ఏపీలో బిజెపి గుర్తు కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కానీ లేకుండానే మూడు పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 2014లో ఇదే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రంపై చంద్రబాబు-పవన్-మోదీల ఫోటోలు ముద్రించి విడుదల చేశారు. ఈ సారి మోదీ ఫోటో కానీ బిజెపి గుర్తు కానీ వేయవద్దని కమలనాథులే చంద్రబాబు కు అల్టిమేటం జారీ చేశారని హస్తిన వర్గాల భోగట్టా. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ అప్రతిష్ఠ బిజెపిని కూడా వెంటాడింది. అందుకే ఈ సారి బిజెపి కొద్దిగా జాగ్రత్త పడినట్లుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పాటు తాజా సర్వేల్లో కూటమి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో బిజెపి దూరం జరుగుతోందని అనుమానిస్తున్నారు.
కర్నాటకలో కాంగ్రెస్, ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలకు తమ సొంత హామీలు కొన్ని కలిపి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ లు కూర్చుని రూపొందించిన కూటమి మేనిఫెస్టో ను చంద్రబాబు పవన్ కల్యాణ్ లు విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనకు ముందే ఈ సారి మోదీ ఫోటో దానిపై ముద్రించ వద్దని బిజెపి అగ్రనేతలు గట్టిగానే చెప్పారట. అంతే కాదు బిజెపి గుర్తు కూడా వద్దని చెప్పారట. చంద్రబాబు పవన్ పట్టుబట్టినా బిజెపి అగ్రనేతలు ససేమిరా అనడంతో టిడిపి-జనసేనల ఫోటోలతోనే ఆ రెండు పార్టీల మేనిఫెస్టోని తయారు చేసి విడుదల చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
మేనిఫెస్టో విడుదల సమయంలో మీడియ కెమెరాల పోజుల కోసం అయినా మేనిఫెస్టోని పట్టుకోమని బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్ధార్ధ నాథ్ సింగ్ ను కోరినా ఆయన దూరం జరిగిపోయారు. దీంతో కంగారు పడ్డ చంద్రబాబు బిజెపి జాతీయ పార్టీ కాబట్టి వారి మేనిఫెస్టో వారు విడుదల చేసుకున్నారు..సిద్ధార్ధ నాథ్ సింగ్ ఇక్కడ ఉన్నారంటే ఆయన ఈ మేనిఫెస్టోని అంగీకరించినట్లే అన్నారు.దీనికి బిజెపి మద్దతు ఉన్నట్లే అని చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే 2014లో బిజెపి-టిడిపి,-జనసేనలు కలిసే జట్టు కట్టాయి. అప్పుడు కూడా బిజెపి జాతీయ పార్టీయే. అప్పుడు కూడా బిజెపి జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని విడుదల చేసింది. ఏపీలో మాత్రం చంద్రబాబు-పవన్-మోదీల ఫోటోలతో మేనిఫెస్టో పాంప్లెట్ ని విడుదల చేశారు. ఆ సందర్భంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ , వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరువందలకు పైగా హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే 2019 ఎన్నికల్లో టిడిపికి ఏపీ ప్రజలు 23 స్థానాలు మాత్రమే విదిల్చారు. బిజెపికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.ఆ తర్వాత కూడా బిజెపిపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏపీ మేథావులు మండి పడ్డారు. చంద్రబాబు తో అంటకాగినందుకు తమ పరువు కూడా పోయిందని..చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడం వల్ల తమ ఇమేజ్ దెబ్బతిందని బిజెపి నేతలు భావించారు.నిజానికి బిజెపి కూడా విభజన హామీలు అమలు చేయలేదు. దాని ప్రభావం బాబుపైనా పడింది.
అందుకే కొద్ది నెలల క్రితం వరకు టిడిపితో పొత్తుకు బిజెపి నేతలు ఆ మాత్రం ఆసక్తి చూపలేదు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోలేం అని అన్నారు కూడా. అయితే బాబు పదే పదే వెంటపడ్డంతో..ఎన్ని ఎంపీ సీట్లు కావాలంటే అన్ని ఇస్తానని ఆఫర్ ఇవ్వడంతో ఒక్కశాతం ఓట్లు మాత్రమే ఉన్న బిజెపి టిడిపితో పొత్తుకు సై అని ఆరు ఎంపీ స్థానాలు దక్కించుకుంది. అయితే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగానే ప్రతీ చోటా మూడు పార్టీల కూటమి కి అనుకున్న స్థాయిలో జనాదరణ లేకపోవడంతో బిజెపిలో కంగారు మొదలైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామేమో అన్న భావన కమలనాథుల్లో కలిగింది. అయితే అప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోవడంతో వెనక్కి వెళ్లలేక ఊరుకున్నారు. కూటమి కట్టాక చిలకలూరిపేటలో జరిగిన మొదటి సభకీ జనం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు కూటమి వైపు లేనే లేరని నరేంద్ర మోదీకి కూడా అర్ధం అయ్యినట్లుంది.
ఈ క్రమంలోనే ఈ సారి మేనిఫెస్టోపై తమ పార్టీ గుర్తుకానీ మోదీ ఫోటో కానీ లేకుండా జాగ్రత్తపడాలని బిజెపి జాతీయ నాయకులు నిర్ణయించుకుని అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాదు మే 1,2 తేదీల్లో ఏపీలో టిడిపి-బిజెపి సభలు జరగాల్సి ఉన్నాయి . బిజెపి అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సభలు అనూహ్యంగా వాయిదా పడ్డాయంటున్నారు. కొద్ది రోజుల క్రితమే బిజెపి కేంద్ర మంత్రులు ఏపీకి వచ్చి ముస్లిం రిజర్వేషన్లను తాము రద్దు చేస్తామని ప్రకటించారు. నిజానికి ఇపుడు ముస్లిం రిజర్వేషన్ల అంశంపై మాట్లాడాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేవు. అయినా వారు మాట్లాడ్డం వెనుక కూటమికి బిజెపియే వెన్నుపోటు పొడుస్తోందా అన్న అనుమానాలూ వస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…