కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు తన కెరీర్ లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడి మంత్రి వర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలు జనసేన, బిజెపిలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. టిడిపి వర్గాల సమాచారం ప్రకారం 21 ఎమ్మెల్యే స్థానాలున్న జనసేనకు నాలుగు మంత్రి పదవులు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపికి రెండు మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. వీటికోసం ఆయా పార్టీల్లో పోటీ మొదలైందని సమాచారం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షంగా బిజెపికి రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇక కూటమి ఏర్పాటులో సూత్రధారిగా పాత్రధారిగా కీలక పాత్ర పోషించిన జనసేనకు మంత్రి వర్గంలో అత్యధిక ప్రాధాన్యత దక్కనుందని అంటున్నారు. దీంతో జనసేనలో మంత్రి పదవిపై కన్నేసిన వారు తమ తమ దారుల్లోప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జనసేనకు దక్కే నాలుగు మంత్రి పదవుల్లో ఒకటి పవన్ కల్యాణ్ కు మరోటి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు దక్కుతాయి. మిగతా రెండు పదవులకోసం పోటీ తప్పదు.
జనసేన తరపున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారిలో సీనియర్లు ఉన్నారు. అవని గడ్డ నుండి గెలిచిన మండలి బుద్ధ ప్రసాద్, అనకాపల్లి నుండి గెలిచిన కొణతాల రామకృష్ణ, కైకలూరు నుండి గెలిచిన కామినేని వెంకటేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నుండి గెలిచిన సుజనా చౌదరి , భీమవరం నుండి గెలిచిన పులిపర్తి ఆంజనేయులు వంటి వారు ఉన్నారు. సీనియారిటీతో పాటు సామాజిక సమతుల్యత కూడా కీలకం కానుంది. ఆ విధంగా చూస్తే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా మంత్రి పదవి ఆశించే అవకాశాలున్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది జనసేన నాయకత్వానికి కత్తిమీద సామే.
2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినపుడు బిజెపి కి రెండు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండ మాణిక్యాలరావు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని వెంకటేశ్వరరావులకు అప్పట్లో పదవులు ఇచ్చారు. ఆ విధంగా కామినేని వెంకటేశ్వరరావు మరోసారి మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడి చేత పవన్ కల్యాణ్ కు చెప్పించుకునే అవకాశాలున్నాయి. మరో వైపు చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అయిన సుజనా చౌదరి కూడా చంద్రబాబు నాయుడి చేతనే పురందేశ్వరికి చెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.
ఉత్తరాంధ్రకు చెందిన పంచకర్ల రమేష్, భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి ఆంజనేయులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిలో పంచకర్లకు పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయంటారు. అందుకే ఆయన చిరంజీవితో పాటు నాగబాబుతో చెప్పించుకుని మంత్రి పదవి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చాలా సీనియర్. ఆయన ఎంపీగా పనిచేయడమే కాకుండా వై.ఎస్.ఆర్. కేబినెట్ లో మంత్రిగానూ వ్యవహరించారు. వివాదరహితుడు, మచ్చలేని నాయకుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. మరి పవన్ ఎటు మొగ్గు చూపుతారో చూడాలి.
21 మందిలో తాను నాదెండ్ల మినహాయిస్తే 19 మందిలో ఇద్దరి పేర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. అది అంత వీజీ కాదు. ఒకరకి ఇస్తే మరొకరికి కోపం వస్తుంది. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పార్టీకి మొదట్నుంచీ నమ్మకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనలో ఎక్కువ మంది వలస నేతలే ఉన్నారు. టిడిపి, వైసీపీ ల నుండి వలస వచ్చి వారే ఎక్కువ. ఈ కసరత్తులో చంద్రబాబు నాయుడి సలహా తీసుకున్న తర్వాతనే పవన్ కల్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…