంజయ్ రెడ్డి చెప్పారట. దానితో వెంటనే బాలినేని కోరిన వారిని ఒంగోలు డీఎస్పీగా నియమించాలని జగన్ ఆదేశించారట డీఎస్పీ వ్యవహారం చక్కబడినట్లే కనిపించినా సమన్వయకర్త పదవిని తిరిగి తీసుకునేందుకు బాలినేని అంగీకరించలేదని చెబుతున్నారు. ఎందుకంటే ప్రకాశం రాజకీయాల్లో సుబ్బారెడ్డి జోక్యం లేకుండా చూసుకుంటానని జగన్ చెప్పలేదు. ఆ దిశగా ఎలాంటి ఆ పని చేయడానికి జగన్ కు చాలా చిక్కులే ఉన్నాయి

బయటకు వెళ్లినప్పుడు నవ్వు మొహం పెట్టుకుని మీడియాతో మాట్లాడాలని జగన్ సూచించినా బాలినేని స్పందించలేకపోయారు. సుబ్బారెడ్డిని నిలువరించలేకపోయానన్న బాధ ఆయనలో ఉంది. దానితో మీడియా కంట పడకుండా బాలినేని వెళ్లిపోయారు. సీఎం హామీతో బాలినేని అలక వీడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ దిశగా సంకేతాలు మాత్రం అందడం లేదు ఏది నిజమో చూడాలి.