ఆంధ్రాలో బీఆర్ఎస్ ఎంట్రీకి బీజేపీ సాయం

By KTV Telugu On 14 April, 2023
image

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి ఎంట్రీకి బీజేపీ సాయం చేస్తోంది. రెండు పార్టీలు భీకరంగా పోరాడుకున్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఇది ఏపీలో గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. స్టీల్ ఫ్యాక్టరీ బిడ్ విషయంలో ప్రారంభమైన హడావుడి బీఆర్ఎస్ విజయోత్సవాలు నిర్వహిస్తామన్న ప్రకటనతో ముగిసింది తర్వాత మళ్లీ కేంద్ర మంత్రి మాట తిప్పేసినా బీఆర్ఎస్‌కు మాత్రం బేస్ దొరికింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టాలనుకుంటున్న భారత్ రాష్ట్ర సమితి విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం ద్వారా బీజేపీ ఓ రోడ్ మ్యాప్ ను ఇచ్చినట్లయింది. ఇలా స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయడం అలా కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటించడం ఆ పార్టీకి ఊహించని విధంగా ఉపయోగపడింది. ఇలాంటి చాన్స్ దొరికితే చాలు ఎలా అల్లుకుపోవాలో బీఆర్ఎస్ నేతలకు బాగా తెలుసు. అందుకే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి అలా ప్రకటన చేయగానే ఇలా బీఆర్ఎస్ నేతలు విజయోత్సవాల గురించి మాట్లాడుతున్నారు.

టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఆలోచనలకు పదును పెట్టారు మహారాష్ట్రలో రెండు సభలు పెట్టారు. ఆయన పెట్టాలనుకుంటే ఒడిషా కర్ణాటకల్లో ఇట్టే సభలు పెట్టేస్తారు. చాలా సులువుగా ఇతర రాష్ట్రాల్లో అలా వెళ్లి పార్టీని విస్తరించుకోవచ్చు. కానీ ఏపీలో మాత్రం అది సాధ్యం కాదు ఎందుకంటే ఉమ్మడి ఏపీ విభజనకు కారణం బీఆర్ఎస్. విభజన సమయంలో ఉద్యమం సమయంలో ఏపీ విషయంలో చాలా వ్యతిరేక ప్రకటలను బీఆర్ఎస్ నాయకత్వం చేసింది. ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేలా చేసి తాము కూడా ఏపీ అభివృద్ధికి ప్రయత్నిస్తామని నమ్మించగలగాలి. అందుకే ఇటీవలి కాలంలో ఏపీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చాలా సానుకూలంగా మాట్లాడుతున్నారు. రెండు రాష్ట్రాల మద్య పరిష్కరించాల్సిన చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి పెద్దగా చర్చకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాము ఏపీ శ్రేయోభిలాషులమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఆ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ద్వారా కల్పించింది.

మహారాష్ట్రలో కేసీఆర్ రెండు సభలు పెట్టారు. అక్కడ స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. అలా నేరుగా ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితుల్ని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నేరుగా బీఆర్ఎస్ ఏపీలో సభలు పెట్టలేదు. కేసీఆర్ కేటీఆర్ వంటి అగ్రనేతలు పర్యటించలేదు. శుభకార్యాలు ఇతర కార్యక్రమాలకు వచ్చి ఉంటారు కానీ రాజకీయ కార్యక్రమాలకు రాలేదు. తెలంగాణలో ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలు ఏపీలోకి రావడాన్ని ఆ ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తాయి. ప్రతిఘటన కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని కేసీఆర్ ఏపీలో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అందు కోసం ముందుగా ఓ ప్రయత్నం జరగాలి. అలాంటి ప్రయత్నం స్టీల్ ప్లాంట్ వల్ల జరిగింది. అది అనూహ్యమైన సక్సెస్ అయింది. ఇప్పుడు ఏపీ కోసం బీఆర్ఎస్ ఎలా పని చేస్తుందో వారు వివరించగలిగారు. ఇప్పుడు ఏపీ ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లగమని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.

బీఆర్ఎస్‌లో ఏపీ నుంచి చేరికలు కూడా గొప్పగా లేవు. కొంత మందితో చర్చలు జరిపినా ఇంకా సానుకూల వాతావరణం ఏర్పడలేదు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ గా తోట చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన మూడు ప్రధాన పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. పెద్దగా ఫాలోయింగ్ ఉన్న నేత కాదు. గొప్ప వాగ్దాటి కూడా లేదు కానీ పార్టీకి ఓ నేత అంటూ వచ్చారు. ఇప్పుడు బలమైన నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేయాలి. స్టీల్ ప్లాంట్ కోసం తాము చేసిందే పోరాటం ఏపీ రాజకీయ పార్టీలకు నోరు లేదని నిరూపించేలా ఇదే బేస్‌గా చేరికలు పెరిగే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ కూడా బీఆర్ఎస్ పై ఆసక్తితో ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. ఆయన కూడా చేరితే బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్న సామాజికవర్గం ఓట్లతో గట్టి పునాది వేసుకోవాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్న ఓ అభిప్రాయాన్ని ఇతర పార్టీలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ సహకారం ఏపీకి కూడా పాకిందేమో అన్నట్లుగా ప్రస్తుత రాజకీయం నడుస్తోంది. ఏపీ బీఆర్ఎస్ బలపడితే బీజేపీకేంటి లాభం అనే సందేహం ఎక్కువ మందికి రావొచ్చు అక్కడ రాజకీయాలు పరస్పర ప్రయోజనాల మీద ఆధారపడి ఉన్నాయి వారే గెలవాల్సిన అవసరం లేదు. రహస్య మిత్రుల్ని గెలిపించినా పర్వాలేదన్న వ్యూహం అందులో ఇమిడి ఉండవచ్చు.