ఆళ్లగడ్డలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో అక్కడ పరాజయం పాలైన భూమా అఖిలప్రియ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అఖిలప్రియకు సీటుంటుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈసారి అఖిలకు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం కష్టమనే ప్రచారం జరుగతోంది. అఖిలప్రియను తప్పించి ఆమె సోదరి మౌనికారెడ్డికి సీటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తరుచుగా వివాదాలతో అఖిలప్రియ పార్టీపై దృష్టిపెట్టడం తగ్గిపోయిందని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాబు, లోకేష్‌లు ఆమె విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. భూమా కుటుంబంతో మొదటి నుంచి రాజకీయాల్లో కలిసి నడిచినవారిని అఖిలని దూరం చేసుకుంటున్నారట. తన సోదరి మౌనికారెడ్డితోనూ అఖిలప్రియకు తీవ్ర విభేదాలున్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే ఆళ్లగడ్డ వచ్చిన మౌనికారెడ్డి తన సోదరిని కనీసం పలకరించలేదని ఇంటికి కూడా వెళ్లలేదని తెలుస్తోంది.
అఖిలప్రియ రాజకీయ ఎదుగుదలకు ఆమె భర్త మద్దూరి భార్గవ్‌రామ్ వ్యవహార శైలి ప్రధాన అడ్డంకిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియ రాజకీయంగా, కుటుంబ పరంగా పూర్తిగా ఒంటరైనట్లు స్థానికంగా వినిపిస్తున్న మాట. అఖిలప్రియను విభేదించి వరుసకు అన్న అయిన భూమా కిశోర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నంద్యాలలో కూడా అఖిలప్రియ తన సోదరుడు బ్రహ్మానందరెడ్డికి అడ్డు తగులుతున్నారు. అన్నకు పోటీగా నంద్యాలలో అఖిలప్రియ వేరు కుంపటి పెట్టడంపై చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగా ఉన్నారట. భూమా నాగిరెడ్డి దంపతుల ఆకస్మిక మరణాలు ఆ కుటుంబ రాజకీయంపై తీవ్ర ప్రభావం చూపాయి. నాగిరెడ్డి, శోభ దంపతుల రాజకీయ వారసురాలిగా అఖిలప్రియ తెరపైకి వచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే వివాదాలు, విభేదాలు ఆమెకు మైనస్‌గా మారాయి.
ఆళ్లగడ్డలో వచ్చే ఎన్నికల్లో మౌనికను టీడీపీ బరిలోకి దింపనుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో మంచు మనోజ్‌ను మౌనికారెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు. మోహన్ బాబు కూడా ఇటీవలి కాలంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. భూమా కుటుంబం టీడీపీతోనే ఉంది అనే సంకేతాలను పంపించడానికి చంద్రబాబు మౌనికారెడ్డికి సీటిచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆమె రాక అక్క అఖిలప్రియకు ఎంత మాత్రం ఇష్టం లేదట. మనోజ్‌ను పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో తనకు కొండంత బలం వస్తుందని మౌనికారెడ్డి భావిస్తున్నారట. ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులతో ఆమె ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టారని అఖిలప్రియతో వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు మౌనికతో టచ్‌లోకి వెళుతున్నారని సమాచారం. మౌనికతో పాటు మనోజ్‌కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. చిత్తూరు జిల్లాల నుంచి పోటీచేస్తానని గతంలో ఒకసారి ప్రకటించారు. మరి చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చే విషయంలో ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి.