బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చివరాఖరి ప్రయత్నానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తమతో పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత వపన్ కళ్యాణ్ తో మూడునాలుగు దఫాలు చర్చలు జరిపిన చంద్రబాబు నాయుడు ఇక బిజెపితో అమీ తుమీ తేల్చుకోడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది బిజెపి అగ్రనేతలను కలిసి వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవలసిందిగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వీలైతే బిజెపి అడిగినన్ని లోక్ సభ స్థానాలను ఉదారంగా ఇవ్వడానికి కూడా చంద్రబాబు మానసికంగా సిద్ధపడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ బిజెపి నాయకత్వం పొత్తుకు సై అంటే చంద్రబాబు హుషారుగా ఢిల్లీ నుండి తిరిగి వస్తారు. లేదంటే బిజెపి స్థానంలో కమ్యూనిస్టులకు చోటిస్తారని చర్చ జరుగుతోంది.
ఇంచుమించు రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకోవాలని తహ తహ లాడుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే బిజపి మిత్రపక్షమైన జనసేనతో సంబంధం పెట్టుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో వై.ఎస్.ఆర్.ర్. కాంగ్రెస్ ను గద్దె దించాలంటే భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు తప్పని సరి అని అన్నారు. అందుకే తాను టిడిపితో పొత్తుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అన్నట్లుగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతాయని ప్రకటించారు. అది పెను సంచలనం అయ్యింది. జనసేనతో పాటు బిజెపితోనూ పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే దానికి బిజెని నాయకత్వం సుముఖంగా లేదు.
బిజెపితో నాలుగున్నరేళ్ల క్రితం పొత్తు పెట్టుకున్న జనసేనను ప్రయోగించి బిజెపి అగ్రనేతలతో బేరం పెట్టించారు చంద్రబాబు . టిడిపి-జనసేన-బిజెపిలు కలిసి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ బిజెపి అగ్రనేతలకు చెప్పినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అదే చెప్పారట పవన్. అయితే చంద్రబాబు నాయుడితో అంటకాగడం అంత తెలివైన పని కాదని మోదీ ..వపన్ కు సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మోదీ-పవన్ లు ఇద్దరే భేటీ అయిన సమావేశంలో ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. చెబితే మోదీ అయినా చెప్పాలి లేదంటే పవన్ అయినా చెప్పాలి. ఆ తర్వాత కూడా పవన్ చాలా సార్లు బిజెపి కేంద్రమంత్రులతో పాటు పార్టీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై ఏపీలో పొత్తుల గురించి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది.
జనసేనతో ఒక వైపు ప్రయత్నాలు చేయిస్తూనే…మరో వైపు ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న తన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి చేత …బిజెపిలో ఉన్న టిడిపి ఎంపీల చేత కూడా చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని బిజెపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ ఊహాగానాలే. వాటిలో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలీదు. ఎన్నికలకు ఇక వందరోజుల సమయం కూడా లేదు. అందుకే ఇపుడు చంద్రబాబు నాయుడు బిజెపి విషయం తేల్చుకోవాలని కంగారు పడుతున్నారు.
టిడిపి-జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి తెచ్చుకున్న చంద్రబాబు బిజెపి హైకమాండ్ తో చివరి ప్రయత్నం చేయాలని భావిస్తున్నారట. అందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. బిజెపి అగ్రనేతలతో భేటీలో బిజెపి లోక్ సభ స్థానాల విషయంలో పట్టుబడితే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి 400 స్థానాలు గెలుచుకుని హ్యాట్రిక్ విజయం కొడుతుందని పార్లమెంటులో ప్రధాని మోదీ అన్న సంగతి తెలిసిందే. ఆ 400 సీట్లలో కొన్ని ఏపీ నుంచి కూడా వస్తాయా అన్నది ప్రశ్న. ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదు. టిడిపితో పొత్తు పెట్టుకున్నా విజయం అంత తేలిక కాదు.
ఈనేపథ్యంలోనే చివరి అస్త్రంగా చంద్రబాబు ఢిల్లీవెళ్తున్నారు. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల వద్ద టిడిపితో పొత్తు అంశంపై చర్చిస్తారని అంటున్నారు. బిజెపి పొత్తుకు ఒప్పుకుంటే ఏడు నుండి ఎనిమిది లోక్ సభ స్థానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండచ్చంటున్నారు. బిజెపి ససేమిరా అంటే కమ్యూనిస్టు పార్టీలను తమతో తీసుకుపోవాలని చంద్రబాబు ప్లాన్ బీ కూడా సిద్దం చేసుకున్నారని అంటున్నారు. హస్తిన లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏపీకి చాలా కీలకం కానున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…