జనసేన మాతో క‌లిసే ఉంటుద‌ని బిజెపి ప‌దే ప‌దే ఎందుకు చెబుతోంది

By KTV Telugu On 7 March, 2023
image

జ‌న‌సేన ముమ్మాటికీ బిజెపితోనే అనుబంధాన్ని కొన‌సాగిస్తుంద‌ని ఏపీ బిజెపి నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బిజెపితో జ‌న‌సేన తెగ‌తెంపులు చేసుకుంటుంద‌ని కొంద‌రు ఆశిస్తున్నార‌ని కానీ వారి ఆశ‌లు నెర‌వేరే ప‌రిస్థితులు ఉండ‌నే ఉండ‌వ‌ని బిజెపి నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌ల చేసి ఉంటారా అని రాజ‌కీయ పండితులు ఆరాలు తీస్తున్నారు.

ఆంధ్రప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తాపార్టీ జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ఉన్న పొత్తు క‌ల కాలం కొన‌సాగుతుంద‌ని బిజెపి అంటోంది. పార్టీ సీనియ‌ర్ నేత ఎంపీ జి.వి.ఎల్. న‌ర‌సింహారావు తాజాగా బిజెపి జ‌న‌సేన‌ల మైత్రి గురించి వ్యాఖ్య‌లు చేశారు. చాలా కాలంగా జ‌న‌సేన త‌మ‌తోనే ఉంద‌ని మును ముందు కూడా తమ పార్టీలు రెండూ క‌లిసే ఉంటాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి జ‌న‌సేన‌లు క‌లిసే పోటీ చేస్తాయ‌ని జి.వి.ఎల్. పున‌రుద్ఘాటించారు. మ‌రో బిజెపి నేత విష్ణు వ‌ర్ధ‌న రెడ్డి కూడా జ‌న‌సేన‌ బిజెపిల అనుబంధాన్ని ఎవ‌రూ విడ‌గొట్ట‌లేర‌ని అన్నారు. కొంత మంది ఆశ‌ప‌డుతున్న‌ట్లు జ‌న‌సేన బిజెపితో తెగ‌తెంపులు చేసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని విష్ణు వ‌ర్ధ‌న రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే బిజెపి నేత‌లు ఇపుడు ప్ర‌త్యేకించి జ‌న‌సేన తో త‌మ అనుబంధం గురించి ఎందుకు వ్యాఖ్య‌లు చేయాల్సి వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌లు విన‌ప‌డుతున్నాయి. ఇపుడు ఎవ‌ర‌డిగార‌ని బిజెపి నేత‌లు జ‌న‌సేన త‌మ‌తోనే ఉంటుంద‌ని అన్నారో అర్ధం కావ‌డం లేదంటున్నారు.

ప్ర‌త్యేకించి విష్ణువ‌ర్ఢ‌న రెడ్డి చేసిన వ్యాఖ్య‌లే ప్రాధాన్య‌త సంతించుకున్నాయి. జ‌న‌సేన బిజెపితో తెగ‌తెంపులు చేసుకుంటుంద‌ని ఎవ‌ర‌న్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు నిల‌దీస్తున్నారు. బ‌హుశా టిడిపి నేత‌ల‌ను దృష్టిలో పెట్టుకునే బిజెపి నేత‌లు ఇటువంటి క్లారిటీ ఇచ్చి ఉండ‌చ్చ‌ని భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటును చీల్చ‌నిచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటున్నారు. ఆ క్ర‌మంలో భాగంగానే విప‌క్షాల‌న్నీ ఒక్క‌తాటిపైకి రావాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు. అటు చంద్ర‌బాబు నాయుడు కూడా జ‌న‌సేన తో పొత్తు కోసం వెంప‌ర్లాడుతున్నారు. టిడిపి బిజెపిల‌తో క‌లిసి 2014 త‌ర‌హాలో ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్నారు. అయితే బిజెపి నాయ‌క‌త్వం మాత్రం చంద్ర‌బాబు నాయుడితో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి పారేసింది. చంద్ర‌బాబు నాయుడితో అంట‌కాగ‌డం అంత మంచిది కాద‌ని సాక్ష్యాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీయే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. బిజెపి త‌మ ప‌ట్ల మ‌రీ అంత వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని ఊహించ‌ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానితో ప‌వ‌న్ భేటీ త‌ర్వాత డీలా ప‌డ్డారు.

ఇక అప్ప‌ట్నుంచీ టిడిపి అనుకూల మీడియా టిడిపి జ‌న‌సేన పొత్తు గురించి రోజూ హైలెట్ చేయ‌డం మొద‌లు పెట్టింది. అదే స‌మ‌యంలో బిజెపి నేత‌లు టిడిపితో పొత్తు ఉండ‌ద‌ని ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు చేయ‌డంతో టిడిపి క‌న్నా ఎక్కువ‌గా వారి అనుకూల మీడియా బెంగ‌పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యానికైనా బిజెపి టిడిపితో పొత్తుకు ఒప్పుకోవ‌చ్చున‌ని టిడిపి ఆశ‌ప‌డుతూ వ‌చ్చింది. అయితే బిజెపి నేత‌ల వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తూ ఉంటే బిజెపితో పొత్తు సాధ్యం కాక‌పోవ‌చ్చున‌ని క్లారిటీ వ‌చ్చిన‌ట్లుంది. క‌నీసం జ‌న‌సేన‌తో అయినా పొత్తు పెట్టుకోక‌పోతే ఎన్నిక‌ల ఏరు దాట‌లేమ‌న్న ఆందోళ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన త‌మ‌కి దూరం కాకుండా చూసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే అవ‌స‌రమైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజెపికి గుడ్ బై చెప్పి టిడిపితో పొత్తు పెట్టుకుంటార‌ని టిడిపి నేత‌లు ప్ర‌చారం చేయిస్తున్నారు.వారి అనుకూల మీడియా కూడా ఆకోణంలోనే క‌థలు వండి వారుస్తోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకునే బిజెపి నేత‌లు ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇచ్చేందుకే ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు రాజ‌కీయ పండితులు అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబుతో భేటీ అయిన వ‌ప‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. ఈ సైలెన్స్ టిడిపి నేత‌ల‌ను వ‌ణికిస్తోంది. ప‌వ‌న్ ఏమ‌న్నా మ‌న‌సు మార్చుకుంటారేమో బిజెపితోనే కొన‌సాగి త‌మ‌కి చెయ్యిస్తారేమోన‌ని టిడిపి నాయ‌క‌త్వం క‌ల‌వ‌ర ప‌డుతోంది. స‌రిగ్గా ఈ త‌రుణంలోనే విశాఖ న‌గ‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. దీనికి దేశంలోని టాప్ బ్రాండ్ కంపెనీల అధినేత‌ల‌తో పాటు 46 దేశాల నుండి పారిశ్రామిక వేత్త‌లు త‌ర‌లి రావ‌డంతో స‌మ్మిట్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ స‌మ్మిట్ గురించి టిడిపి ఎప్ప‌ట్లాగే రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేసింది. ఇదంతా ఉత్తుత్తి షో అంటూ వ్యాఖ్యానాలు చేసింది.  నిజానికి స‌మ్మిట్లో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో కేంద్ర ప్ర‌భుత్వం రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే టిడిపి వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.

స‌మ్మిట్ గురించి ప‌వ‌న్ కూడా విమ‌ర్శ‌లు చేస్తే బాగుండున‌ని టిడిపి అనుకుంది. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించారు. స‌మ్మిట్ స‌మ‌యంలో రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఇది టిడిపికి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అలాగ‌ని ఆ విష‌యాన్ని పైకి అన‌లేని దౌర్బ‌ల్యం. ఏం చేయాలో పాలుపోక నోళ్లు మూసుకుని ఉండిపోయారు. స‌మ్మిట్ ముగిసిన త‌ర్వాత కూడా ప‌వ‌న్ ట్వీట్ చేశారు. స‌మ్మిట్ విష‌యంలో ఏపీకి పెట్టుబ‌డులు వ‌చ్చే విష‌యంలో ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇది చంద్ర‌బాబు నాయుడి గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డట్లు అయ్యింది. ఆయ‌న మింగ‌లేక క‌క్క‌లేక ఫ్ర‌స్ట్రేష‌న్ లో కూరుకుపోయారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన పూర్తిగా త‌మ కు దూరం జ‌రిగి బిజెపి తోనే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలా అని చంద్ర‌బాబు నాయుడు ద‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. బిజెపి జ‌న‌సేన క‌లిసే ఉంటే ఇక విధిలేని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకోవ‌డం ఒక్క‌టే చంద్ర‌బాబు ముందున్న మార్గం. దానికి కూడా చంద్ర‌బాబు వెన‌కాడ‌క‌పోవ‌చ్చు నంటున్నారు.