ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ మీటింగ్‌లో హైలైట్. మొన్నటిదాకా ప్రభుత్వ మూడు రాజధానుల వాదనకు మద్దతిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అమరావతికి అండగా నిలిచారు. బీజేపీ నుంచి పార్టీ జాతీయకార్యదర్శి సత్య ఏపీసీసీ అధ్యక్షుడు కూడా వచ్చి అమరావతికి మద్దతిచ్చారు.
అంతా బాగానే ఉన్నా మందడం దగ్గర బీజేపీ నేత సత్యకుమార్ కారుపై కొందరు దాడికి దిగటంతో మళ్లీ రాజధానిపై మాటల మంటలు రాజుకున్నాయి. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న సత్యకుమార్ కారును కొందరు ధ్వంసంచేశారు. మూడు రాజధానుల వాదనకు అనుకూలంగా ఉన్నవారు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో వైసీపీ ప్రభుత్వంపై సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ గూండాలే దాడికి దిగారని ఆరోపించారు. పోలీసులే కారును ఆపి దాడికి అవకాశమిచ్చారని సత్యకుమార్ ఆరోపించారు.
తమపార్టీ వారెవరూ దాడిచేయలేదన్నది వైసీపీ వెర్షన్. అయితే అమరావతి ఉద్యమ కార్యక్రమంలో జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి ఆయనే టార్గెట్టంటున్నారు. అనుకోకుండా సత్యకుమార్ కారుపై దాడి జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించటంతో ఇది వైసీపీ పనేనంటోంది బీజేపీ. ఆదినారాయణరెడ్డిని హత్యచేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణతో వేడి తగ్గకుండా చూస్తోందా పార్టీ. రాజకీయ వివాదాలు పక్కనపెడితే ఉద్యమస్ఫూర్తి చల్లారకుండా చూసుకుంటున్న అమరావతి రైతులు అభినందనీయులు. ఎన్ని అడ్డంకులొచ్చినా రాజధానికోసం అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు.