పవన్‌కళ్యాణ్ సిన్మా రిలీజ్ అయితే తానే నటించానన్నంత బిల్డప్పిచ్చారు ఒకప్పుడు ఏపీ బీజేపీ ఇంచార్జి. పవర్‌స్టార్ బ్రాండ్ ఉంటే చాలు రాజకీయాల్ని షేక్ చేస్తామని పట్టపగలు కలలు కనేశారు. కానీ పవన్‌కళ్యాణ్ వచ్చి మోడీతో కాసేపు మీటింగ్ వేసినంత మాత్రాన బంధం బలంగా ఉన్నట్లు కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో బీజేపీకి తత్వం బోధపడినట్లే ఉంది. జనసేనను నమ్ముకుంటే నట్టేట మునుగుతామని కమలనాథులకు అర్ధమైంది. అందుకే ఏ ఊతకర్రా లేకుండానే మా కాళ్లమీద మేం నిలబడతామన్న సంకేతాలిస్తున్నారు.
బీజేపీతో పవన్‌కళ్యాణ్ బంధం తెంచేసుకోలేదు కానీ టీడీపీకి దగ్గరవుతున్నారు. బీజేపీకేమో టీడీపీతో అంటకాగడం ఇష్టంలేదు. దీంతో ఈ ట్రయాంగిల్ లవ్ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్న టైంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ వద్దనుకుంటున్న టీడీపీ మూడుకు మూడు సీట్లూ గెలుచుకుంది. తెలుగుదేశం అనూహ్య విజయం సాధిస్తే బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న కమలం పార్టీ జనసేనను నిందిస్తోంది. జనసేన మనస్ఫూర్తిగా సహకరించి ఉంటే కథ వేరేలా ఉండేదనుకుంటోంది.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీకి మద్దతిచ్చాయి ఇది ఓపెన్ సీక్రెట్. పవన్‌కళ్యాణ్ చెప్పారా మరో ముఖ్యనేత చెప్పారా అన్నది కాదు క్షేత్రస్థాయిలో పవన్‌పార్టీ కార్యకర్తలు అలా ఫిక్స్ అయిపోయారంతే. ఏపీలో బలపడాలనుకుంటున్న టైంలో డిపాజిట్లు కూడా దక్కకపోవటంతో బీజేపీ పరువుపోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన మాధవ్ బహిరంగంగానే జనసేనను తప్పుపట్టారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన మాధవ్ ఇంత ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. అందుకే జనసేనతో తమ పార్టీకి పొత్తుందో లేదో తెలీదన్నట్లు మాట్లాడారు.
జనసేన ప్రచారంలో తిరగాల్సిన పన్లేదు పోలింగ్‌రోజు నిలబడాల్సిన పన్లేదు. అయితే తమ అభ్యర్థిని గెలిపించమని జనసేన పెద్దలనుంచి ఒక్క ప్రకటన కూడా లేకపోవటం బీజేపీకి మింగుడుపడటంలేదు. కలిసి నడవకపోతే పొత్తుందని ప్రజలకు ఎలా అర్ధమవుతుందన్నది మాధవ్ ప్రశ్న. అసలే అసెంబ్లీలో ప్రాతినిధ్యంలేని బీజేపీకి మండలిలోనూ ఛాన్స్ లేకుండాపోవటంతో భవిష్యత్‌పై బెంగపట్టుకుంది. పవన్‌కళ్యాణ్ లాంటి నాయకుడ్ని నమ్ముకుంటే పూర్తిగా మునుగుతామన్న విషయం అర్ధమైంది. మరోవైపు వైసీపీతో ఉన్నారన్న ప్రచారం కూడా బీజేపీని ముంచింది. అందుకే జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లేనన్నట్లు మాట్లాడుతున్నారు.
బీజేపీ కలిసొస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదన్నది జనసేన వాదన. ఎన్నిసార్లు తమ అధినేత రూట్‌మ్యాప్ అడిగినా బీజేపీ నాయకత్వం స్పందించలేదని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. కిరణ్ రాయల్ లాంటి నాయకుడైతే తమ పొత్తు రాష్ట్ర బీజేపీతో కాదని కేంద్ర నాయకత్వంతోనంటూ కొత్త వెర్షన్ వినిపిస్తున్నారు. కేంద్ర పెద్దల మాట కాదనలేక జనసేనతో సర్దుకుపోతున్నారేగానీ ఏపీ బీజేపీ నేతలకు పవన్‌కళ్యాణ్‌తో పొత్తు అస్సలు ఇష్టంలేనట్లే కనిపిస్తోంది. బలవంతపు సంసారం ఎన్నాళ్లో కుదరదని పార్టీ పెద్దలకు కూడా ఈదెబ్బతో అర్ధమయ్యేలా ఉంది.