ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఆయన విడుదల అయ్యారు. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవలసి ఉందన్న బాబు తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆరోగ్య కారణాలతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చిన ఏపీ హై కోర్టు నవంబరు 28 సాయంత్రానికల్లా చంద్రబాబు నాయుడు తిరిగి పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై చంద్రబాబు నాయుణ్ని ఏపీ సిఐడీ పోలీసులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టుముందు హాజరు పర్చారు. చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తన కేసును పూర్తిగా కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాంతో పాటే మధ్యంతర బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
జైల్లో చంద్రబాబు నాయుడికి సరియైన భద్రత లేదని ఆయన ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో రక రకాల నేరాలు చేసిన కరడు గట్టిన నేరస్థులు ఉన్నారని వారి నుండి ఆయన ప్రాణాలకు ప్రమాదమే అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ములాఖత్ లో చంద్రబాబు నాయుణ్ని కలుస్తూ ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్ తో పాటు నారా బ్రాహ్మణి కూడా చంద్రబాబు ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి జైలుకు వెళ్లక ముందు నుంచే స్కిన్ అలర్జీ ఉంది. దానికి జైల్లోనూ మందులు వాడుతున్నారు. అయితే ఆయన చల్లటి వాతావరణంలో ఉండాలని వైద్యులు సూచించడంతో కోర్టు అనుమతితో ఆయనకు ఏసీ ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నాయుడికి స్టెరాయిడ్స్ ఇచ్చి జైల్లోనే అంతమొందించే కుట్ర జరుగుతోందని లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త అయిదు కిలోల బరువు తగ్గిపోయారని.. జైల్లో నీరు కలుషితంగా ఉందని..ఆయనకు సరియైన మౌలిక సదుపాయాలు కూడా లేవని భువనేశ్వరి ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయుడు జైల్లోకి వచ్చినపుడు 66 కిలోల బరువు ఉంటే జైల్లోకి వచ్చిన తర్వాత ఒక కిలో పెరిగారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇక స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జైల్లో వామ పక్ష తీవ్రవాదులు ఉన్నారని వారు తనని అంతమొందిస్తామని బెదిరింపు లేఖ రాసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాబు ఏసీబీ కోర్టుకు లేఖ రాశారు. అయితే బాబు చెప్పిన లేఖ ఫేక్ అని తేల్చారు.
ఒక పక్క బెయిల్ రాకపోవడం..మరో పక్క నారా కుటుంబ సభ్యులు చెప్పిన ఆరోగ్య సమస్యలు వర్కవుట్ కాకపోవడంతో చంద్రబాబు నాయుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలని అందుకోసం ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నాలుగు వారాల పాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. లక్షల రూపాయలతో ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు, చంద్రబాబు తనకు నచ్చిన ఆసుపత్రిలో కంటికి ఆపరేషన్ చేయించుకోవచ్చునని పేర్కొన్నారు.
మధ్యంతర బెయిల్ సమయంలో చంద్రబాబు నాయుడు కేసు గురించి మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సిఐడీ పిటిషన్ వేసింది. దానికి స్పందించిన న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు కేసు విచారణ పూర్తి అయ్యే వరకు కేసు గురించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదని.. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించ రాదని ఆదేశించారు. మొత్తానికి 52 రోజుల తర్వాత జైలు గోడలు దాటి బయలకు వచ్చిన చంద్రబాబు నాయుడు రిలీఫ్ గా కనిపించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…