మాటలు కోటలు దాటతాయి. బలం గుమ్మం దాటదు…ఇదీ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరు అని చెప్పక తప్పదు. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో బలంగా ఉన్న ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా పాతుకుపోవాలన్న ప్రయత్నంలో ఉంది. అందు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డబుల్ గేమ్ కూడా ఆడుతోంది. ఈ క్రమంలో గోదావరి తీరంలో ఎన్నికల లబ్ధి పొందాలన్న వ్యూహరచన ఆ పార్టీ నేతలు చేస్తున్నారు…
1990ల్లో టీడీపీతో పొత్తుగా ఉన్నప్పుడు బీజేపీకి కొన్ని ఎంపీ సీట్లు కూడా వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నటుడు కృష్ణంరాజు సహా కొందరు నేతలు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. తర్వాత 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. 2019లో బీజేపీ అసలు బలం బయటపడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా మట్టి కరిచారు. ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో.. ఢిల్లీ వర్గాల్లో నోటా సే భీ ఛోటా అని పిలిచేవారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదురుతున్న నేపథ్యంలో ఎలాగైనా కొన్ని సీట్లు గెలిచి పార్టీని ఏపీలో నిలబెట్టుకోవాలన్న తపన కనిపిస్తోంది. అది కూడా ఎమ్మెల్యే సీట్ల కంటే..ఎంపీ సీట్ల విషయంలోనే ఏపీ బీజేపీ కొంత పట్టు బడుతున్నట్లుగా తెలుస్తోంది….
గోదావరి జిల్లాలో బీజేపీ భావజాలం ఉన్న మోతుబర్లు ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపన్న వర్గాలు కావడంతో డబ్బు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడని వర్గం వారిది. దానితో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు లోక్ సభా స్థానాలపై బీజేపీ దృష్టి పడింది. ప్లాన్ సక్రమంగా అమలు చేయగలిగితే…ఒకటైనా గెలుస్తామన్న ధీమా పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు లోక్ సభ స్ధానాలు ఉండగా, బీజేపీ ఏనాడు సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. ఏదో పార్టీతో పొత్తు పెట్టుకునే అభ్యర్థులను రంగంలోకి దించింది. నరసాపురం లోక్ సభ స్దానం నుంచి బీజేపీ పోటీ చేసి గెలిచింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందింది. 1999లో సీని నటుడు కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు లోక్ సభ సభ్యులయ్యారు. ఇక ఏలూరు లోక్ సభ స్ధానంపై బీజేపీకి ఏనాడు పట్టులేదు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీలు ఎవరూ లేనేలేరు. ఒక విధంగా చెప్పాలంటే ఏలూరులో బీజేపీ ఉనికి నామమాత్రమే. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య సుదూర మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
బీజేపీ ఈ సారి సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సిద్ధం అవుతోంది. పొత్తు లేకపోతే, దానికి అనుగుణంగా అభ్యర్ధులను నిలబెట్టడాలని మొదట్లో భావించగా, ఇప్పుడు పొత్తు కుదిరే అవకాశం ఉండడంతో.. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం బీజేపీ నాయకుల దృష్టి అంతా ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్ధానాలపైనే ఉంది. ఎందుకంటే, గత కొంతకాలంగా ఈ రెండుస్ధానాల నుంచి పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్ధులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తు లేకపోతే, నరసాపురం గస్ధానం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగా ఆయన ప్రణాళికులు వేసుకున్నారు. అధిష్టానందృష్టికి తన అభిమతాన్ని తీసుకువెళ్లారు. గతంలో బీజేపీ హైకమాండ్ ఆయన అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగానే స్పందించింది. కానీ ఇప్పుడు పొత్తులు కుదిరే అవకాశం ఉండడంతో.. ఆయన అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందో లేదో తెలియని పరిస్థితి. టీడీపీ, బీజేపీల పొత్తు కుదిరితే,
నరసాపురం పార్లమెంటు స్ధానాన్ని బీజేపీ అడిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇంకో ట్విస్ట్ కూడా ఉండొచ్చు. ప్రస్తుత నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే స్థానిక బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే వారిని బుజ్జగించే బాధ్యతను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరికి అప్పగించనున్నారు. ఇక పొత్తులో భాగంగా ఏలూరు స్ధానం బీజేపీకి కేటాయిస్తే, ఇక్కడ నుంచి పోటీ చేయడానికి తపన చౌదరి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతమూడేళ్లుగా తపన చౌదరి బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పొత్తు ఉంటే ఉమ్మడి జిల్లాలో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ స్ధానాలు కేటాయిస్తారనే ప్రశ్న బీజేపీ వర్గాల్లో తలెత్తింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్ధానాన్ని టీడీపీ అప్పట్లో బీజేపీకి కేటాయించింది. అదే విధంగా ఏలూరు పార్లమెంటు స్ధానంలో కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ ను కూడా బీజేపీకి కేటాయించింది. అటువంటి పరిస్థితుల్లోఈ సారి ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారో అని పార్టీ క్యాడర్ లో టెన్షన్ నెలకొంది.
ఏదేమైనా బీజేపీకి కృష్ణా, గుంటూరు కంటే కూడా గోదావరి జిల్లాలపై ఎక్కువ ఆశలున్నాయి. అదీ రాజులు, కాపుల బలం ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరిపైనే ఆ పార్టీ దృష్టి పెట్టింది. అక్కడ కమలం గుర్తుపై ఒక ఎంపీ స్థానం గెలిచినా చాలని బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. చూడాలి ఎం జరుగుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…