ఉత్తరాంధ్రలో సముద్రం ఒడ్డున ఉండే భీమిలీ నియోజకవర్గంలో రాజకీయం ఆటుపోట్లుగా సాగుతూనే ఉంది. కాపులకు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి గెలిచారు. కొన్నాళ్లు మంత్రిగా కూడా చేశారు. కానీ తర్వాత పదవి నుంచి తొలగించారు. అప్పట్నుంచి ఆయనను పట్టించుకునేవారు లేరు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ కూడా డౌటేనన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు టీడీపీ తరపున మళ్లీ గంటా శ్రీనివాస్ పోటీ చేయవచ్చని చెబుతున్నారు. జనసేన పార్టీ కూడా పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తంది. గతంలో పీఆర్పీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచింది.
వైసీపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన విశాఖ జిల్లాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. పరిపాలన రాజధానిగా విశాఖను చేసి తన అడ్డాగా మార్చుకోవాలని అనుకుంటున్న వైసీపీకి ఇక్కడి రాజకీయాలు అంతుచిక్కడం లేదు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ ఆధిపత్యం చెలాయించగా.. పక్కనే ఉన్న భీమిలి, గాజువాకల్లో వైసీపీ విజయదుందుబి మోగించింది. ఐతే ఈ సారి భీమిలిలో ఆ జోరు బాగా తగ్గినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి అనూహ్య విజయం సాధించారు. అంతేకాదు జగన్ క్యాబినెట్లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి విశాఖ నగరంలో కీలక నేతగా మారారు. కానీ, సొంత నియోజకవర్గంలో రాజకీయాన్ని చక్కదిద్దుకోలేక చేతులెత్తేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం.. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి గంటాతో కలిసి టీడీపీలోకి వెళ్లిపోయారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2019కి వైసీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేశారు విజయం సాధించారు. కానీ ఆయన గ్రాఫ్ మూడేళ్లే ఉంది. తర్వాత మసకబారిపోయింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా పనిచేసిన అవంతి.. వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా.. భీమిలిలో టీడీపీ మెజార్టీ సాధించడంతో హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది.
గ్రేటర్ విశాఖలో భాగమైన భీమిలిలో కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి కనీస బాధ్యత తీసుకోలేదని.. ఇప్పటికీ ఆ వైఫల్యాలను అధిగమించే కృషి చేయడం లేదని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. మళ్లీ అవంతికే సీట్ ఇస్తే ఓటమి తప్పదని అధిష్టానానికి హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయన టిక్కెట్ డొలాయమానంలో పడింది. ఇది కాపులకు బలమైన నియోజకవర్గం కావడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. 2009లో పీఆర్పీ ఇక్కడ విజయం సాధించింది. జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పంచకర్ల సందీప్ పాతిక వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. టీడీపీకి 91 వేల ఓట్లు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించింది. మరోసారి ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన పోటీ చేస్తే…. జనసేన పార్టీ కూడా వెనక్కి తగ్గక తప్పదు.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నెగ్గడానికి ప్రధాన కారణం ఓట్ల చీలికే. కేవలం 9వేల ఓట్ల తేడాతోనే అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈ సారి టీడీపీ, జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సునాయాసంగా విజయం సాధిస్తారు. వైసీపీ తరపున అవంతికే టిక్కెట్ ఇస్తే ఇక తిరుగు ఉండదు. ఆర్థికంగా బలమైన కొత్త అభ్యర్థి కోసం ప్రస్తుతం వైసీపీ అధినేత వెదుకుతున్నారు. ఎలా చూసినా.. భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికి కూటమి బలంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా బలహీనంగా కనిపిస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…